న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌కు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ధన త్రయోదశికి విక్రయాలు 45 శాతం దాకా పెరిగాయని కంపెనీలు అంటున్నాయి. భారీ తెర గల టీవీలు, ప్రీమియం ఉత్పత్తులతో ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరతతోపాటు నిరంతర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీలు సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. ‘ఈ పండుగల సీజన్‌లో కస్టమర్ల సెంటిమెంట్ ఆల్–టైమ్ హైలో ఉంది. మహమ్మారి తర్వాత బలంగా ఉద్భవించిన ఈ–కామర్స్ రంగం గ్రామీణ, చిన్న మార్కెట్లలో బ్రాండ్లు చొచ్చుకుపోవడానికి సహాయపడుతోంది’ అని కంపెనీలు చెబుతున్నాయి. ఓనమ్, దసరాతో మొదలైన కొనుగోళ్ల జోరు దీపావళి వరకు కొనసాగుతుందని పరిశ్రమ ఆశగా ఉంది. ఏడాదిలో జరిగే మొత్తం అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా 30 శాతం దాకా ఉంది.
ప్రీమియం టెలివిజన్లకు..
ఈ ధన్‌తేరస్‌కు పెద్ద తెర గల ప్రీమియం టెలివిజన్లకు మంచి డిమాండ్ ఉందని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. ప్రధానంగా 55 అంగుళాలు, ఆపైన సైజు టీవీలకు అద్భుత స్పందన ఉందన్నారు. అన్ని రకాల సౌండ్ బార్స్ సైతం అమ్ముడయ్యాయని చెప్పారు. కిత్రం ఏడాదితో పోలిస్తే ఈ ధంతేరస్‌కు 30–35 శాతం అధిక వ్యాపారం చేశామన్నారు. ఫెస్టివల్ సీజన్ అయ్యేంత వరకు ఈ జోష్ ఉంటుందన్నారు. 2020తో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని ప్యానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా సీఈవో మనీశ్ శర్మ తెలిపారు. పండుగల సీజన్ పూర్తి అయ్యేసరికి 50 శాతం అధిక విక్రయాలు నమోదు చేస్తామన్నారు. స్మార్ట్ 4కే ఆన్‌డ్రాయిడ్ టీవీలు, స్మార్ట్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ ఈ వృద్ధిని నడిపిస్తున్నాయని వివరించారు.
బలంగా సెంటిమెంట్..
పండుగ సీజన్ పూర్తి అయ్యేనాటికి వృద్ధి మరింతగా ఉంటుందని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. కొనుగోళ్ల విషయంలో కస్టమర్ల సెంటిమెంట్ బలంగా ఉందని శామ్‌సంగ్ చెబుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది ధంతేరస్‌కు 20 శాతం అధికంగా అమ్మకాలు సాధించామని శాంసంగ్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఎస్‌వీపీ రాజు పుల్లన్ వెల్లడించారు. ఓఎల్‌ఈడీ టీవీ, అల్ట్రా హెచ్‌డీ టీవీ, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్, చార్‌కోల్ మైక్రోవేవ్స్ వంటి ఉత్పత్తులకు స్థిరమైన వృద్ధి చూస్తున్నామని ఎల్‌జీ ఇండియా కార్పొరేట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ తెలిపారు. గోద్రెజ్ అప్లయాన్సెస్ 45 శాతం వృద్ధి నమోదు చేసింది. 2019లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ భారత్‌లో సుమారు రూ.76,400 కోట్లు ఉంది.
ధన్‌తేరస్‌కు గృహోపకరణాల జోరు
Published Thu, Nov 4 2021 12:49 AM | Last Updated on Thu, Nov 4 2021 12:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment