బంగారం అమ్మకాలకు కళ్లెం వేసిన ప్రభుత్వం
ఈ దీపావళికి బంగారం అమ్మకాలు బాగా తగ్గాయి. గోల్డ్ షాపులు ఏమంత కళకళలాడటంలేదు. బంగారానికి భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. దీపావళి లాంటి పండుగల సమయంలో ఎంతో కొంత బంగారం కొనడానికి మహిళలు ఉత్సాహం చూపుతారు. అదీగాక దీపావళికి ముందు ధనత్రయోదశి (ధన్‌తేరాస్) ఉంటుంది. అందువల్ల బంగారంతో లక్ష్మీ పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు తమ సొంతం అవుతాయనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. ఈ విశిష్ట రోజున హిందువులు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆ రకంగా బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు వస్తారని బంగారం షాపులవారు ఆశించారు. ధనత్రయోదశి (ధన్‌తేరాస్) నాడు కూడా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు నిరాశపర్చాయి. దేశంలోకి బంగారం దిగుమతులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు తీసుకుంటున్న చర్యల వల్ల కొంత ఫలితం కనిపిస్తోంది.
కిందటి ఏడాది దీపావళితో పోలిస్తే ఈ సారి అమ్మకాలు బాగా తగ్గాయి. బంగారంపై కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను బంగారం అమ్మకం దారులకు అశినిపాతంగా మారింది. ధరలు పెరగడంతో కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. గోల్డ్ స్టాకిస్టుల పరిస్ధితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. రిటైల్ మార్కెట్లో బంగారం లేక పాత బంగారాన్ని కరిగించాల్సిన పరిస్ధితి ఉందని గోల్డ్ ట్రేడర్స్ సైతం ఒప్పుకుంటున్నారు. చాలా వరకు గోల్డ్ షాపుల యజమానులు అమ్మకాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు.
కిందటి ఏడాది ఇదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర ఇంచు మించు 32వేల రూపాయలు ఉంది. అయితే అప్పుడు బంగారం అందుబాటులో ఉండేది. కానీ ఈ ఏడాది అంతే మొత్తంలో బంగారం ధరలు ఉన్నా ఇపుడు మాత్రం స్టాక్ లేదు. మొత్తం మీద ఈ సారి ధన్ త్రయోదశి పెరిగిన బంగారం ధరలతో అటు వినియోగదరుల్లోను ఇటు బంగారం అమ్మకం దారుల్లోను నిరుత్సాహం నింపింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంతవరకు ఫలిస్తున్నట్లు భావించవచ్చు. దేశ ప్రయోజనాలరీత్యా కూడా బంగారం అమ్మకాలు తగ్గవలసిన అవసరం ఉంది.