Man Stayed At 5 Star Hotel For 2 Years Without Paying, Know What Happens Next - Sakshi
Sakshi News home page

బిల్లు కట్టకుండా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే!

Published Wed, Jun 21 2023 5:31 PM | Last Updated on Wed, Jun 21 2023 6:25 PM

Man Stayed At 5 Star Hotel For 2 Years Without Paying Know What Happens Next - Sakshi

ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ అంటేనే విలాసవంతమైన వసతులకు కేరాఫ్‌ అడ్రస్‌. విశాలమైన గదులు, హై క్లాస్‌ ఫుడ్‌, కళ్లు చెదిరే స్మిమ్మింగ్‌ ఫుల్‌ ఇలా ప్రతి ఒక్కటి లగ్జరీస్‌గా ఉంటాయి. సామన్యులు ఈ హోటల్‌లో ఉండటం ఎంతో ఖరీదైన వ్యవహారం. ఒక్క రోజు ఇక్కడ బస చేయాలన్న లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి దాదాపు రెండేళ్లుగా ఫైవ్ స్టార్ హోటల్‌లోనే గడిపాడు. అది కూడా బిల్లు చెల్లించకుండ.. వినడానికి కొంచెం ఆశ్యర్యంగా అనిపించినా ఈ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. 

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఎరోసిటీలో రోసేట్ హౌస్ అనే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఉంది. అయితే ఆ హోటల్‌ సిబ్బందితో కుమ్మక్కై రెండేళ్లపాటు ఓ వ్యక్తి ఎలాంటి బిల్లు కట్టకుండా ఉండటంతో రూ. 58 లక్షల నష్టం వాటిల్లిందని సదరు హోటల్‌ యాజమాని వినోద్‌ మల్హోత్రా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..

అంకుశ్‌ దత్తా అనే వ్యక్తి 2019 మే 30న  ఒకరోజు నిమిత్తం హోటల్‌లో దిగాడు. మరుసటి రోజు ఖాళీ చేయాల్సి ఉంది. కానీ దాన్ని ఆయన 2021 జనవరి 22 వరకు పొడిగించుకుంటూ వచ్చాడు. మొత్తం 603 రోజులు ఉన్నాడు. చివరకు బిల్లు చెల్లించకుండానే తప్పించుకోవడంతో అతను హోటల్‌కు రూ.58 లక్షలు బకాయిపడ్డాడు. ఆడిట్‌లో రికార్డుల తనిఖీల సందర్భంగా ఇటీవల ఈ మోసం బయటపడింది.హోటల్‌ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి బిల్లు చెల్లించకుండా  72 గంటలకు పైగా ఉంటే. ఆ విషయాన్ని వెంటనే సిబ్బంది హోటల్‌ సీఈఓ, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పై స్థాయికి అధికారులకు తీసుకెళ్లలేదని సదరు వ్యక్తి వెల్లడించారు.
చదవండి: ఇదేంటండీ..! ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేస్తారా..?

అయితే హోటల్‌ సిబ్బంది కొంతమంది అంకుశ్‌ దత్తాకు సహకరించినట్లు హోటల్‌ ప్రతినిధి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఫ్రంట్‌ ఆఫీస్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రేమ్‌ ప్రకాష్‌, మరి కొందరు కలిసి హోటల్‌ గదులను యాక్సెస్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ను మార్చి, అకౌంట్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. హోటల్‌ నిబంధలు ఉల్లంఘించి దత్తాను హోటల్‌లో బస చేయించాడని ఆరోపించారు. దీనికి ప్రకాష్‌, దత్తా నుంచి కొంత మొత్తంలో నగదు పొంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. 

ఈ వ్యవహారం మొత్తంలో  ప్రేమ్‌ ప్రకాష్‌  కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ప్రకాష్ మే 30 2019 నుంచి అక్టోబరు 25 2019 వరకు ఎలాంటి పేమెంట్ రిపోర్ట్‌లు చేయలేదని అయితే అక్టోబరు 25 తర్వాత అతను దత్త బాకీ ఉన్న పేమెంట్ రిపోర్ట్‌ను రూపొందించినప్పుడు కావాలనే ఇతర పెండింగ్‌ బిల్లులతో కలిపి రిపోర్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే బిల్లులను ఫోర్జరీ చేసి నిందితుడికి అనుకూలంగా అనేక నకిలీ బిల్లులను సృష్టించినట్లు చెప్పారు. 

అయితే దత్తా మూడు వేర్వేరు తేదీల్లో మూడు సార్లు వరుసగా రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షలు విలువ చేసే చెక్కులను ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, అవి బౌన్స్‌ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కూడా ప్రకాశ్‌ దాచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో హోటల్‌ ప్రతినిధి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చదవండి: గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement