‘చెల్లింపు’ల్లోకి ట్రూకాలర్‌..! | Truecaller acquires payments app Chillr | Sakshi
Sakshi News home page

‘చెల్లింపు’ల్లోకి ట్రూకాలర్‌..!

Published Thu, Jun 14 2018 12:27 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

Truecaller acquires payments app Chillr - Sakshi

(సాక్షి, బిజినెస్‌ విభాగం) : అంతర్జాతీయ డిజిటల్‌ టెలిఫోన్‌ డైరెక్టరీగా ఎదుగుతున్న ‘ట్రూ కాలర్‌’... రెవెన్యూ ఆర్జించటంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అంతర్జాతీయంగా తనకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో చెల్లింపుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. దేశంలో మల్టీ–బ్యాంక్‌ పేమెంట్స్‌ యాప్‌గా పేరొందిన ‘చిల్లర్‌’ యాప్‌ను కొనుగోలు చేసినట్లు ట్రూకాలర్‌ బుధవారం ప్రకటించింది. చిల్లర్‌ వ్యవస్థాపకులు సోని జాయ్, అనూప్‌ శంకర్, మొహమ్మద్‌ గాలిబ్, లిషయ్‌ భాస్కరన్‌తో పాటు ఇతర ఉద్యోగులు ఇకపై తమ సంస్థలో భాగంగా ఉంటారని ట్రూ కాలర్‌ సహ వ్యవస్థాపకుడు నమీ జారింగ్లామ్‌ తెలియజేశారు. ట్రూకాలర్‌ పే విభాగానికి సోని జాయ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉంటారన్నారు. మొబైల్‌ పేమెంట్స్‌ కార్యకలాపాల విభాగానికి చిల్లర్‌ ఇంజినీర్లు, డిజైనర్ల అనుభవం తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు జారింగ్లామ్‌ చెప్పారు. అయితే చిల్లర్‌ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. చిల్లర్‌ 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. భారత్‌లో 15 కోట్ల మంది యూజర్లు, 300కు పైగా సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఇక ట్రూకాలర్‌కి భారత్‌లో 65 మంది సిబ్బంది ఉన్నారు. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) కింద మరిన్ని బ్యాంకులను తమ పేమెంట్‌ యాప్‌ ప్లాట్‌ఫాంపైకి తేనున్నట్లు సోనీ జాయ్‌ తెలియజేశారు. 

ఇండియానే ఎందుకంటే...
ట్రూకాలర్‌ను స్వీడన్‌కు చెందిన ట్రూ సాఫ్ట్‌వేర్‌ స్కాండనేవియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 2009లో ఆరంభమైన ట్రూకాలర్‌కు గతేడాది చివరకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది యూజర్లున్నారు. వీరిలో దాదాపు 15 కోట్ల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ట్రూకాలర్‌కు ఇండియానే అతిపెద్ద మార్కెట్‌. ఇక ట్రూకాలర్‌ వద్ద దాని యూజర్లకు సంబంధించి రకరకాల డేటా ఉందని, తన సర్వీసులకు సంబంధం లేని డేటాను సైతం అది సేకరిస్తోందని కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ట్రూకాలర్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మన ఫోన్లోని సమాచారమంతా బేషరతుగా అందజేస్తున్నట్లే లెక్క. మన ఫోన్‌లో సేవ్‌ చేసుకున్న పేర్లతో పాటు ఫోన్‌కి వచ్చే, పోయే కాల్స్, మెసేజీల వివరాలన్నీ ట్రూకాలర్‌కి చేరుతున్నాయి. మనం ఇవ్వడానికి ఇష్టపడని సమాచారాన్ని కూడా ఈ యాప్‌ సేకరిస్తోంది. ఇది ఒక రకంగా గుర్తింపునకు సంబంధించిన వివరాల చౌర్యమే’’ అనేది ఐటీ నిపుణుల మాట. కాకపోతే ఇవన్నీ ట్రూకాలర్‌ యాప్‌ రహస్యంగా ఏమీ సేకరించటం లేదు. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడే అందులోని షరతులు, నిబంధనలను మనం ఓకే చెయ్యాల్సి ఉంటుంది. కానీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే హడావుడిలో యూసేజీ పాలసీని చదవకుండానే అన్ని అనుమతులూ ఇచ్చేసి ఓకే చేసేస్తారు. మనం చూసే కంటెంట్‌ మొదలుకుని, సెర్చి చేసే అంశాలు, వెబ్‌సైట్ల దాకా మొత్తం కంటెంట్‌ సమాచారాన్ని సేకరిస్తామని ట్రూకాలర్‌ తన పాలసీలో చెబుతోంది. నిజానికి ఇది అందించే సర్వీసులకు ఇలాంటివన్నీ అవసరం లేదన్నది నిపుణుల మాట. అయితే ఇలా సేకరించిన కాంటాక్ట్స్‌ సమాచారంతో ట్రూకాలర్‌ భారీ పబ్లిక్‌ టెలిఫోన్‌ డైరెక్టరీ వంటి డేటాబేస్‌ను తయారు చేసుకుంటోంది. ఇండియా అతిపెద్ద మార్కెట్‌ కనక ఇక్కడే పేమెంట్‌ సర్వీసులను ఆరంభిస్తోంది.

పర్మిషన్స్‌ ముసుగులో నిఘా..!
ఇన్‌స్టలేషన్‌ సమయంలో... ఫోన్‌ మైక్రోఫోన్‌కు యాక్సెస్‌ ఇవ్వాలని, మన ఫోన్‌బుక్‌లోని కాంటాక్ట్స్‌ వివరాలను తమ సర్వర్స్‌ సేకరించేందుకు అనుమతించాలని ట్రూకాలర్‌ అడుగుతోంది. ఇవి హానికరమైనవి కావనే ఉద్దేశంతో పర్మిషన్స్‌ ఇచ్చేస్తాం. కానీ.. ఈ పర్మిషన్స్‌ సాయంతో మనం ఫోన్‌ లిఫ్ట్‌ చేశామా లేదా, లాక్‌ అయి ఉందా.. అన్‌లాక్‌ అయి ఉందా వంటి వివరాలన్నీ కూడా ట్రూకాలర్‌ యాప్‌కి చేరిపోతున్న సంగతి మనకు తెలియదు. చాలామంది ఫోన్లలో కుటుంబసభ్యులు, చుట్టాలు, ఫ్రెండ్స్‌ తదితరుల పేర్లను సేవ్‌ చేసుకునేటప్పుడు వారితో ఉన్న బంధుత్వాన్ని సూచించేలా చివర్లో చుట్టరికాన్ని కూడా చేరుస్తుంటారు. కృష్ణ మామయ్యనో, రాజూ చాచా అనో రకరకాలుగా చేస్తారు. ఇలా సేవ్‌ చేయడం వల్ల కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని ట్రూకాలర్‌ చేతికిచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రైవసీకి కాకుండా స్నేహితులు, ఇతరత్రా మనకు తెలిసినవారి ప్రైవసీకి కూడా భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ‘‘కాలర్‌ ఐడీని తెలుసుకోవటానికి, అనవసర కాల్స్‌ను బ్లాక్‌ చేయటానికి ట్రూకాలర్‌ ఉపయోగపడుతుందనే భావనతోనే చాలా మంది ఉన్నారు. కానీ వారి ఫోన్‌లో ఉన్న డేటా కూడా కంపెనీ చేతికి చేరుతోందనే సంగతి వారికి తెలియదు’’ అని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అసలు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలనుకుంటే.. ఆన్‌లైన్‌ సర్వీసులందించే ఏ సంస్థతోనూ వివరాలు పంచుకోకపోవటమే ఉత్తమమనేది వారి సూచన.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement