ఇక ‘సౌండ్‌’తో పేమెంట్‌..! | New Payment Method Coming Soon for Customers | Sakshi
Sakshi News home page

ఇక ‘సౌండ్‌’తో పేమెంట్‌..!

Published Thu, May 17 2018 12:58 AM | Last Updated on Thu, May 17 2018 12:58 AM

New Payment Method Coming Soon for Customers - Sakshi

న్యూఢిల్లీ: కొత్త చెల్లింపుల విధానం త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజిటల్‌ చెల్లింపులను పెంచే లక్ష్యంతో శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రయత్నాలు మొదలు పెట్టింది. శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని పరీక్షించేందుకు ఫోన్‌పే, టోన్‌ట్యాగ్, అల్ట్రా క్యాష్‌ అనే మూడు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్‌ ప్రకటించిన తర్వాత యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, వర్తకులు ఇప్పటికీ యూపీఐ ఆధారిత చెల్లింపుల పట్ల విముఖంగానే ఉన్నారు. దీంతో ఎన్‌పీసీఐ ఆ తర్వాత యూపీఐతో అనుసంధానించిన క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. అయినా కానీ, ఈ విధానం కూడా సక్సెస్‌ కాలేదు. ఈ నేపథ్యంలో మరింత సులభతరంగా డిజిటల్‌ చెల్లింపులను సుసాధ్యం చేసేందుకు ప్రత్యామ్నాయాలపై ఎన్‌పీసీఐ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే శబ్దం ఆధారిత చెల్లింపుల విధానం ముందుకు వచ్చింది. 

ఐసీఐసీఐ పాకెట్స్‌కు టోన్‌ట్యాగ్‌ అనుసంధానం 
టోన్‌ట్యాగ్‌కు చెందిన ‘సౌండ్‌పే’ను ఐసీఐసీఐ బ్యాంకు ‘పాకెట్స్‌’ యాప్‌తో ప్రయోగాత్మకంగా అనుసంధానించారు. దీంతో ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు పాకెట్స్‌ యాప్‌ నుంచి దుకాణాల్లో ప్రస్తుతమున్న పేమెంట్‌ మెషీన్ల ద్వారానే  చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ‘‘దుకాణాల్లో క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులకు భద్రతా పరమైన సవాళ్లున్నాయి. క్యూఆర్‌ కోడ్‌లు మారకుండా స్టాటిక్‌గా ఉంటాయి. వాటికి సులభంగా నకిలీలను రూపొందించొచ్చు’’ అని టోన్‌ట్యాగ్‌ వ్యవస్థాపకుడు కుమార్‌ అభిషేక్‌ తెలిపారు. శబ్దం ఆధారిత చెల్లింపుల విధానం అటు క్యూఆర్‌ కోడ్‌ ఇంటరాపరబిలిటీ ఫీచర్, ఇటు నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ పేమెంట్స్‌ ఫీచర్ల సంయుక్తంగా పనిచేస్తుందని తెలిపారు. శబ్దం ఆధారిత చెల్లింపులకు సంబంధించి టోన్‌ట్యాగ్‌కు ఏడు అంతర్జాతీయ పేటెంట్లు ఉండడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా 1,20,000 వ్యాపారులు టోన్‌ట్యాగ్‌తో భాగస్వామ్యం కాగా, 4.2 కోట్ల మంది కస్టమర్లు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతమున్న కార్డు స్వైపింగ్‌ మెషిన్లలోనే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడం ద్వారా వాటిని శబ్ధ తరంగాల ఆధారిత చెల్లింపులు స్వీకరించేందుకు అనువుగా మారుస్తోంది.

ఇలా పనిచేస్తుంది... 
అధిక ఫ్రీక్వెన్సీతో కూడిన శబ్దం కస్టమర్‌ ఫోన్‌ నుంచి విడుదల కాగానే, దాన్ని దుకాణంలోని మెషీన్‌లో ఏర్పాటు చేసిన స్పీకర్‌ క్యాప్చర్‌ చేస్తుంది. అదే ఆథెంటికేషన్‌గా పనిచేస్తుంది. దాంతో కార్డు, పిన్‌లు అక్కర్లేకుండానే చెల్లింపులు పూర్తవుతాయి. ఇంకో వెసులుబాటు ఏంటంటే శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ఇప్పుడున్న ఏ చెల్లింపుల వ్యవస్థతోనయినా సులభంగా అనుసంధానించుకోవచ్చు. అంటే బ్యాంకు కార్డులు, బ్యాంకు ఖాతాలు, యూపీఐ, ప్రీపెయిడ్‌ వ్యాలెట్లతోనూ అనుసంధానికి వీలవుతుందని చెబుతోంది టోన్‌ట్యాగ్‌. ఈ సంస్థ కర్ణాటక రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భాగస్వామ్యంతో టోల్‌ చార్జీల చెల్లింపులకు శబ్దం ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement