సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై చలాన్ల మొత్తంలో 80 శాతం రాయితీ ఇచ్చింది.
అలాగే కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్ల మొత్తంలో 60 శాతం రాయితీని, ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించడంతో పోలీస్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. https://echallan. tspolice.gov.in/publicview/ వెబ్‌సైట్‌లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
పెండింగ్ చలాన్ల విలువ రూ. 800 కోట్లు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఈ–చలాన్‌లు పెండింగ్‌లో ఉండగా వాటి విలువ సుమారు రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రాయితీలు కల్పించడం వల్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లను వాహనదారులు చెల్లిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో మెగా జాతీయ లోక్ అదాలత్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
గతేడాది మార్చిలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై ఇదే తరహాలో ఇచ్చిన డిస్కౌంట్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు సద్వినియోగం చేసుకోగా జిల్లాల్లోని వాహదారులకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన లేక ఆశించినట్లు వినియోగించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అప్పట్లో సుమారు రూ. 350 కోట్ల మేరకు రాయితీలను ఉపయోగించుకొని వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం.
రాయితీలు ఇలా..
- ద్విచక్ర వాహనాలు,ఆటోలు 80%
- కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు 60%
- ఆర్టీసీ డ్రైవర్లు,తోపుడు బండ్లకు..90%
Comments
Please login to add a commentAdd a comment