న్యూఢిల్లీ/కోల్‌కతా: ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ పసిడికి డిమాండ్ పటిష్టంగానే ఉంటోంది. ధన్‌తేరాస్ సందర్భంగాను అదే ధోరణి నెలకొంది. మంగళవారం ధన్‌తేరాస్ సందర్భంగా అమ్మకాలు ఉదయం పూట అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఎక్కువగా చిన్న ఐటమ్స్, నాణేలకు డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి.
బుధవారం మధ్యాహ్నం వరకు ధన్‌తేరాస్ ఉండటంతో మరింతగా వ్యాపారం జరగవచ్చని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నా డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. అయితే, అధిక ధరల వల్ల విలువపరంగా అమ్మకాలు పెరిగినా, పరిమాణంపరంగా మాత్రం తగ్గొచ్చని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.
‘రేటు అధికంగా ఉన్నా కొనుగోళ్లు మెరుగ్గానే ఉన్నాయి. పరిమాణంపరంగా గతేడాదితో పోలిస్తే 10 శాతం తగ్గినా, విలువపరంగా చూస్తే 20 శాతం అధికంగా ఉండొచ్చు‘ అని ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయ్యమ్ మెహ్రా తెలిపారు. రీసైకిల్డ్ ఆభరణాల అమ్మకాలు కూడా బాగున్నట్లు పేర్కొన్నారు. 2, 3, 4, 5, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్, తేలికపాటి ఆభరణాలు విక్రయాలు గణనీయంగా ఉన్నట్లు వివరించారు.
ఆఫర్లు, డిస్కౌంట్లను కొనుగోలుదార్లు వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొత్తం అమ్మకాల్లో 30–40% వాటా వివాహ ఆభరణాలది ఉండగా, మిగతాది పండుగపరమైన నామమాత్రపు కొనుగోళ్లది ఉన్నట్లు సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువంకర్ సేన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే పసిడి అమ్మకాల పరిమాణం 15% తగ్గొచ్చని, విలువపరంగా మాత్రం 12% అధికంగా ఉండొచ్చన్నారు. ధన్‌తేరాస్, దీపావళి సందర్భంగా దేశీ మార్కెట్లో అమ్మకాలు రూ. 30,000 కోట్ల పైగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రేటు 33 శాతం జంప్..
గతేడాది నవంబర్ 11న ధన్‌తేరాస్ నాడు న్యూఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా 33 శాతం ఎగిసి రూ. 81,400కి చేరింది. వెండి ధర కేజీకి గతేడాది ధన్‌తేరాస్ నాడు రూ.74,000గా ఉండగా ఈసారి 35% పెరిగి రూ. 99,700గా ఉంది.
సుంకాల తగ్గింపుతో బూస్ట్: ఎంఎంటీసీ
ఇటీవల పసిడిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఊతం లభించిందని ఎంఎంటీసీ–పీఏఎంపీ ఎండీ వికాస్ సింగ్ తెలిపారు. కస్టమర్లు అధిక స్వచ్ఛత గల పసిడి ఉత్పత్తులపై ఆసక్తి కనపరుస్తున్నట్లు చెప్పారు. రాబోయే పెళ్లిళ్ళ సీజన్‌లోనూ ఇదే సానుకూల ధోరణి కొనసాగవచ్చని సింగ్ చెప్పారు. సీజన్‌తో సంబంధం లేకుండా సంప్రదాయాలపరమైన వివిధ వేడుకల కారణంగా కూడా పసిడికి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment