న్యూయార్క్/ ముంబై : గత(2019) ధన్‌తెరాస్ నుంచి నేటి వరకూ చూస్తే.. పసిడి ధరలు దేశీయంగా 30 శాతం ర్యాలీ చేశాయి. ఫలితంగా 10 గ్రాముల ధర తొలిసారి రూ. 50,000 మార్క్‌ను అధిగమించింది. ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ట్రిలియన్ల కొద్దీ డాలర్లతో సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. కరోనా వైరస్ కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్ తదితర సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించింది. దీంతో సంక్షోభ పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడిలోకి చౌకగా లభిస్తున్న నిధులు ప్రవహించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్ సంస్థలు తదితర ఇన్వెస్టర్లు పసిడిలో పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో ధరలు భారీగా లాభపడినట్లు విశ్లేషించారు. నిజానికి 2018 నుంచీ బంగారం లాభాల బాటలో సాగుతున్నప్పటికీ 2020లో మరింత జోరందుకున్నట్లు తెలియజేశారు. కాగా.. నేటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. న్యూయార్క్ కామెక్స్‌లో 0.15 శాతం పుంజుకోగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో నామమాత్ర లాభంతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో గురువారం పసిడి సుమారు రూ. 350, వెండి రూ. 150 స్థాయిలో బలపడ్డాయి. చదవండి: (మెరుస్తున్న పసిడి, వెండి ధరలు)
అటూఇటుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 50 లాభపడి రూ. 50,650 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,665 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,609 వద్ద కనిష్టానికి చేరింది. అయితే వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 96 క్షీణించి రూ. 62,643 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,696 వద్ద నీరసంగా ప్రారంభమైన వెండి తదుపరి రూ. 62,510 వరకూ వెనకడుగు వేసింది.
స్వల్ప లాభాలతో
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) 0.15 శాతం లాభంతో1,876 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ నామమాత్ర లాభంతో 1,878 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.2 శాతం నీరసించి ఔన్స్ 24.26 డాలర్ల వద్ద కదులుతోంది. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం)
నేలచూపుతో
అమెరికాలో గత 8 రోజులుగా రోజుకి లక్ష కేసులకుపైగా నమోదవుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బలహీనపడ్డాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా యూరోపియన్ దేశాలలోనూ కోవిడ్-19 వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడవచ్చన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు డెమొక్రాట్ల ప్రతిపాదిత ప్యాకేజీని రిపబ్లికన్లు తిరస్కరించడంతో ఆందోళనలు పెరిగినట్లు తెలియజేశారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నైమెక్స్ బ్యారల్ దాదాపు 2 శాతం పతనమై 40.35 డాలర్లకు చేరింది. మరోపక్క లండన్ మార్కెట్లోనూ బ్రెంట్ చమురు 1.55 శాతం క్షీణించి 42.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment