హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి ముందుగా ప్రారంభం కావడమే ఇందుకు కారణం. అయితే ముడి సరుకు వ్యయాలు పెరగడంతో మరోసారి ఏసీల ధరలను సవరించే చాన్స్ ఉందని కంపెనీలు అంటున్నాయి. ఈ నెలలో లేదా ఏప్రిల్‌లో ధర 4–5 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఏడాది రెండుసార్లు ధరలను పెంచాయి. లాక్‌డౌన్ కారణంగా గతేడాది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో 2021లో కోవిడ్ ముందస్తు స్థాయికి అమ్మకాలు చేరతాయని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. భారత్‌లో ఏసీల పరిశ్రమ 70–75 లక్షల యూనిట్లుగా ఉంది.
భారమవుతున్న ముడిసరుకు..
ఏసీల తయారీలో వాడే కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కంప్రెసర్ల ధరలూ అధికమవుతూనే వస్తున్నాయి. దేశీయ పరిశ్రమ ఇప్పటికీ పెద్ద ఎత్తున కంప్రెసర్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక ఈ ఏడాది ఒక్కో ఏసీపై రూ.1,500–2,000 వరకు ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి. మూడు నెలలుగా ముడిసరుకు వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని లాయిడ్ అంటోంది. తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ధరలు మరోసారి పెంచడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసింది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ ధరలను ఎల్‌జీ సవరించింది.
కొత్త కస్టమర్ల చేరిక..
ఈసారి వేసవిలో ఏసీల అమ్మకాలు జోరుగా ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. ముందస్తుగా అమ్మకాలు మొదలు కావడంతో వేసవి తాపం మాదిరిగానే విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు అంటున్నాయి. ఈ సంవత్సరం కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశగా ఉన్నాయి. పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందనే ధీమాతో ఉంది. రవాణా వ్యయాలు భారమవుతున్నాయని హాయర్ చెబుతోంది. 4–5 శాతం ధర పెంచనున్నామని.. అధిక వేసవి దృష్ట్యా సవరించిన ధరల ప్రభావం అమ్మకాలపై ఉండబోదని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రెండింతల అమ్మకాలు సాధించామని వెల్లడించింది.
ముందుగా మొదలైన విక్రయాలు..
విపరీత డిమాండ్ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి తయారీ సామర్థ్యంతో ఏసీ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని ఎల్‌జీ వెల్లడించింది. 2019తో పోలిస్తే 40 శాతం వృద్ధికి చాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. గతేడాది అమ్మకాలు లేకపోవడం, ప్రస్తుతం ఎండలు జోరుగా మొదలు కావడంతో 2021 సీజన్‌లో ఏసీలకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మూడు నాలుగు నెలలుగా డిమాండ్ 25 శాతం పెరిగిందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని జోస్యం చెబుతోంది. 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం సేల్స్‌లో 15 శాతంపైగా వృద్ధి ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. ఫిబ్రవరి నుంచే కస్టమర్ల రాక పెరిగిందని అన్నారు.
వాహనం... భారం!
► మరోసారి పెంపునకు కంపెనీల సిద్ధం
► ముడి సరుకు వ్యయాల ప్రభావం
► ఇప్పటికే పెరిగిన పలు మోడళ్ల ధర
చెన్నై: వాహనాల ధరలు మరోసారి పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ఇతర ముడి సరుకు వ్యయాలే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి 1–3 శాతం ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ, మోడల్‌నుబట్టి వాహనం ధర రూ.45,000 వరకు పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వాహనాల ధరలను సవరించే అవకాశం ఉంది. మరోవైపు బీఎస్–4 నుంచి బీఎస్–6కి మళ్లిన సమయంలో వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి.
ముడి పదార్థాల భారం..
ముడి పదార్థాల ఖర్చులు అధికం అయ్యాయని ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ తెలిపారు. వాణిజ్య వాహనాలతోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ ధరలనూ పెంచుతామన్నారు. ‘అక్టోబరు, జనవరిలో ధరలను పెంచాం. స్టీల్, ప్రత్యేక ఖనిజాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ధరల సవరణ తప్ప మరో మార్గం లేదు’ అని అశోక్ లేలాండ్ సీఎఫ్‌వో, డైరెక్టర్ గోపాల్ మహదేవన్ అన్నారు. ఏప్రిల్–జూన్‌లో వాణిజ్య వాహనాలతోపాటు ఎస్‌యూవీల ప్రైస్ పెంచనున్నట్టు మహీంద్రా గ్రూప్ ఆటో ఈడీ రాజేశ్ జేజూరికర్ వెల్లడించారు.
ఇప్పటికే రూ.2 వేలు పెంపు, మరింత పెరగనున్న ఏసీల ధరలు
Published Fri, Mar 12 2021 4:18 AM | Last Updated on Fri, Mar 12 2021 8:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment