ఆఫర్లూ బంగారమే..
ధన్‌తేరాస్‌కు ఆఫర్లే ఆఫర్లు
ధర తగ్గడంతో అమ్మకాలకు జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధన త్రయోదశికి (ధన్‌తేరాస్) బంగారు మెరుపులు మెరియనున్నాయి. ధర తగ్గడంతో సామాన్యులను సైతం పుత్తడి ఊరిస్తోంది. దీనికితోడు ఆభరణాల విక్రయ సంస్థలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించాయి. బంగారు నాణేల ఉచితం, డిస్కౌంట్లు, మజూరీపై తగ్గింపు, లక్కీ డ్రా వంటి ఆఫర్లతో సిద్ధమయ్యాయి. నూతన డిజైన్లతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి. గతేడాది 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు అటూ ఇటుగా రూ.31 వేలుంటే, నేడు రూ.27,500 వద్దకు దిగొచ్చింది. దీంతో ఈసారి ధన్‌తేరాస్‌కు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధి ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) అంచనా వేస్తోంది.
జువెలర్ల ఆఫర్ల కారణంగానే అమ్మకాలకు జోష్ ఉంటుందని, నాణేల కంటే ఆభరణాల వైపే కస్టమర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతోంది. ధన త్రయోదశికి విలువైన లోహాలు కొనుగోలు చేస్తే సంపద వృద్ధి చెందుతుందని చాలా మంది భావిస్తారు. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని భారతీయ ప్రమాణాల సంస్థ ఈ సందర్భంగా కస్టమర్లకు గుర్తు చేస్తోంది. అక్టోబర్ 21న ధన్‌తేరాస్.
ఊరిస్తున్న ఆఫర్లు..
రూ.1 కోటి విలువైన బహుమతులను చెన్నై షాపింగ్ మాల్ ప్రకటించింది. ప్రతి రూ.1,000 కొనుగోలుపై లక్కీ డ్రా గిఫ్ట్ కూపన్ పొందొచ్చు. జీఆర్‌టీ జువెల్లర్స్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. బంగారం బరువుకు సమానమైన వెండి ఉచితమని ప్రకటించింది. వజ్రాల కొనుగోలుపై ప్రతి క్యారట్‌కు 25 గ్రాముల వెండి ఫ్రీగా ఇస్తోంది. రూ.25 వేల విలువగల బంగారు ఆభరణాలపై గోల్డ్ కాయిన్‌ను జోస్ ఆలుక్కాస్ అందిస్తోంది. ప్రత్యేక వజ్రాల కలెక్షన్‌ను సిద్ధం చేసింది. వజ్రాలపై 15 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఖజానా జువెల్లరీ స్వర్ణాభరణాలపై గ్రాముకు రూ.100 తగ్గింపు ఇస్తోంది.
వజ్రాలపై ఒక్కో క్యారట్‌కు రూ.5 వేలు డిస్కౌంట్ అందిస్తోంది. బంగారు నగల మజూరీపై 50 శాతం, వజ్రాల నగల మజూరీపై 100 శాతం తగ్గింపును అందుకోండంటూ టీబీజెడ్ ఆకర్షిస్తోంది. ఆభరణాలపై తరుగును తగ్గించామని కల్యాణ్ జువెల్లర్స్ చెబుతోంది. 916 ఆభరణాలపై చెన్నై ధరపై 10 గ్రాములకు రూ.1,000 తగ్గింపును జేసీ బ్రదర్స్ ఆఫర్ చేస్తోంది. రూ.50 వేలు ఆపైన ఆభరణాల కొనుగోలుపై బంగారు నాణెంను జోయాలుక్కాస్ ఆఫర్ చేస్తోంది. తయారీపై 50 శాతం డిస్కౌంట్, వజ్రాభరణాలపై తయారీ చార్జీల మినహాయింపును రిలయన్స్ జువెల్స్ అందిస్తోంది.