న్యూఢిల్లీ: ప్రపంచం తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లోనే కొనసాగుతున్నందున ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం), రుణ సమీకరణల కట్టడి వంటి అంశాల్లో దూకుడు ప్రదర్శించరాదని కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ సూచించారు. రానున్న 2023–24 వార్షిక బడ్జెట్‌లో ఈ మేరకు కఠిన ద్రవ్య విధానాలను అనుసరించవద్దని ఆమె సలహాఇచ్చారు. 2021–22లో 6.71 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2022–23లో 6.4 శాతానికి తగ్గాలని, 2025–26 నాటికి 4.5 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే.
వ్యయాలు ఆర్థిక పురోగమనానికి బాట వేయాలి..
ప్రభుత్వం చేసే వ్యయాలు పన్ను రాబడులు పెంచే విధంగా కాకుండా, ఆర్థిక వ్యవస్థ పురోగమనమే ప్రధాన ధ్యేయంగా జరగాలని అన్నారు. ప్రభుత్వ రుణాలు కూడా అభివృద్ధికి బాటలు వేయడం లక్ష్యంగా ఉండాలన్నారు. భారం మోపని పన్ను విధానాలను అనుసరించాలని, తద్వారా పన్ను బేస్ విస్తరణకు కృషి జరగాలని ఆమె సూచించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమంటే, భవిష్యత్ తరాలపై భారం మోపడమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వస్తున్న ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ నేపథ్యంలో అషిమా ఈ వ్యాఖ్యలు చేశారు.
పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్‌డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు ఇప్పటికే ఓపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. జార్ఖండ్ కూడా ఓపీఎస్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ ఇటీవలే పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడానికి ఆమోదముద్ర వేసింది.
ద్రవ్యోల్బణం కట్టడికి మనమే బెటర్...
నవంబర్‌ను మినహాయిస్తే అంతకుముందు గడచిన 10 వరుస నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు రాకపోవడానికి కారణం... ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల, సరఫరాల సమస్య, ఆహార ధరలు పెరగడం వంటి అంశాలు కారణమని అన్నారు. సరఫరాలవైపు తొలగుతున్న సమస్యలు నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు రావడానికి కారణమని అన్నారు. వృద్ధికి విఘాతం కలుగకుండా ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దిగురావడం హర్షణీయ పరిణామని పేర్కొన్న ఆమె, ‘‘పలు ఇతర దిగ్గజ ఎకానమీలతో పోల్చితే సవాళ్లను భారత్ సమర్థవంతంగా అధిగమించగలిగింది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment