
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు.
చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment