రాష్ట్ర వ్యాప్తంగా వేసవిని తలపిస్తోన్న వాతావరణం.. మరో 3 రోజులు ఇదే పరిస్థితి
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం
గాలిలో తేమ శాతం పెరగడం వల్లే ఇలా
అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత
పశ్చిమ గోదావరి జిల్లాలో 89 శాతం గాలిలో తేమ
రానున్న మూడు రోజుల్లో భారీగా వర్షాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వర్షాలు అధికంగా ఉన్న కోస్తా జిల్లాలతో పాటు కనీస వర్షపాతం నమోదు కాని రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తాజా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నట్టు జనం వాపోతున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఉక్కపోత కారణంగా వేసవి తరహాలో గృహ విద్యుత్ వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీల వినియోగం ఆగస్టులో తీవ్రంగా పెరిగినట్టు తేలింది. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తుపానుకు రెండు రోజుల ముందు ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో పీడనం తగ్గినప్పుడు గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా ఉన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువ దాహంగా ఉండటం కనిపిస్తుందంటున్నారు.
రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనంతపురంలోని రేకుల కుంట వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.
తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉక్కపోత ఉంటుంది. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావమే. వాతావరణంలో మార్పులు కూడా కొంత మేరకు ఈ పరిస్థితికి కారణం’ అని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త విజయశంకర్ బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment