న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) అనుబంధ సంస్థ అయిన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 5, 6 తేదీల్లో అబుదాబిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరువైపులా సంతకాలు చేయనున్నారు.
ఈ ఒప్పందంతో సీమాంతర చెల్లింపులకు వీలు కలుగనుంది. పెట్టుబడులకు సంబంధించి భారత్–యూఏఈ 11వ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశానికి మంత్రి పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించనున్నారు. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం సహాధ్యక్షత వహిస్తారు. ముబదాలా ఎండీ, సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్‌తో మంత్రి గోయల్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు.
యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. ఇరు దేశాల్లో మరో దేశం పెట్టుబడులకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై రెండు దేశాలు చర్చించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జాయింట్ టాస్క్‌ఫోర్స్ రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నట్టు పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా రెండు దేశాల మధ్య 2013లో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment