కొత్త బ్యాంకులు వచ్చేస్తున్నాయ్..!
మరింత మందికి సేవలు...
♦ తలా పది పేమెంట్, చిన్న బ్యాంకులకు లెసైన్సు
♦ వచ్చే రెండు మూడు నెలల్లో కొన్ని మొదలు
♦ భారీ సక్సెస్ చూసిన చిన్న బ్యాంకుల ఐపీఓలు
♦ మారనున్న బ్యాంకింగ్ ముఖచిత్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండల్లా పేరుకుపోయిన ఎన్‌పీఏలతో నిత్యం వార్తల్లో ఉంటున్న భారతీయ బ్యాంకింగ్ రంగం... సమూలంగా మారబోతోంది. ఒకవైపు పేమెంట్ బ్యాంకులు, మరోవైపు చిన్న బ్యాంకులు రానుండగా... కొత్తగా యూనివర్సల్ బ్యాంకులకు కూడా లెసైన్సులిస్తామంటూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్‌బీఐ జారీ చేసింది. పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందిన ఎయిర్‌టెల్, పేటీఎం కార్యకలాపాలను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా... చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందిన ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు కూడా వచ్చి దుమ్మురేపాయి. పరిస్థితి చూస్తుంటే త్వరలో ఊరికో బ్యాంకు స్థాయి నుంచి వీధికో బ్యాంకు వచ్చేలా కనిపిస్తోంది.
పేమెంట్ బ్యాంకుల్లో దిగ్గజాలు...
గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ 10 పేమెంట్ బ్యాంకులకు, 10 చిన్న బ్యాంకులకు సూత్రప్రాయ లెసైన్సులిచ్చింది. ఎయిర్‌టెల్, పేటీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందగా... ఉజ్జీవన్ ఫైనాన్షియల్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఈఎస్‌ఏఎఫ్ మైక్రోఫైనాన్స్ వంటివి చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందాయి. చిన్న బ్యాంకు లెసైన్సు పొందిన వాటిలో 8 సంస్థలు ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ రంగంలో ఉన్నవే.
వీటిలో అన్నింటికన్నా ముందు.. జలంధర్‌కు చెందిన క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఏప్రిల్‌లోనే 10 శాఖలతో కార్యకలాపాలు ప్రారంభించేసింది. ప్రస్తుతం రూ.3,000 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని .. చిన్న బ్యాంకు కార్యకలాపాలతో అయిదేళ్లలో రూ. 12,000 కోట్లకు, శాఖల సంఖ్యను 216కు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇక, చెన్నై సంస్థ ఈక్విటాస్ హోల్డింగ్స్ ఈ మధ్యే ఐపీవోకి వచ్చి రూ.2,170 కోట్లు సమీకరించింది. ఈ ఐపీవో ఏకంగా 17 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యిందంటే... వీటి భవిష్యత్‌పై మదుపరులకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ రూ.885 కోట్ల ఐపీవోకి రాగా ఇది ఏకంగా 41 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. బ్యాంకింగ్ సేవలు లేని ప్రాంతాల్లో కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేయాలని ఉజ్జీవన్ యోచిస్తోంది. ఇప్పటికే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్- మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో దీనికి 11.15% మార్కెట్ వాటా ఉంది. 24 రాష్ట్రాల్లో సుమారు 470 శాఖలు ఉన్నాయి. తొలి దశలో వీటిలో 40 శాతాన్ని బ్యాంకు శాఖలుగా మార్చాలని ఉజ్జీవన్ భావిస్తోంది.
టెక్నాలజీపైనే పేమెంట్ బ్యాంకుల దృష్టి...
పేమెంట్ బ్యాంకు లెసైన్సు పొందిన ఎయిర్‌టెల్... ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్యలో కార్యకలాపాలు ఆరంభించనుంది. ప్రస్తుతం 800 పట్టణాల్లో ఎయిర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ సంస్థ... మనీ ట్రాన్స్‌ఫర్, సెమీ క్లోజ్డ్ వాలెట్ సేవలు అందిస్తోంది. అటు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కూడా ఆగస్టులో కార్యకలాపాలు ఆరంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో ప్రారంభించి మిగతా ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి కావాల్సిన టెక్నాలజీ ఇన్‌ఫ్రా కోసం విప్రోతో చేతులు కలిపింది. ఆదిత్య బిర్లా నువో, పోస్టల్ విభాగం, ఫినో పేటెక్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్‌ఎస్‌డీఎల్), ఆర్‌ఐఎల్, టెక్ మహీంద్రా, వొడాఫోన్ ఎం-పెసా, దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా వ్యవస్థాపకుడు), విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం సీఈవో) తదితరులకు పేమెంట్ బ్యాంకు లెసైన్సులొచ్చాయి. ఇలాంటి కొత్త బ్యాంకులు రాక ఆహ్వానించ దగ్గదేనని, వీటివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పరిధి పెరిగి మరింత మందికి సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ బ్యాంకుల్లో తేడాలివీ...
♦ చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల లక్ష్యాలు, సర్వీసుల్లో తేడాలుంటాయి. చిన్న బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించడం, వాణిజ్య బ్యాంకుల నుంచి పెద్దగా రుణాలు పొందలేని వర్గాలకు రుణాలివ్వడం వంటివి చేస్తాయి. చిన్న రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న తరహా వ్యాపార సంస్థలకు రుణ సదుపాయం కల్పిస్తుంటాయి.
♦ పేమెంట్ బ్యాంకుల సంగతి తీసుకుంటే... ఇవి పరిమితమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్సులు మొదలైన సర్వీసులు అందిస్తాయి. టర్మ్ డిపాజిట్లు స్వీకరించడం, రుణాలివ్వడం వంటివి చేయవు. ఇవి గరిష్టంగా ఒకో ఖాతాదారు నుంచి రూ.లక్ష దాకా మాత్రమే డిపాజిట్లు స్వీకరించగలవు. ఇవి ప్రభుత్వ బాండ్లు మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబడులు పొందుతాయి.
♦ వాణిజ్య బ్యాంకులైతే ఖాతాలు, టర్మ్ డిపాజిట్లు, పెద్ద మొత్తాల్లో రుణాలు, ఓవర్ డ్రాఫ్టులు, రెమిటెన్సులు మొదలైన పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి.