
ధన్‌తేరాస్ డిమాండ్‌పై వర్తకుల ఆశలు
* ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరగొచ్చు..
* కొత్త పుత్తడి పథకాలతో సానుకూలత
ముంబై: ఇటీవల పుత్తడి ధరలు తగ్గడం వల్ల ఈ సారి ధన్‌తేరాస్(సోమవారం) రోజు పుత్తడి అమ్మకాల్లో వృద్ధి వుండవచ్చని బంగారం వర్తకులు అంచనావేస్తున్నారు. సాధారణంగా ధన్‌తేరాస్ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదనే నమ్మకం ఉంది.
ఈ నమ్మకం కారణంగా గతంలో ధన్‌తేరాస్ నాడు పుత్తడి అమ్మకాలు జోరుగా ఉండేవి. కానీ ఈసారి ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, వర్షాలు సరిగ్గా కురవకపోవడం వల్ల పుత్తడి అమ్మకాలు బలహీనంగానే ఉంటాయని తొలుత భావించారు. అయితే ధరలు తగ్గడం, ఇటీవల ప్రధాని మూడు పుత్తడి పథకాలు ప్రారంభించడం వల్ల అమ్మకాలకు సానుకూలత ఏర్పడిందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.
స్వల్ప వృద్ధికి అవకాశం
ఈ ఏడాది ధన్‌తేరాస్ అమ్మకాలు గత ఏడాది మాదిరిగానే లేదా స్వల్ప వృద్ధిగానీ ఉండొచ్చని అన్‌మోల్ జ్యూయలర్స్ వ్యవస్థాపకులు ఇషు దత్వాని చెప్పారు. వర్షాలు తగినంతగా కురవకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ తగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు ఏమంత జోరుగా ఉండకపోవచ్చని పి.ఎన్. గాడ్గిల్ జ్యూయలర్స్ కంపెనీ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ చెప్పారు.
అయితే బంగారం ధరలు బలహీనంగా ఉండటంతో కొంత డిమాండ్ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే తరహా అభిప్రాయాన్ని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ జి.వి. శ్రీధర్ వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డిమాండ్ 15-20% పెరగగలదని ఆయన అంచనా వేస్తున్నారు.