Stay Away From Credit Cards Beware Of Loan Apps, Check Details Here - Sakshi
Sakshi News home page

Loan Apps: బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది?

Published Mon, Jul 4 2022 12:47 AM | Last Updated on Mon, Jul 4 2022 11:37 AM

Stay away from credit cards Beware of LoanApps - Sakshi

సాగర్‌కు రెండు క్రెడిట్‌ కార్డులున్నాయి. పరిమితి కూడా ఎక్కువ. దేనికైనా వీటినే  వాడుతూ ఉంటాడు. క్రెడిట్‌ స్కోరుకు ఢోకా లేకుండా బిల్లు కరెక్టుగా చెల్లిస్తుంటాడు. కానీ ఈ మధ్య ఓ లోన్‌కోసం వెళితే... తన క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందన్నారు. రిపోర్టు చూసి అదిరిపడ్డాడు సాగర్‌. ఎందుకంటే తన పేరిట 5 క్రెడిట్‌ కార్డులున్నాయి. వాటిలో కొన్నింటికి బకాయిలున్నాయి. మరికొన్నిటి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దానివల్లే క్రెడిట్‌ స్కోరు తగ్గింది. బ్యాంకుకు వెళ్లి ఇదేంటని అడిగిన సాగర్‌కి... విషయం తెలిసి మతి పోయినంతపనైంది. ఇంతకీ ఏంటది?

సాధారణంగా షాపింగ్‌కో, ఆన్‌లైన్‌ పేమెంట్లకో క్రెడిట్‌ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్‌లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్‌స్టంట్‌ లోన్‌/పేమెంట్‌ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్‌ పెయిడ్‌) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. వాటిలో కొన్నింటి గడువు తేదీ వారం రోజులే!. మరికొన్నింటికి 10 రోజులు– 15 రోజులు ఇలా బిల్లింగ్‌ సైకిల్స్‌ ఉన్నాయి. అంత తక్కువ వ్యవధి కావటంతో వాటిని తిరిగి చెల్లించటంలో కిరణ్‌ అంత శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇవిగో... ఇవే సిబిల్‌ రిపోర్టులో కొంప ముంచాయి.

పోస్ట్‌పెయిడ్‌–లోన్‌ యాప్స్‌ వేరువేరు
కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని... వ్యాపారాన్ని పెంచుకోవటానికి కొన్ని. కారణమేదైనా ఇపుడు చాలా కంపెనీలు పోస్ట్‌పెయిడ్‌ మొదలెట్టేశాయి. అంటే... ‘ఇప్పుడు కొను–తరువాత చెల్లించు’ (బీఎన్‌పీఎల్‌) అన్నమాట. షాపింగ్‌ యాప్‌లతో పాటు సర్వీసులందించే యాప్‌లు కూడా వీటిని అందిస్తున్నాయి. ఉదాహరణకు క్యాబ్‌ అగ్రిగేటర్‌ ‘ఓలా’నే తీసుకుంటే... క్యాబ్‌ బుక్‌ చేసిన వెంటనే చెల్లించాల్సిన పనిలేదు.

కొంత మొత్తం పరిమితికి లోబడి... ఓలా పోస్ట్‌ పెయిడ్‌ సేవలందిస్తోంది. ఆ మొత్తం వరకూ సర్వీసులు వాడుకోవచ్చు. ఈలోపు బిల్లింగ్‌ తేదీ వస్తే బిల్లు అందుతుంది. చెల్లిస్తే సరి. మరిచిపోతే కాస్త జరిమానాలూ ఉంటాయి. ఓలాతో పాటు ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటివి కూడా కొంత పరిమితి వరకూ ‘పే లేటర్‌’ సేవలందిస్తున్నాయి. ఇదంతా పోస్ట్‌పెయిడ్‌ వ్యవహారం.  

లోన్‌యాప్స్‌ కూడా ఇంచుమించుగా...
మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రెడిట్‌ కార్డుల్లానే ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్డులు లేకున్నా, వాలెట్లలో డబ్బులు లేకున్నా సరే... ఈ యాప్స్‌తో అప్పటికప్పుడు ఈజీగా పే చేసేయొచ్చు. లేజీ పే, సింపుల్, బుల్లెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, ఫ్రీచార్చ్‌ పే లేటర్, మొబిక్విక్‌ జిప్‌ పేలేటర్, పే లేటర్‌ బై ఐసీఐసీఐ... ఇవన్నీ అలాంటివే. ఆన్‌లైన్లో కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీసుకో దీనిద్వారా తక్షణం చెల్లించేయొచ్చు. బిల్లులు కూడా. వీటన్నిటినీ కూడా క్రెడిట్‌కార్డుల్లానే భావించాల్సి ఉంటుంది.

అందించేవన్నీ ఆర్థిక సేవల కంపెనీలే కాబట్టి... సిబిల్‌ జాబితాలో వీటిని కూడా క్రెడిట్‌ కార్డుల్లానే చూడాల్సి వస్తుంది. చిన్నచిన్న పేమెంట్లే కనక వీటి చెల్లింపు గడువు కూడా తక్కువే. జరిమానాలూ ఎక్కువే. ఉదాహరణకు 100 రూపాయల బిల్లు గనక చెల్లించకపోతే... మరో 100 ఫైన్‌ కట్టాల్సి రావచ్చు. ఎందుకంటే చాలా సంస్థలు కనీస ఫైన్‌ మొత్తాన్ని ఈ రకంగా నిర్ధారిస్తున్నాయి. శాతంలోనైతే ఇది 100. చాలామందికి రూ.100 అనేది చిన్న మొత్తంగానే కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే వీటిని విస్మరిస్తే సిబిల్‌ రిపోర్టులో స్కోరుపై మాత్రం ప్రభావం చూపిస్తాయని మరిచిపోకూడదు.

పోస్ట్‌పెయిడ్‌–లోన్‌ యాప్స్‌కు తేడా ఏంటి?
పోస్ట్‌పెయిడ్‌లో సదరు సంస్థ తమ దగ్గర కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీ సుకో దీన్ని అందిస్తుంది. కానీ లోన్‌యాప్స్‌ అయితే ఏ కంపెనీలో కొన్న వస్తువుకైనా, ఎక్కడ తీసుకున్న సర్వీసుకైనా వీటి నుంచి చెల్లింపులు చేయొ చ్చు. నిజానికిప్పుడు లేజీ పే వంటి చాలా లోన్‌యాప్స్‌ అస్సలు వడ్డీలు వసూలు చేయటం లేదు. మరి వాటి మనుగడ ఎలా? అనే సందేహం సహజం.

ప్రస్తుతానికైతే ఆలస్య రుసుములే వీటికి ప్రధాన ఆదాయ వనరు. పైపెచ్చు ఇవన్నీ యూజర్‌ బేస్‌ను (కస్టమర్ల సంఖ్య) పెంచుకోవటంపైనే దృష్టిపెడుతున్నాయి. అక్కడ సక్సెస్‌ అయితే పెట్టుబడులొస్తాయి. ఏదో ఒక దశలో ఆ పెట్టుబడులపై లాభాన్ని అందించాల్సిన బాధ్యత ప్రమోటర్‌కు ఉంటుంది. కాబట్టి మున్ముందు ఇవన్నీ వడ్డీల రూపంలోనో... నెలవారీ ఫీజుల రూపంలోనో యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయక తప్పదు కూడా.

ఇంతకీ వీటిని వాడొచ్చా?
క్రెడిట్‌ కార్డుల్ని సైతం ఎడాపెడా వాడితే ఆ తరువాత ఇబ్బందులు తప్పవన్నది చాలామందికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం. అలాంటిది అందుబాటులో ఉన్నాయి కదా అని ఎడాపెడా లోన్‌ యాప్స్‌ నుంచి రుణాలు తీసుకుంటే?. వీటి బిల్లింగ్‌ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ అప్‌డేటెడ్‌గా ఉండటం అంత తేలికేమీ కాదు. బిల్లుకు సంబంధించిన మెసేజ్‌ వచ్చాక... ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా మరిచిపోయి ఫైన్‌ పడే ప్రమాదం ఎక్కువ.

అందుకని వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. సిబిల్‌ రిపోర్టులో సైతం మీరు ఉపయోగించిన ఒక్కో లోన్‌ యాప్‌ ఒక్కో క్రెడిట్‌లైన్‌ మాదిరి కనిపిస్తుంది. వాటిలో జరిమానాలు, ఆలస్యపు చెల్లింపులు ఉంటే స్కోరు దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంటుంది. మరో ముఖ్యమైన అంశమేంటంటే కొన్ని యాప్‌లు తమ బకాయిల వసూలుకు రకరకాల అనైతిక మార్గాలు కూడా అనుసరిస్తున్నాయి. రుణం తీసుకున్న వారి కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ ఫోన్లు చేయటం... భయపెట్టడం... వారి దగ్గర ఈ వ్యక్తిని అవమానించటం వంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి.
-మంథా రమణమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement