మాల్యాకు ఝలకిచ్చిన యూబీఎల్
న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్, యూబీఎల్ ఛైర్మన్ విజయ్ మాల్యాకు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఝలకిచ్చింది. మాల్యా పేరును స్పష్టంగా పేర్కొనని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపులను నిలిపివేసినట్టు తెలిపింది. టీడీఎస్ శాఖ ఆదేశాల కనుగుణంగా చెల్లింపులను నిలిపి వేసినట్టు పేర్కొంది.
మాల్యాపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసు విచారణ నడుస్తున్న కారణంగా రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపును నిలిపివేసినట్టు చెప్పింది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ కమిషనర్ నుంచి తమకు లేఖ అందిందని కంపెనీ తెలిపింది. జీతం, వేతనం, భత్యాలు తదితర చెల్లింపులను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డర్ జూన్ 28, 2016 న తమకు అందిందని కంపెనీ తెలిపింది. అయితే దీనిపై స్పందించడానికి కంపెనీ ప్రతినిధి తిరస్కరించారు.