
'ధంతేరస్' రోజు బంగారానికి ఏమైంది?
న్యూఢిల్లీ: 'ధంతేరస్' రోజు గోరెడు బంగారమైనా సొంతం చేసుకోవాలని ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతదేశీయులు పవిత్రమైన రోజుగా పరిగణించే ధంతేరస్ రోజు బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలాగే ఈరోజు కచ్చితంగా అమ్మకాలు జోరందుకుంటాయనీ, తమ వ్యాపారం బావుంటుందని బంగారం దుకాణందారులు కూడా ఆశిస్తారు. ఈ మేరకు ధంతేరస్ రోజు అమ్మకాలతో పసిడి మెరుపులు మెరిపించడం మామూలే. కానీ ఈ ఏడాది మాత్రం ఇందుకు విరుద్ధంగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు పసిడి ధరలకు ఊతమివ్వలేకపోయాయి. పవిత్రమైన పండుగ సందర్భంగా ఆభరణాల కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణి ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. బులియన మార్కెట్ లో పది గ్రాముల పసిడి110 రూపాయలు క్షీణించి రూ 30,590 వద్ద నమోదవుతోంది.
అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో కూడా పుత్తడి లాభాలతో ప్రారంభమైనా నష్టాల్లోకి జారుకుంది 53 రూపాయల నష్టంతో 29,874 వద్ద ఉంది. అయితే బంగారు ఆభరణాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గ్లోబల్ ట్రెండ్ కారణంగా బంగారం ధరలు బలహీన పడుతున్నాయని బులియన్ ట్రేడర్స్ చెబుతున్నారు. విలువైన ఖనిజాలు మార్కెట్ల బలహీనంగా ధోరణి బంగారం ధరల పతనానికి దారితీసిందని తెలిపాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం ధరలు వన్నె తగ్గాయన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు బలహీనంగా ఉన్నాయి. సింగపూర్ లో ఔన్స్ బంగారం ధర 0.17తగ్గి 1,266 డాలర్లు నమోదైంది. 99.5 స్వచ్ఛత బంగారం 110 క్షీణించి రూ. 30,440 వద్ద ఉంది. వెండి ధరలు కూడా 0.34శాతం క్షీణించాయి. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ రూ. 24,500 పలుకుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో డిసెంబర్ డెలివరీ బంగారు రూ 46 పతనమై (0.15 శాతం)10 గ్రాములు రూ 29,881 వద్ద ఉంది.