
ధన్తేరాస్ ‘గోల్డ్’రష్!
• దేశవ్యాప్తంగా అమ్మకాలు 25% జూమ్
• తేలికైన ఆభరణాలకే కస్టమర్ల మొగ్గు
• ఆన్‌లైన్‌లో 10 రెట్లు పెరిగిన విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ధన్‌తేరాస్‌కు దేశవ్యాప్తంగా పుత్తడి మెరిసింది. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ఆభరణ దుకాణాలు కస్టమర్ల రాకతో కళకళలాడాయి. బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు కొనడం ధన త్రయోదశికి ఆనవాయితీగా వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ధన్‌తేరాస్‌కు అమ్మకాలు 25 శాతం దాకా పెరిగాయి. అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు బాగా కురవడం కూడా సెంటిమెంటును బలపరిచింది. అటు ధర కూడా ఆకర్షణీయంగా ఉంది.
బంగారు, వెండి నాణేలు, కడ్డీల విక్రయాలు కూడా పెద్ద ఎత్తున నమోదు కావడం విశేషం. పుత్తడి కొనుగోళ్లకు దూరంగా ఉన్న కస్టమర్లు తిరిగి దుకాణాల్లో అడుగు పెడుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. 2015 ధన్‌తేరాస్, దీపావళితో పోలిస్తే ఆభరణాలు, బ్రాండెడ్ నాణేలకు ఈసారి డిమాండ్ అధికంగా ఉంటుందని వివరించింది. హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.30,460 ఉంది. వెండి కిలో రూ.42,570 పలికింది.
తేలికైన ఆభరణాలే..
దేశవ్యాప్తంగా ఈసారి తేలికైన ఆభరణాలకే కస్టమర్లు మొగ్గు చూపారని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) చైర్మన్ జి.వి.శ్రీధర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. నాణ్యతలో రాజీ లేకుండా తక్కువ బరువుతో ఆభరణాల తయారీని దేశీయ కంపెనీలు చేపడుతున్నాయని చెప్పారు. వీటి విక్రయాలు 15-20 శాతం అధికమయ్యాయని వివరించారు. డైమండ్ జువెల్లరీ అమ్మకాలు 10 శాతం దాకా పెరిగాయని చెప్పారు.
మొత్తంగా గతేడాదితో పోలిస్తే పుత్తడి విక్రయాల్లో ఉత్తరాదిలో 20-25 శాతం, దక్షిణాది రాష్ట్రాల్లో 15 శాతం వృద్ధి నమోదైందన్నారు. మెరుగైన రుతుపవనాలు, ధరలు స్థిరపడడం కారణంగా సెంటిమెంటు బలపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం తెలిపారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ కస్టమర్లకు, వర్తకులకు మరింత ఆశాజనకంగా ఉంటుందని అన్నారు. బంగారు, వెండి నాణేల విక్రయాలు 15-20 శాతం అధికమయ్యాయని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా మార్కెటింగ్ ప్రెసిడెంట్ విపిన్ రైనా వివరించారు. పెట్టుబడి సాధనంగా కస్టమర్లు భావిస్తున్నారని చెప్పారు.
అడ్వాన్సు బుకింగ్స్ సైతం..
రెండు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. ఆభరణాల అడ్వాన్సు బుకింగులు 20-25 శాతం పెరిగాయని అన్నారు. మంచి రుతుపవనిల కారణంగా ఆభరణాలకు డిమాండ్ అధికమైందని వివరించారు. 2015 ధన్‌తేరాస్‌తో పోలిస్తే ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.4 వేలు ఎక్కువగా ఉంది. ఏడాదిలో పరిమాణం పరంగా 20 శాతం, విలువ పరంగా 30 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్టు పీసీ జువెల్లర్స్ ఎండీ బలరామ్ గర్గ్ తెలిపారు. బంగారు కడ్డీలు ఎక్కువగా కొనే కస్టమర్లు ఈసారి వజ్రాభరణాలను ఎంచుకున్నారని వర్తకులు వెల్లడించారు.
ఆన్‌లైన్‌లోనూ క్లిక్..
ఈ ధన్‌తేరాస్‌కు ఆన్‌లైన్ అమ్మకాల్లో గోల్డ్, సిల్వర్ నాణేలు హాట్ ఫేవరేట్లుగా నిలిచాయి. సాధారణంగా బంగారు ఆభరణాల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆన్‌లైన్‌లో వీటి అమ్మకాలు అంతంగానే ఉన్నాయి. గతేడాది దీపావళితో పోలిస్తే డిమాండ్ ఉన్న కారణంగా ఈసారి పుత్తడి, వెండి నాణేల విక్రయాలు 10 రెట్లు అధికమవుతాయని అంచనా వేస్తున్నట్టు స్నాప్‌డీల్ వెల్లడించింది. చెవి రింగులు, పెండెంట్లు, ఉంగరాల విక్రయాలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటు బిల్లు ధర ఆన్‌లైన్‌లో రూ.20-30 వేలు ఉన్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. భారత్‌లో ఆన్‌లైన్ జువెల్లరీ మార్కెట్ 2019 నాటికి రూ.23,760 కోట్లకు చేరుతుందని అంచనా.