అంచనాలు నిజమవుతాయా, లేదా అంటే... ఎవరి విశ్లేషణ వారికి ఉండవచ్చు. కానీ, అంచనాలు అప్రమత్తం కావడానికి పనికొస్తాయనడంలో మాత్రం ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండే అవకాశమే లేదు. ఐరాస ప్రపంచ వాతావరణసంస్థ తాజా అంచనాలు అప్రమత్తం చేస్తున్నాయి. అత్యవసర పరి స్థితిని తలపిస్తున్నాయి.
ఉష్ణతాపాన్ని ఒడిసిపట్టుకొనే గ్రీన్‌హౌస్ వాయువులు, ఎల్‌నినో ఫలితంగా అయిదేళ్ళలో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకొనే అవకాశం ఎక్కువుందన్న తాజా అంచనా అలాంటి ప్రమాద ఘంటికే. మన భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగే అవకాశం మూడింట రెండొంతులుందని ఆ అంచనా సారాంశం. ఈ బీభత్స ప్రభావం భవిష్య త్తులో ఆర్థికంగానూ అపారంగా ఉంటుందని సోమవారం ఆ సంస్థ చేసిన హెచ్చరిక తీవ్రమైనదే.
కొన్నేళ్ళ క్రితం ఊహించినదాని కన్నా పరిస్థితి దిగజారింది. గత శతాబ్దిన్నరలో పర్యావరణానికి మనం చేసిన నష్టం అలాంటిది. పారిశ్రామికీకరణ కాలాని కన్నా ముందు (1850–1900 మధ్య) సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే, 1.5 డిగ్రీల గరిష్ఠ భూతాపోన్నతిని చరమావధిగా పెట్టుకున్నారు. ఆ లక్ష్మణరేఖ దాటితే ఉత్పాతం తప్పదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. 1.5 డిగ్రీలనే గరిష్ఠంగా ఎందుకు పెట్టుకున్నారంటే, అది దాటితే ఈ అదనపు ఉష్ణం కారణంగా జీవావరణ దుష్ప్ర భావం శరవేగంగా వ్యాపిస్తుంది.
తారాజువ్వలా దూసుకుపోతుంది. అందుకే, భూతాపోన్నతిని ఆ గీత దాటకుండా నియంత్రించాలని 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలోనే తీర్మానించారు. ఈ గీతను చేరే అవకాశం తక్కువని 2015లో అనుకున్నారు. తీరా 2020కి వచ్చేసరికి అయిదింట ఒక వంతు ఛాన్సుందని తేలింది. నిరుడు ఆ ముప్పు 50 శాతం ఉండేది. ఇప్పుడు పరిమితిని దాటేసే ప్రమాదం 66 శాతానికి పెరిగిపోయింది. అంటే వచ్చే 2027 రెడ్ ఎలర్ట్ నామవత్సరం. ప్రపంచం ఉష్ణగుండమే.
ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 2016లో రికార్డయింది. ప్రాతిపదికగా తీసుకున్న 1900 నాటి ముందు కాలంతో పోలిస్తే, ఆ ఏటి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.3 డిగ్రీలు ఎక్కువ నమో దైంది. ఆ ఉష్ణరికార్డును దాటేరోజు ఎంతో దూరంలో లేదన్నదే ఇప్పుడున్న ఆందోళన. పర్యావరణ మార్పుతో పాటు చక్రభ్రమణమైన ఎల్‌నినో ప్రభావమూ అగ్నికి ఆజ్యం పోస్తోంది.
ఈ ఏడాది ఆసియా ప్రాంతాన్ని సాధారణంగా అధికంగా ఈ సెగ వేగిస్తుందని అంచనా. నిజానికి 1970 నుంచి 2021 మధ్య దుర్భర వాతావరణ మార్పులతో దాదాపు 12 వేల ఉత్పాతాలు జరిగాయని లెక్క. వాటి వల్ల 20 లక్షల మందికి పైగా మరణిస్తే, 4.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టాలు జరిగాయి. మరోలా చెప్పాలంటే, ఆ మొత్తం నష్టాలు భారతదేశ జీడీపీలో 25 శాతానికి పైమాటే!
మన దేశం సంగతికొస్తే.. వార్షిక సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 1901 నుంచి ప్రతి రెండు దశాబ్దాల కాలాన్ని పోల్చి చూస్తే, గత 20 ఏళ్ళ కాలంలో ఎన్నడూ లేనంతగా హెచ్చాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా పరిశోధనా పత్రమే ఆ సంగతి వెల్లడించింది. 1975 నుంచి తుపానులు, వరదలు అధికమయ్యేసరికి వ్యవసాయ ఉత్పత్తి, దరిమిలా ఆహార ధరలు విపరీతంగా ప్రభావితమయ్యాయి.
వాతావరణ ఉత్పాతాలకు ప్రభావితమయ్యే దేశాల జాబితా వేస్తే... ‘ప్రపంచ పర్యావరణ మార్పు ప్రమాద సూచి 2021’లో భారత్ 7వ స్థానంలో ఉంది. స్వాతంత్య్ర కాలంతో పోలిస్తే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, అనుబంధ రంగాల కన్నా సేవారంగం పాలు గణనీయంగా పెరిగినా, ఉష్ణతాపంతో అన్ని రంగాలకూ తిప్పలు తప్పవు. వచ్చే 2030 నాటికి ఎండ వేడిమికి ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాల్ని నష్టపోవాల్సి వస్తుందట. అందులో 3.4 కోట్లు భారత్‌లోనే సంభవిస్తాయని 2020లోనే ప్రపంచ బ్యాంక్ మాట.
అలాగే, పెరిగే సముద్రమట్టంతో ప్రపంచంలో అత్యధికంగా చిక్కుల్లో పడేదీ మన దేశమే! ‘పర్యావరణ మార్పుపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సంఘం’ (ఐపీసీసీ) నిరుడు ఆ సంగతి కుండ బద్దలు కొట్టింది. ఈ శతాబ్ది మధ్యకల్లా 3.5 కోట్ల భారతీయులు ఏటా సముద్రతీర ముంపు బారిన పడతారు.
ఈ శతాబ్దాంతానికి ఆ సంఖ్య 4.5 నుంచి 5 కోట్లవుతుందని అంచనా. అందుకే, పర్యావ రణంపై అంతంత మాత్రపు విధానాలనే అనుసరిస్తే కష్టమే. 2070 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్య సాధన పెట్టుకున్నప్పటికీ 2050 కల్లా భారత జీడీపీ 8.5 నుంచి 10 శాతం దాకా తగ్గే ముప్పుంది. విధానపర మైన లోచూపును అందించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ ఎకనామెట్రిక్ మోడల్ వేసిన లెక్క ఇది.
ఈ లెక్కలు, చెబుతున్న మాటలు అంచనాలే కదా అని అలక్ష్యం చేస్తే కష్టమే. పర్యావరణ విశ్లేషణకు దీర్ఘకాలాల్ని ఎంచుకోవాలి గనక, ప్యారిస్‌లో చేసుకున్న బాసల్ని నిలిపామా, చెరిపామా అన్నది 2040కి కానీ నిర్ధరించలేం. అప్పటికి తెలిసినా పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే దేశాలన్నీ చేతులు కలిపి, ప్రమాద నివారణకు ప్రయత్నించడమే ఏకైక మార్గం. తక్షణమే హరిత ఇంధనం వైపు మరలాలి. భావి బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలి.
అలా చేయాలంటే ధనిక దేశాలు తమ కర్బన ఉద్గారాల పాపాల శాపాలను అనుభవిస్తున్న అమాయక వర్ధమాన దేశాలకు నష్టపరిహారం చేయాలి. మునుపు మాట ఇచ్చిన వందల కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించాలి. పాశ్చాత్య ప్రపంచం పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేస్తే సరిపోదు. సత్వరమే ఆ మార్పుల నుంచి వెనక్కుమళ్ళి యథాపూర్వ స్థితికి వాతావరణం వచ్చేలా కృషిచేయాలి. ఉష్ణోగ్రతనూ, తద్వారా పర్యావరణ ఉత్పాతాన్నీ, ఆర్థికనష్టాలనూ తగ్గించడమే ఇక కర్తవ్యం.
అయిదేళ్ళలో ఉష్ణగుండమేనా?
Published Wed, May 24 2023 3:32 AM | Last Updated on Wed, May 24 2023 3:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment