ముంబై: క్రెడిట్‌కార్డ్‌సహా అన్‌సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరు నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం.. బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ఉద్దేశించిన ‘‘ముందస్తు’’ చర్యని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రిస్క్ కేటాయింపులను 25 శాతం పెంచుతూ ఆర్‌బీఐ కీలక నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
వార్షికంగా ఈ రుణ విభాగం 30 శాతం పెరుగుదల దీనికి నేపథ్యం. ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీలు అన్‌సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మూలధనంపై కూడా ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్ మారకపు విలువలో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉన్నట్లు గవర్నర్ తాజాగా వివరించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్– ఐబీఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ– ఫిక్కీ ఇక్కడ ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఐబీఏసీ 2023 (ఫిక్కీ బ్యాంకింగ్ సమావేశాలు–2023) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ శక్తికాంతదాస్ ప్రారంభోపన్యాసం చేశారు. గవర్నర్ ఈ సందర్భంగా ఏమన్నారంటే..
- బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను తట్టుకుంటూ సుస్థిరంగా కొనసాగుతోంది. వ్యవస్థ గురించి ఆందోళన చెందడానికి తక్షణ కారణం ఏదీ లేదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. అయితే మొండిబకాయిలుగా మారే ఖాతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రమాదకర ధోరణిని ముందే గుర్తించాలి.
- వ్యక్తిగత రుణ నిబంధనలను కఠినతరం చేస్తూ ఇటీవల తీసుకున్న ఫలితాల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. రుణదాతలు తమ రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులను పటిష్టం చేసుకోవాలి.
- బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఎన్‌బీఎఫ్‌సీ పెద్ద రుణగ్రహీతగా ఉంది. రెండింటి మధ్య లోతైన అనుసంధానం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎన్‌బీఎఫ్‌ల రుణ పరిణామాలను నిరంతరం మందింపు చేయాలి.
- రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానం తగిన ఫలితాలు ఇస్తోందన్న విషయం తెలియజేస్తోంది. అయితే ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇది ఆర్‌బీఐకి ‘అర్జునుడు లక్ష్యంపై గురి పెట్టడం లాంటిది’.
వడ్డీరేట్ల విషయంలో హేతుబద్దత పాటించాలి
వడ్డీ రేట్లు క్రమబద్ధీకరించబడినప్పటికీ, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–మైక్రో ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు–ఎంఎఫ్‌ఐ) అధిక నికర వడ్డీ మార్జిన్‌లను పొందుతున్నట్లు కనిపిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఈ సంస్థలు తమ వడ్డీ రేట్లను నిర్ణయించేటప్పుడు రుణగ్రహీతల స్థోమత, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని దాస్ సూచించారు.
అన్‌సెక్యూర్డ్ రుణాల్లో నెమ్మది: ఖారా
అన్‌సెకూర్డ్ రుణ మంజూరీల విషయంలో ఆర్‌బీఐ నిబంధనల కఠినతరం ప్రభావం ఎస్‌బీఐపై కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతుందని బ్యాంకింగ్ ఎస్‌బీఐ చెర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ‘అధిక రిస్క్ కేటాయింపుల’ ప్రభావం డిసెంబర్ త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర వడ్డీ మార్జిన్‌లపై 0.02–0.03 శాతం మేర ఉంటుందని అన్నారు. అయితే తదుపరి త్రైమాసికంలో పరిస్థితి మెరుగుపడుతుందన్న భరోసాను వెలిబుచ్చారు. వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment