నేను ఇటీవలే ప్రత్యామ్నాయ రుణ సాధనాల గురించి వింటున్నాను. ముఖ్యంగా ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలిసింది. వీటికి మంచి చరిత్ర ఉందా? అవి 12 శాతం వరకు రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. వీటితో ఏదైనా రిస్క్ ఉంటుందా? – శ్రీరామ్ రామనాథన్
ఈక్విటీలన్నవి సంపద సృష్టికి అనుకూలమైనవి. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (డెట్) సాధనాలు పెట్టుబడి రక్షణ, క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఉద్దేశించినవి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ప్రత్యామ్నాయ సాధనాలు) సంప్రదాయ ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, నగదుకు అదనపు వ్యూహాలు మాత్రమే. ఇవి ప్రధానంగా ఐదు విభాగాలు. హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్యాపిటల్, నేచురల్ రీసోర్సెస్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వీటన్నింటిలోనూ లిక్విడిటీ తక్కువ. నియంత్రణలు తక్కువ. పారదర్శకత తక్కువ. వ్యయాలు ఎక్కువ. రిస్క్, రాబడులకు సంబంధించి చారిత్రక డేటా తక్కువగా ఉంది. అందుకుని ఈ అస్సెట్ క్లాస్ (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్) అనేది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సూచనీయం కాదు.
ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్
వ్యాపారాలకు స్వల్పకాల రుణ సదుపాయమే ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్. సాధారణంగా వీటిని బ్యాంకులు సమకూరుస్తుంటాయి. ప్రైవేటు క్యాపిటల్ పరిధిలోకి ఇవి వస్తాయి. ఇది చాలా పూర్వం నుంచి ఉన్న సాధనం. బ్యాంకులే దీనికి సారథ్యం వహిస్తున్నాయి. ఇందులో రాబడులు పరిమితం. నూరు శాతం నష్టానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఏదైనా కంపెనీకి రుణంపై వస్తువులు సరఫరా చేశారనుకుందాం. దానికి బిల్లు జారీ చేస్తారు. రుణ కాల వ్యవధి ముగిసిన తర్వాత ఆ బిల్లు మొత్తాన్ని కొనుగోలుదారుడు చెల్లిస్తాడు.
ఈ రుణం కాల వ్యవధి సాధారణంగా 30–90 రోజులుగా ఉంటుంది. అంటే మీరు సరఫరా చేసిన వస్తువుల బిల్లు మొత్తం మీకు తిరిగి వచ్చేందుకు ఇన్ని రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లోపే మీకు డబ్బులు అవసరపడ్డాయని అనుకుంటే అప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లి ఈ బిల్లును ఇచ్చి దాన్ని నగదుగా మార్చుకోవచ్చు. మరి బ్యాంకులకు ఇందులో ప్రయోజనం ఏమిటి? బ్యాంకులు ఈ బిల్లు మొత్తంలో కొంత తగ్గించి మిగిలినది ఇస్తాయి. అందుకే దీనికి ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అనే పేరు వచ్చింది.
నూరు సంవత్సరాలకు పైగా బ్యాంకులు ఈ వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం ఇది అందుబాటులోకి వచ్చింది. పలు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇన్‌వాయిస్‌కు మీరు ఫండ్ సమకూర్చిన తర్వాత, డబ్బులు తిరిగి రాకపోతే పరిస్థితి ఏంటి? అన్నది ఆలోచించుకోవాలి. ఇన్వెస్టర్‌గా రాబడుల కంటే రిస్క్‌ను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. అదే బ్యాంకులు అయితే డిఫాల్ట్ ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. ఇందులో లిక్విడిటీ ఉండదు. మీరు విక్రయించాలనుకుంటే కొనుగోలు చేసే వారు లభించడం కష్టం. వీటికంటే ఈక్విటీలు మెరుగైన సాధనం.
కారు కొనుగోలుకు రూ.7 లక్షల రుణం తీసుకున్నాను. దీన్ని ఏడేళ్ల కంటే ముందుగా తీర్చేసేందుకు ఏవైనా ఫండ్స్‌ను సూచించగలరా? – ఆదిత్య
కారు రుణాన్ని ముందుగా చెల్లించేయాలన్న మీ ఆలోచన మంచిది. అయితే కారు వంటి తరిగిపోయే ఆస్తి కొనుగోలుకు రుణం తీసుకోవడాన్ని సాధారణంగా ప్రోత్సహించం. మీరు ఏడేళ్లలోపు రుణం తీర్చేయాలని అనుకుంటున్నారు కనుక.. మీరు స్వల్పకాలం నుంచి మధ్యకాలిక మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల మీరు పెట్టుబడిని రక్షించుకోవడంతోపాటు రాబడులు సొంతం చేసుకోగలరు.
మూడు నుంచి నాలుగేళ్ల తర్వాత కారు రుణాన్ని చెల్లించేద్దామని అనుకుంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఇవి ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేసి, అచ్చమైన డెట్ కంటే మెరుగైన రాబడులు ఇస్తాయి. మూడు నాలుగేళ్లలోపే తీర్చేయాలని భావిస్తే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment