Ashima Goyal
-
భారత్ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్ అవుట్‌లుక్ 6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది. ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది. 5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్: ఇండియా రేటింగ్స్ మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్ షీట్లు, గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్ ప్రధాన ఎకనమిస్ట్ సునిల్ కుమార్ పేర్కొన్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్ ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు. -
హిండెన్‌బర్గ్ - అదానీ వివాదం : అషిమా గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత మార్కెట్లు మరింత బలంగా, వైవిధ్యంగా మారాయని ఆర్బీఐ ఎంపీసీ సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఇవి అదానీ గ్రూపు అంశాన్ని సాఫీగా సర్దుబాటు చేసుకున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర సంస్థలకు వ్యాపించలేదని లేదా సంక్షోభంగా మారలేదని గుర్తు చేశారు. నియంత్రణ సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను కఠినతరం చేశాయని, అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. విడిగా గ్రూపులకు సంబంధించి ప్రభుత్వానికి ఆందోళన లేదన్నారు. జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. విదేశాలకు అక్రమ మార్గాల్లో డబ్బులు తరలించి, షెల్ కంపెనీల ద్వారా ఇక్కడ అదానీ గ్రూపు షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపించింది. ఖాతాల్లోనూ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. వీటిని అదానీ గ్రూపు ఖండించింది. భారత్‌కు చెందిన బడా కార్పొరేట్లు విదేశీ నిధులు సమీకరిస్తుండడంతో, విదేశీ అనలిస్టుల వైపు నుంచి వాటి ఖాతాలపై సునిశిత పరిశీలన ఉంటుందని గోయల్ చెప్పారు. ‘‘భారతీయ సంస్థలు ఇప్పటికీ సంక్లిష్టమైన నిర్మాణాలను కలిగి ఉన్నాయి. దీంతో పారదర్శకత లోపిస్తోంది. ఫలితంగా హిండెన్‌బర్గ్ వంటి సంస్థలకు అవకాశాలు కల్పిస్తోంది.’’అని గోయల్ అభిప్రాయపడ్డారు. -
Budget 2023: క్లిష్ట పరిస్థితుల్లో కఠిన ద్రవ్య విధానం తగదు
న్యూఢిల్లీ: ప్రపంచం తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లోనే కొనసాగుతున్నందున ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం), రుణ సమీకరణల కట్టడి వంటి అంశాల్లో దూకుడు ప్రదర్శించరాదని కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ సూచించారు. రానున్న 2023–24 వార్షిక బడ్జెట్లో ఈ మేరకు కఠిన ద్రవ్య విధానాలను అనుసరించవద్దని ఆమె సలహాఇచ్చారు. 2021–22లో 6.71 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2022–23లో 6.4 శాతానికి తగ్గాలని, 2025–26 నాటికి 4.5 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. వ్యయాలు ఆర్థిక పురోగమనానికి బాట వేయాలి.. ప్రభుత్వం చేసే వ్యయాలు పన్ను రాబడులు పెంచే విధంగా కాకుండా, ఆర్థిక వ్యవస్థ పురోగమనమే ప్రధాన ధ్యేయంగా జరగాలని అన్నారు. ప్రభుత్వ రుణాలు కూడా అభివృద్ధికి బాటలు వేయడం లక్ష్యంగా ఉండాలన్నారు. భారం మోపని పన్ను విధానాలను అనుసరించాలని, తద్వారా పన్ను బేస్ విస్తరణకు కృషి జరగాలని ఆమె సూచించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమంటే, భవిష్యత్ తరాలపై భారం మోపడమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వస్తున్న ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ నేపథ్యంలో అషిమా ఈ వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు ఇప్పటికే ఓపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. జార్ఖండ్ కూడా ఓపీఎస్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ ఇటీవలే పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడానికి ఆమోదముద్ర వేసింది. ద్రవ్యోల్బణం కట్టడికి మనమే బెటర్... నవంబర్‌ను మినహాయిస్తే అంతకుముందు గడచిన 10 వరుస నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు రాకపోవడానికి కారణం... ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల, సరఫరాల సమస్య, ఆహార ధరలు పెరగడం వంటి అంశాలు కారణమని అన్నారు. సరఫరాలవైపు తొలగుతున్న సమస్యలు నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు రావడానికి కారణమని అన్నారు. వృద్ధికి విఘాతం కలుగకుండా ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దిగురావడం హర్షణీయ పరిణామని పేర్కొన్న ఆమె, ‘‘పలు ఇతర దిగ్గజ ఎకానమీలతో పోల్చితే సవాళ్లను భారత్ సమర్థవంతంగా అధిగమించగలిగింది’’ అని అన్నారు. -
పన్ను వసూళ్లు పెరగడానికి డీమానిటైజేషన్ కారణం
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) కూడా తోడ్పడిందని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు ఆషిమా గోయల్ తెలిపారు. అంతిమంగా .. పెద్ద సంఖ్యలో ట్యాక్స్‌పేయర్లపై తక్కువ స్థాయిలో పన్నులు విధించగలిగే ఆదర్శవంతమైన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆమె పేర్కొన్నారు. నల్ల ధనం చలామణీని అరికట్టేందుకు, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత ఆదాయాలపై పన్నుల స్థూల వసూళ్లు 24 శాతం పెరిగి రూ. 8.98 లక్షల కోట్లకు చేరినట్లు ఆదాయ పన్ను విభాగం అక్టోబర్ 9న వెల్లడించింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ. 1.40 లక్షల కోట్ల పైగానే నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 26 శాతం పెరిగి (గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
ధరల స్పీడ్‌కు వడ్డీ రేటు పెంపు బ్రేక్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) పెంపు చర్యలు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్డికి దోహదపడుతుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ స్పష్టం చేశారు. 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివస్తుందన్న బరోసా ఇచ్చారు. వ్యవస్థలో ప్రస్తుత వడ్డీరేట్లు వృద్ధి రికవరీకి ఎటువంటి విఘాతం ఏర్పడని స్థాయిలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుముఖం పడతాయని, సరఫరాల చైన్ మున్ముందు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆమె ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో తెలిపారు. సరఫరాల వైపు సమస్యలను తగ్గించడానికి భారత్ ప్రభుత్వం నుంచి సైతం తగిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇవన్నీ వచ్చే ఐదారు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని మరో ఎంపీసీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. కరెన్సీ విషయంలో మనం బెస్ట్ డాలర్ మారకంలో భారత్ రూపాయి ఎప్పటికప్పుడు చరిత్రాత్మక కనిష్టాలను తాకుతున్న అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో ఒకరైన గోయల్ సమాధానం చెబుతూ, ‘క్షీణించిన రూపాయి దిగుమతుల బిల్లును మరింత పెంచుతుంది. విదేశాలలో రుణాలు తీసుకున్న వారిని సమస్యల్లోకి నెడుతుంది. అయితే కొంతమంది ఎగుమతిదారులకు రాబడిని పెంచుతుంది’ అని అన్నారు. ఫెడ్ రేట్లు పెరగడం వల్ల అమెరికా తిరిగి వెళుతున్న డాలర్ల వల్ల ఈ రిజర్వ్ కరెన్సీ విలువ పెరుగతోందని అన్నారు. అన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోందని వివరించారు. ఇతర అభివృద్ధి చెందిన, వర్థమాన మార్కెట్లతో పోల్చితే రూపాయి విలువ పతనం తక్కువగా ఉందని అన్నారు. ఇటీవల ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ కూడా తిరిగి పెరుగుతున్నట్లు తెలిపారు. భారత్ ఈక్విటీల ధరల పతనం తక్కువగా పలు దేశాలతో పోల్చితే తక్కువగా ఉందని స్పష్టం చేశారు. భారత్ మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. వాల్యుయేషన్ ప్రభావాల వల్లే భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) ఎక్కువగా పడిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఫారెక్స్ ఏడాది కాలంలో దాదాపు 100 డాలర్ల తగ్గి 544 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 77 శాతం వ్యాల్యుయేషన్ల ప్రభావం వల్లే తగ్గాయని ఆర్బీఐ సెప్టెంబర్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వివరించిన సంగతి తెలిసిందే. తక్కువ దిగుమతులు– అధిక ఎగుమతులు కరెంట్ ఖాతా (భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసం) లోటును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్న ఆమె, ఎగుమతుల పెంపు ఆవశ్యకతను ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మందగమనం ప్రతికూలమే, కానీ... ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయంపై అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానం చెబుతూ, ప్రపంచ మందగమనం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ‘కానీ భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉంది. దాని పరిమాణం, వైవిధ్యం, వైశాల్యం, ఆర్థిక రంగం బలం మంచి సానుకూల వృద్ధినే అందిస్తుంది’’ అని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కార్పొరేట్లు రుణాన్ని తగ్గించుకున్నారని, ఆర్థిక రంగం బాగా మూలధనం పొందిందని గోయల్ తెలిపారు. ఇవన్నీ భారతదేశానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే ‘మందగమన’ సవాళ్లను తగ్గిస్తాయని వివరించారు. డిసెంబర్లో మరో అరశాతం పెంపు అవకాశం అషిమా గోయల్ ప్రకటన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకూ జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును కనీసం అరశాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. -
వృద్ధికి ఆర్బీఐనే అడ్డంకి!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అంచనాలు ఉండాల్సినదానికన్నా ఎక్కువగానే ఉంటాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు ఆషిమా గోయల్ వ్యాఖ్యానించారు. ఇదే అంచనాలతో వడ్డీ రేట్లను తగ్గించటం లేదని, దీంతో ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్బీఐ అభిప్రాయం సరైనది కాదు. వడ్డీ రేట్లను అధిక స్థాయిలోనే ఉంచడం వల్ల ఉత్పత్తిని త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని ఆషిమా స్పష్టంచేశారు. ‘ఆర్బీఐ ఎప్పుడూ ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భావిస్తూ ఉంటుంది. అందుకని ద్రవ్యోల్బణంపై వారి అంచనాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఇక వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చన్న అభిప్రాయం కూడా వారికి ప్రతికూలంగానే పనిచేస్తోంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే తీరు అని రుజువైంది కూడా’’ అని ఇంటర్వ్యూలో ఆమె అభిప్రాయపడ్డారు. 2015 జనవరి నాటికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 8 శాతం స్థాయిలో ఉంటుందని 2014 ఏప్రిల్‌లో ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, వాస్తవానికి ఇది 5.2 శాతానికే పరిమితమైంది. అలాగే 2016 మార్చి నాటికి సీపీఐ 5.8 శాతానికి ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఇది 4.83 శాతం మాత్రమే నమోదైంది. అటు మార్చి 2017 కల్లా సీపీఐ 5 శాతంగా ఉండొచ్చని 2016 తొలినాళ్లలో అంచనా వేసినప్పటికీ.. 3.89 శాతానికే పరిమితమైంది. 2014 నుంచి ముడిచమురు రేట్లు తగ్గుతూ వచ్చినప్పటికీ.. ఈ తగ్గుదల నిలబడేది కాదని, ద్రవ్యోల్బణం ఇంకా.. ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తూ వచ్చిందని ఆషిమా చెప్పారు. కమోడిటీల రేట్లే కీలకం.. వాస్తవానికి ద్రవ్యోల్బణం అనేది కమోడిటీలు, ఆహార వస్తువుల ధరల పెరుగుదలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని.. వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చనే అభిప్రాయం సరికాదని ఆషిమా చెప్పారు. ఇతరత్రా వేరే అంశాలతో పోలిస్తే.. అధిక వడ్డీ రేట్ల కన్నా కూడా చమురు ధరలు, ఆహార వస్తువుల రేట్లే ద్రవ్యోల్బణంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను మరింతగా తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత నాలుగు శాతానికి లోబడే (రెండు శాతం అటూ ఇటుగా) ఉండనున్న నేపథ్యంలో కీలక పాలసీ రేటును మరో 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) మేర తగ్గించేందుకు ఆర్బీఐకి వెసులుబాటు ఉంది‘ అని ఆషిమా వివరించారు. స్థూల డిమాండ్ తీరుతెన్నుల ఆధారంగా ఆర్బీఐ పనిచేస్తూ ఉంటుందని.. దేశీయంగా ప్రస్తుతం ఇది బలహీనంగా ఉందని ఆమె పేర్కొన్నారు. డిమాండ్ బలహీనంగా ఉండటం వల్ల ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంటుందని.. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ముందుగా ఉత్పత్తిపైనే ప్రభావం పడుతోందే తప్ప ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఆషిమా చెప్పారు. ఇటు వినియోగం, అటు పెట్టుబడులు మందగతిన ఉండటం వల్ల భారత్ ఈ ఆర్థిక సంవత్సరం 6.5 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదు చేయొచ్చని.. 2014 తర్వాత ఇదే అత్యంత తక్కువ కాగలదని ఆమె పేర్కొన్నారు. రికవరీ ఉంది కానీ... త్రైమాసికాల వారీగా రెండో క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.7 శాతం నుంచి 6.3 శాతానికి మెరుగుపడటంపై స్పందిస్తూ.. రికవరీ కనిపిస్తున్నా పెద్ద స్థాయిలో లేదని ఆషిమా చెప్పారు. డిమాండ్‌పరమైన ప్రతిబంధకాలు ఇంకా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ద్రవ్య, పరపతి విధానాలన్నీ సాధ్యమైనంత వరకూ ఉపయోగించుకోవాలని చెప్పారు. కమోడిటీల ధరల తగ్గుదల, పప్పుధాన్యాల సరఫరాను ప్రభుత్వం మెరుగ్గా నిర్వహిస్తుండటం, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ మెరుగుపడటం, చమురు ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగవచ్చన్న అంచనాల నడుమ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండగలదని ఆషిమా పేర్కొన్నారు. మరోవైపు వ్యవస్థాగతమైన సంస్కరణలు జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ.. ఆర్బీఐ పాటిస్తున్న కఠిన ద్రవ్యపరపతి విధానమనేది వినియోగం, పెట్టుబడి డిమాండ్‌కి అడ్డంకులు సృష్టిస్తోందని ఆమె వివరించారు. -
ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీ చైర్మన్ రాజీనామా
ముంబై/న్యూఢిల్లీ: ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీచైర్మన్ పదవికి జీకే పిళ్లై రాజీనామా చేశారు. 2008లో ఎక్స్ఛేంజీకి లెసైన్స్ లభించడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పిళ్లై రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి అప్పట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి చైర్మన్‌గా పనిచేసిన భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పిళ్లై రాజీనామాతో ఎక్స్ఛేంజీ చైర్మన్ పదవిని ఎల్ఐసీ మాజీ చైర్మన్, ఎక్స్ఛేంజీ వైస్‌చైర్మన్ థామస్ మాథ్యూ చేపట్టారు. వైస్‌చైర్మన్‌గా ఆషిహా గోయల్ నియమితులయ్యారు. పలు సవాళ్ల మధ్య తాను పదవిని చేపట్టానని, ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని పిళ్లై చెప్పారు. అయినప్పటికీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో ఎక్స్ఛేంజీ నడుస్తుందని తెలిపారు. ఇకపై ఎక్స్ఛేంజీ సీఈవో సౌరభ్ సర్కార్ మరింత కీలకంగా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పిళ్లైసహా నలుగురు సభ్యుల బోర్డును గతేడాది సెబీ నియమించిన విషయం విదితమే. ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో బోర్డును సెబీ పునర్వ్యవస్థీకరించింది. అయితే ఎక్స్ఛేంజీకి చెందిన ట్రేడింగ్ సభ్యులు, వాటాదారుల ఆందోళనలను తొలగించేందుకు ఇటు ప్రభుత్వం, అటు సెబీ తాజాగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎంసీఎక్స్ఎస్ఎక్స్లో ఐఎఫ్సీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. రైట్స్ ఇష్యూకి స్పందన ఒక షేరుకి రెండు షేర్ల నిష్పత్తిలో చేపట్టిన రైట్స్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్ కొత్త యాజమాన్యం తెలిపింది. శనివారం నో ట్రేడింగ్ వ్యవసాయ కమోడిటీలలో శనివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) నిషేధించింది. 2014 ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల కమోడిటీలలోనూ అన్ని ఎక్స్ఛేంజీలూ శనివారం ట్రేడింగ్ నిర్వహించడాన్ని ఎఫ్ఎంసీ తాజాగా నిషేధించింది. ఎన్‌బీహెచ్‌సీ విక్రయం నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్(ఎన్‌బీహెచ్‌సీ)ను ఇండియా వ్యాల్యూ ఫండ్ ట్రస్టీకు రూ. 242 కోట్లకు విక్రయించనున్నట్లు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ తెలిపింది. వివిధ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ టెక్ ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు సంబంధించి లిస్టింగ్ ఒప్పందంలో భాగంగా ఎన్బీహెచ్సీను విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.5% పతనమై రూ. 361 వద్ద ముగియగా, ఎంసీఎక్స్ సైతం అదే స్థాయిలో దిగజారి రూ. 493 వద్ద నిలిచింది.