హైక్‌లో వాలెట్, పేమెంట్
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ హైక్ తాజాగా వాలెట్, చెల్లింపు సేవల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యాప్ ద్వారానే మొబైల్ ఫోన్ బిల్లులు కట్టడం నుంచి నగదు బదిలీ దాకా వివిధ సర్వీసులకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా నగదును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేందుకు హైక్ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ (5.0) తోడ్పడగలదని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు కవిన్ భారతి మిట్టల్ తెలిపారు.
ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు జూన్ 25 నాటికి, యాపిల్ ఫోన్ యూజర్లకు జూలై ఆఖరు నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగలదని పేర్కొన్నారు. అలాగే యస్ బ్యాంక్‌తో కలిసి వాలెట్ సేవలు కూడా అందిస్తున్నట్లు కవిన్ వివరించారు. ప్రస్తుతం హైక్‌కు 10 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు. హైక్ వేల్యుయేషన్ ప్రస్తుతం 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది.