
బ్రాంప్టన్ (కెనడా): ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టి20 లీగ్‌ల నిర్వహణలో ఇది మరో కోణం! ప్రముఖ క్రికెటర్లు ఎంతో మంది పాల్గొంటున్న కెనడా గ్లోబల్ టి20 లీగ్‌లో బుధవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్‌లో భాగంగా మాంట్రియల్ టైగర్స్, టొరంటో నేషనల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే హోటల్ నుంచి స్టేడియంకు బయల్దేరే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ ఆడమంటూ ఒక్కసారిగా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. లీగ్ నిర్వాహకులు తమకు భారీ మొత్తం బాకీ ఉన్నారని, తమ డబ్బుల విషయం తేలిస్తే తప్ప టీమ్ బస్సు ఎక్కమని వారంతా భీష్మించుకున్నారు! గ్లోబల్ లీగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు క్రికెటర్లను ఒప్పించే ప్రయత్నం చేసినా వారంతా గట్టిగా పట్టుబట్టారు.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆటగాళ్లంతా హోటల్‌లోనే ఆగిపోవడంతో అంతా గందరగోళంగా మారిపోయింది. టోర్నీ ప్రసారకర్తలు ‘సాంకేతిక కారణాలతో మ్యాచ్ ఆలస్యం’ అంటూ తమ చానల్‌లో స్క్రోలింగ్ నడిపిస్తూ పాత మ్యాచ్‌లను ప్రసారం చేస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. చివరకు సుదీర్ఘ చర్చల అనంతరం సమస్య పరిష్కృతమైంది. టొరంటో టీమ్‌లో యువరాజ్ సింగ్, బ్రెండన్ మెకల్లమ్, పొలార్డ్, మెక్లీనగన్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కాగా, మాంట్రియల్ జట్టులో జార్జ్ బెయిలీ, డిక్‌వెలా, సునీల్ నరైన్, తిసార పెరీరావంటి గుర్తింపు పొందిన క్రికెటర్లు ఉన్నారు. ఈ టోర్నీకి ఐపీఎల్ తదితర లీగ్‌ల తరహాలో కనీసం దేశవాళీ టి20 మ్యాచ్ గుర్తింపు కూడా లేదు.