పసిడి ప్రియం.. సేల్స్‌ పేలవం! | Gold, silver sales down by up to 40 persant this Dhanteras | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియం.. సేల్స్‌ పేలవం!

Published Sat, Oct 26 2019 5:46 AM | Last Updated on Sat, Oct 26 2019 5:17 PM

Gold, silver sales down by up to 40 persant this Dhanteras - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ధంతేరాస్‌గా పిలిచే ధన త్రయోదశికి పసిడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 40% దాకా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.40 వేలకు అటూఇటుగా కదులుతుండటంతో పాటు.. కస్టమర్లు చేసే వ్యయాలు తగ్గడం కూడా ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిజానికి ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభసూచకమని హిందువులు భావిస్తారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా. అయితే పసిడి ధర అప్పటితో పోలిస్తే 10 గ్రా. రూ.6000 వరకూ ప్రస్తుతం ఎక్కువ. శుక్రవారం హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర రూ.39,900 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.36,850 పలికింది. కిలో వెండి రూ.50,600 ఉంది.  

రూ.2,500 కోట్ల విక్రయాలు...
ఈ సంవత్సరం ధన త్రయోదశికి శుక్రవారం సాయంత్రం వరకు రూ.2,500 కోట్ల విలువైన సుమారు 6,000 కిలోల పుత్తడి అమ్ముడైనట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) అంచనా వేసింది. గతేడాది ధనత్రయోదశికి మాత్రం రూ.5,500 కోట్ల విలువైన 17,000 కిలోల బంగారం విక్రయమైనట్లు సీఏఐటీ తెలియజేసింది. ‘‘వ్యాపారం 35–40% పడిపోయింది. గోల్డ్, సిల్వర్‌ ధరలు క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో అత్యధికంగా నిరాశపర్చిన ఏడాది ఇదే’’ అని సీఏఐటీ గోల్డ్, జ్యుయలరీ కమిటీ చైర్మన్‌ పంకజ్‌ అరోరా చెప్పారు. పరిమాణం పరంగా 2018తో పోలిస్తే అమ్మకాలు 20% తగ్గొచ్చని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ పేర్కొన్నారు.  

మెరిసిన వెండి..: అధిక ధర కారణంగా ఈ సారి సెంటిమెంట్‌ పడిపోయిందని గోల్డ్‌ రిఫైనింగ్‌ సంస్థ ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేశ్‌ ఖోస్లా చెప్పారు. ‘‘బంగారం ప్రస్తుత ధర వినియోగదార్ల దృష్టిలో చాలా ఎక్కువ. అందుకే కస్టమర్లు వెండి నాణేల వైపు మొగ్గు చూపారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సిల్వర్‌ కాయిన్స్‌ విక్రయాలు 2018తో పోలిస్తే 15% పెరిగాయని చెప్పారాయన. వివాహాల సీజన్‌ తోడవడంతో వెండి వస్తువుల అమ్మకాలు పెరిగాయని శ్రీ స్వర్ణ జ్యుయలర్స్‌ ఎండీ ప్రియ మాధవి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కాలికి వేసుకునే కడియాలకు మళ్లీ డిమాండ్‌ పెరిగిందన్నారు. విదేశాల నుంచి సైతం వీటికి ఆర్డర్లు వచ్చాయని చెప్పారామె.  

చిన్న ఆభరణాలకే..
అన్ని షోరూంలలోనూ అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని కళ్యాణ్‌ జువెల్లర్స్‌ సీఎండీ టి.ఎస్‌.కళ్యాణరామన్‌ తెలిపారు. స్తబ్దుగా ఉన్న మార్కెట్లో ధంతేరాస్‌ రాకతో పరిస్థితిలో కొంత మార్పు కనపడిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ చెప్పారు. ఈ సారి తక్కువ విలువ ఉన్న ఆభరణాల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారని జీజేసీ అంటోంది. 60–70 శాతం చిన్న ఆభరణాల అమ్మకాలేనని శారీనికేతన్‌ గోల్డ్‌ విభాగం ఇన్‌చార్జ్‌ గుల్లపూడి నాగ కిరణ్‌ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్‌తో ముడిపడి 30% పైగా అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారాయన. మొత్తంగా పుత్తడి అమ్మకాలు 40 శాతం పడిపోయాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement