క్రెడిట్ స్కోరు కొట్టండిలా..
ప్రస్తుతం రుణం తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా మంచి క్రెడిట్ స్కోరు, చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉండటం తప్పని సరిగా మారింది. క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ రిపోర్టునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దరఖాస్తుదారుకి భారీ ఆదాయం, విలువైన ఆస్తులు, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఇలా ఎన్ని ఉన్నా.. ట్రాక్ రికార్డు సరిగ్గా లేకపోతే ఏవీ పనిచేయవు. ఇంతటి కీలకమైన క్రెడిట్ రిపోర్టు, క్రెడిట్ స్కోరు గురించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (సిబిల్)పై ఆధారపడుతుంటాయి. ఈ సంస్థ నిర్వహించే రికార్డుల్లో ఎగవేతదారులుగా (డిఫాల్టర్లు) గానీ ముద్రపడితే రుణాలు పొందాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో సిబిల్ రికార్డుల్లో డిఫాల్టర్లుగా ఎక్కకూడదంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిపైనే ఈ కథనం.
సిబిల్ దగ్గర ప్రత్యేకంగా డిఫాల్టర్ల జాబితా అంటూ ఒకటి ఉంటుంది, అందులో ఉన్నవారిని బ్యాంకులు నిర్ద్వంద్వంగా దూరం ఉంచుతాయన్న అపోహలు కొన్ని ఉన్నాయి. వాస్తవానికి సిబిల్ ఇలాంటి ప్రత్యేక జాబితా ఏమీ తయారు చేయదు. తమ దగ్గర సభ్యులైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే సమాచారాన్ని క్రోడీ కరించి, మంచి..చెడు అనే భేదం లేకుండా వ్యక్తుల క్రెడిట్ రికార్డును రూపొందిస్తుంది. దీని ఆధారంగా స్కోరు ఇస్తుంది. సాధారణంగా క్రెడిట్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేని వారిని మాత్రమే బ్యాంకులు డిఫాల్టర్లుగా పరిగణిస్తుంటాయి. అలాగని, ట్రాక్ రికార్డు సరిగ్గా లేని ప్రతీ ఒక్కరు ఎగవేతదారులని భావించడానికీ లేదు. డిఫాల్టర్లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటారు. కావాలని ఎగ్గొట్టే వారు కొందరైతే, పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు, నిబంధనలు తెలియక మరికొందరు ఈ కోవలో పడిపోతుంటారు.
కావాలని ఎగ్గొట్టిన వారిని పక్కన పెట్టి మిగతా వారి సంగతి పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యల కారణంగా గడువులోగా కొన్ని వాయిదాలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన వారు రెండో రకానికి చెందుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పాటించే నిబంధనలు తెలియక ఇరుక్కునే అమాయక రుణగ్రస్తులు మూడో కోవకి చెందినవారు. నిజానికి ఈ రెండు వర్గాల వారు తెలియనితనం కారణంగానే డిఫాల్టర్లుగా మారతారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. కనుక, ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉంది, దాన్ని ఎలా ఎదుర్కొనాలి అన్నది తెలుసుకుంటే ఇలాంటి సమస్యలో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు.
వన్ టైమ్ సెటిల్మెంట్ ..
బ్యాంకులకు భారీ మొత్తం బకాయిపడినప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ చాలా మధురంగా అనిపిస్తుంది. ఎంతో కొంత కట్టేసి బైటపడొచ్చు కదా అనిపిస్తుంది. తీరా సెటిల్ చేసుకున్న తర్వాత ఇక మన పేరున ఎటువంటి బకాయిలు లేవని బ్యాంకు ఒక లెటరు ఇచ్చినంత మాత్రాన అకౌంటు క్లోజ్ అయినట్లు కాదు. ఈ ఓటీఎస్ విషయం మీ క్రెడిట్ రిపోర్టులో సెటిల్డ్ అనో ‘పోస్ట్ (డబ్ల్యూఓ) సెటిల్డ్’ అనో కనిపిస్తుంది. ఇది కూడా మీ క్రెడిట్ హిస్టరీకి మచ్చలాంటిదే. కనుక, సెటిల్ చేసుకోవడం కన్నా పూర్తి స్థాయి క్లోజర్ కోసం బేరమాడుకోవడం మంచిది. మరో విషయం, ఈ రెండింటికీ బ్యాంకులు ఇచ్చే లెటర్లు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి, ఏది ఇచ్చారన్నది సరిగ్గా చూసుకోవాలి.
గడువు తేదీ..
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రెడిట్ అకౌంటును సెటిల్ చేసుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని సార్లు ఆఫర్ లెటరు పంపిస్తుంటాయి. ఒకవేళ సెటిల్ చేసుకుని, అకౌంటు మూసేద్దామనుకున్న పక్షంలో ఆ లెటర్‌లో పేర్కొన్న ఆఖరు తేదీలోగా చెల్లించేయాలి. ఇక్కడ ఆఖరు తేదీ (డ్యూ డేట్) అంటే మీరు కట్టే డబ్బు బ్యాంకు చేతికి అందాల్సిన రోజని గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా డ్యూ డేట్ రోజున చెక్కు వేస్తే కుదరదు.
బ్యాంకు దగ్గరికి చెక్కు చేరి, దాన్ని మార్చుకునేలోగా ఆఖరు తేదీ దాటిపోతుంది. ఫలితంగా గడువులోగా మీరు చెల్లించలేదని రికార్డులకు ఎక్కుతుంది. సెటిల్మెంట్ ఆఫర్ రద్దయి, మీ అకౌంటు కొనసాగుతూనే ఉండే అవకాశమూ ఉంది. మీరు కట్టిన మొత్తాన్ని బ్యాంకు.. బకాయిలో కొంత భాగం కింద జమ వేసుకుంటుందే తప్ప అకౌంటును మూసేయదు. కనుక, లెటర్‌లో పేర్కొన్న ఆఖరు తేదీకి సాధ్యమైనంత ముందుగానే కట్టేయడం ఉత్తమం. ఒకవేళ తప్పని పరిస్థితుల కారణంగా సరిగ్గా ఆఖరు తేదీనే కట్టాల్సి వస్తే.. నగదు చెల్లింపు జరిపి, రసీదు దగ్గర పెట్టుకోవడం మంచిది.
రుణం పునర్‌వ్యవస్థీకరించడం..
ఊహించని ఆర్థిక సమస్యల కారణంగా ఈఎంఐల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కొన్నిసార్లు రీషెడ్యూలిం గ్‌కి వెళ్లడం మంచిదనకుంటూ ఉంటాం. దీనికి బ్యాంకు కూడా అంగీకరించవచ్చు. అయితే, సదరు బ్యాంకు ఈ రుణాన్ని ‘రీస్ట్రక్చర్డ్’ పేరిట సిబిల్‌కి సమాచారం ఇస్తుంది. ఇలాంటివి కూడా క్రెడిట్ రికార్డుకు ప్రతికూలమైన అంశాలు. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడే తక్కువ ఈఎం ఐలు ఉండేలా కాస్త దీర్ఘకాలానికి దరఖాస్తు చేసుకోవడం మంచిది. సాధారణంగా ప్రతి నెలా కట్టే ఈఎంఐలు.. నెల జీతంలో 40% దాటకుండా చూసుకోవడం శ్రేయస్కరం. మరీ తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే, తక్కువ ఈఎంఐ ఆఫర్లు అందిస్తున్న బ్యాంకుకు మీ రుణాన్ని బదలాయించుకునే అంశాన్ని పరిశీలించుకోవచ్చు. దీని వల్ల మాత్రం క్రెడిట్ రికార్డుకు ఎటువంటి ఢోకా ఉండదు.
క్రెడిట్ అకౌంటు మూసేస్తే సరిపోదు..
రుణం సెటిల్మెంట్ ప్రక్రియకు సంబంధించి.. మనం ఎంత తక్కువ కట్టేలా బేరమాడితే అంత మంచిదనుకుంటాం. నిజానికి ఎంత తక్కువ కట్టామన్నదానికన్నా సరైన మొత్తం కట్టామా లేదా అన్నదే ముఖ్యం. రుణం లేదా క్రెడిట్ కార్డు బకాయి సెటిల్మెంట్ ఆఫర్ విషయంలో ‘అసలు బాకీ’ అంటూ ఒకటి ఉంటుంది. మొత్తం బకాయి ఎంత ఉందన్నది తెలుసుకుని, సాధ్యమైనంత వరకూ అసలు మొత్తమే క్లియర్ అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నించాలి. లేకపోతే ఇది కూడా క్రెడిట్ రిపోర్టులో ప్రతిబింబిస్తుంది.
కార్డు అకౌంటు క్లోజింగ్ ఇలా..
సిబిల్ రిపోర్టుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో క్రెడిట్ కార్డు అకౌంట్‌ను రద్దు చేయడం ఒకటి. ఉపయోగంలో ఉన్న క్రెడిట్ కార్డు అకౌంటును మూసేయడం అంటే.. బకాయిలు చెల్లించేసి, కార్డును ధ్వంసం చేస్తే చాలు అనుకుంటారు చాలా మంది. కానీ ఇది సరికాదు. నిజంగా అకౌంటు క్లోజింగ్ అన్నది పేపరు రూపంలో కనిపించాలి. కాబట్టి మొత్తం చెల్లింపులు చేసేసిన తర్వాత అకౌంటును మూసేయదల్చుకుంటున్నట్లు బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీకి తెలియజేయాలి. ఖాతా మూసివేసినట్లు వాటి దగ్గర్నుంచి అధికారికంగా లెటరు వచ్చే దాకా వేచి చూడాలి.
అది వచ్చిన వెంటనే, ‘నో డ్యూస్’ లెటరు ఇవ్వాలని కోరాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా అవసరమైతే ఖాతా క్లోజ్ అయిందని చూపేందుకు వీటి కాపీలను భద్రపర్చుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలంగా నలుగుతున్న క్రెడిట్ ఖాతాను మూసివేస్తున్నా లేదా సెటిల్ చేసుకుంటున్నా, మీరు చెల్లించిన రసీదులతో పాటు ఆఫర్ లెటర్ల కాపీలను కూడా భద్రంగా ఉంచుకోవాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా అవసరమైతే ఆధారాలుగా ఇవే ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డు ఖాతాలను రద్దు చేసుకున్న తర్వాత ఎటువంటి బకాయిలు లేవంటూ తెలిపే నో డ్యూస్ లెటర్ తీసుకోవడం మరవొద్దు.