Raw materials prices
-
చిన్న ప్యాకెట్.. సూపర్‌హిట్!
న్యూఢిల్లీ: రకరకాల కారణాలతో ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆ స్థాయిలో ఉత్పత్తుల రేట్లు పెంచలేని పరిస్థితి నెలకొంది. అత్యంత ఆదరణ ఉండే చిన్న ప్యాకెట్ల ధరలను పెంచితే కొనుగోళ్లు తగ్గిపోతాయన్న ఆందోళనతో అవి కస్టమర్లను నిలబెట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రేట్లు పెంచే బదులు గ్రామేజీ (బరువు)ని తగ్గించి అదే ధరకు సదరు ఉత్పత్తులను అందిస్తున్నాయి. తక్కువ రేటు ఉండే చిన్న ప్యాకెట్లకు (ఎల్‌యూపీ) డిమాండ్ బాగానే ఉండటంతో ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. పలు కంపెనీలు తమ సబ్బులు, నూడుల్స్ మొదలుకుని చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్ల వరకూ వివిధ ఉత్పత్తుల విషయంలో ఇదే వ్యూహం పాటిస్తున్నాయి. వీటితో పాటు మధ్యస్థ రేట్లతో బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెట్టడం, పెద్ద ప్యాక్‌లపై ధరల పెంపును సింగిల్ డిజిట్ స్థాయికి పరిమితం చేయడం వంటి ప్రయత్నాలెన్నో చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ఒకవైపు ధరలపరమైన చర్యలతో పాటు మరోవైపు వ్యయాల నియంత్రణ కసరత్తుతో ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌యూపీ ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడవుతాయి. వీటి ధర శ్రేణి రూ. 1, రూ. 5, రూ. 10 స్థాయిలో ఉంటుంది. బండగుర్తుల్లాంటి ఈ రేట్లలో మార్పులు చేయలేని పరిస్థితి. అందుకే గ్రామేజీని తగ్గించి అదే రేట్లకు అందిస్తున్నాం. అదే పట్టణ ప్రాంతాల విషయానికొస్తే తలసరి ఆదాయం కాస్త ఎక్కువ. వినియోగదారులకు ఎక్కువ వెచ్చించగలిగే సామర్థ్యాలు ఉంటాయి. అందుకే పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచాము’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాస్త డబ్బు చేతిలో ఆడేలా చూసుకునేందుకు వినియోగదారులు ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా చౌక ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న సంకేతాలు తాము గమనించినట్లు పార్లే ప్రోడక్ట్స్ వర్గాలు తెలిపాయి. ఎల్‌యూపీ ప్యాక్‌ల అమ్మకాల్లో పెరుగుదల ఇందుకు నిదర్శనమని వివరించాయి. మార్చి త్రైమాసికం నుంచి మారిన ట్రెండ్.. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి క్వార్టర్లో ఇటు పట్టణ అటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌ల వినియోగం గణనీయంగా పెరిగినట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం బిజోమ్ తెలిపింది. వంట నూనెలు వంటి కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం అసాధారణ స్థాయికి పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు వీలైనంత వరకూ పర్సులపై భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఎక్కువ పరిమాణంలో సరుకులు కొనుక్కునే వారు కూడా ప్రస్తుతం బడ్జెట్‌కి కట్టుబడి ఉండే ప్రయత్నాల్లో భాగంగానే ఎల్‌యూపీ ప్యాక్‌లవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. చాలా మటుకు ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో రూ. 1 నుంచి రూ. 10 వరకూ రేటుతో చిన్న ప్యాక్‌ల వాటా 25–35 శాతం మేర ఉంటోంది. హెచ్‌యూఎల్ వ్యాపారంలో ఇలాంటి చౌక ప్యాక్‌ల విక్రయాలు 30 శాతం వరకూ ఉంటాయి. ఇమామీ అమ్మకాల్లో వీటి వాటా 24 శాతం స్థాయిలో ఉంది. అటు బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో అమ్మకాల్లో రూ. 5, రూ. 10 స్థాయి ప్యాక్‌ల వాటా 50–55 శాతం వాటా ఉంటోంది. అమ్మకాల సంగతి అలా ఉంచితే చిన్న ప్యాక్‌ల విషయంలోనూ కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అబనీష్ రాయ్ వివరించారు. పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచగలిగినప్పటికీ .. తక్కువ ధర యూనిట్లలో నిర్దిష్ట స్థాయికన్నా గ్రామేజీని తగ్గించడానికి వీల్లేదు. దీంతో అవి ప్రత్యేకంగా బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెడుతున్నాయి. హెచ్‌యూఎల్, ఇమామీ ఇలాంటి వాటిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కాస్తంత ఎక్కువ ధరకు, ఎల్యూపీతో పోలిస్తే ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఓ మోస్తరు అవసరాల కోసం వినియోగదారులు అనవసరంగా అధిక రేటు పెట్టి పెద్ద ప్యాక్‌లను కొనుక్కోవాల్సిన పరిస్థితి తప్పుతుందని రాయ్ పేర్కొన్నారు. ఇది ఇటు కొనుగోలుదారులు అటు కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటోందని వివరించారు. -
సామాన్యుల నెత్తి మీద మరో పిడుగు..!
Paint Companies To Hike Prices In December Again: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు, అధిక రిటైల్ ద్రవ్యోల్భణంలో సతమతమవుతున్న సామాన్యుల నెత్తి మీద మరో భారం పడనుంది. దేశవ్యాప్తంగా పెయింట్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ముడిపదార్థాల ధరలు, ఇంధన వ్యయాలతో పోరాడుతున్న పెయింట్ కంపెనీలు మార్జిన్లను కాపాడుకునేందుకు గాను వరుసగా మరోసారి పెయింట్ధరలను పెంచనున్నాయి. పెయింట్ ఇండస్ట్రీలో సుమారు 50 శాతం మేర వాటాలను కల్గిన ఏషియన్ పెయింట్స్, బెర్జర్ కంపెనీలు వచ్చే నెల 5 నుంచి సుమారు 4-6 శాతం మేర పెయింట్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఈ కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది మొత్తంగా పెయింట్ ధరలు రికార్డుస్థాయిలో 19-20 శాతం మేర పెరిగాయి. దిగ్గజ పెయింట్ కంపెనీలు ధరల పెంపును ప్రకటించడంతో అక్జో నోబెల్ ఇండియా , ఇండిగో పెయింట్స్ వంటి పెయింట్ కంపెనీలు కూడా ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యల్భోణం...! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్ రంగాల్లోని అంతరాయాలు నియంత్రణలోకి వచ్చిన ముడిసరుకు ఖర్చులు తగ్గుముఖం పడతాయనే అంచనాలు తలకిందులైనాయి. పెయింట్ కంపెనీలు కనీస మార్జిన్ లాభాలను పొందేందుకుగాను కచ్చితంగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమిత్ సింగల్ క్యూ2 ఫలితాల్లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. గత 40 ఏళ్లలో కనీస వస్తు ధరల్లో ఈ విధమైన ద్రవ్యోల్బణాన్ని చూడలేదని అమిత్ సింగల్ అన్నారు. ఒక వేళ ధరలను పెంచకపోతే కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్ రేట్స్ భారీగా పడిపోయే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆపరేటింగ్ మార్జిన్లను 18-20 శాతం స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజ్మెంట్ సూచించింది పెంపుదల అనివార్యం... పెయింట్ ధరల పెంపు అనివార్యమని బెర్జర్ పెయింట్స్ ఎమ్డీ, సీఈవో అభిజీత్ రాయ్ అన్నారు. FY22 క్యూ2లో దాదాపు అన్ని పెయింట్ కంపెనీలు రెండంకెల వాల్యూమ్ వృద్ధిని సాధించాయి. FY22 క్యూ4లో కనీసం నుండి 18 శాతం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. చదవండి: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా? -
ఇప్పటికే రూ.2 వేలు పెంపు, మరింత పెరగనున్న ఏసీల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి ముందుగా ప్రారంభం కావడమే ఇందుకు కారణం. అయితే ముడి సరుకు వ్యయాలు పెరగడంతో మరోసారి ఏసీల ధరలను సవరించే చాన్స్ ఉందని కంపెనీలు అంటున్నాయి. ఈ నెలలో లేదా ఏప్రిల్‌లో ధర 4–5 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఏడాది రెండుసార్లు ధరలను పెంచాయి. లాక్డౌన్ కారణంగా గతేడాది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో 2021లో కోవిడ్ ముందస్తు స్థాయికి అమ్మకాలు చేరతాయని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. భారత్‌లో ఏసీల పరిశ్రమ 70–75 లక్షల యూనిట్లుగా ఉంది. భారమవుతున్న ముడిసరుకు.. ఏసీల తయారీలో వాడే కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కంప్రెసర్ల ధరలూ అధికమవుతూనే వస్తున్నాయి. దేశీయ పరిశ్రమ ఇప్పటికీ పెద్ద ఎత్తున కంప్రెసర్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక ఈ ఏడాది ఒక్కో ఏసీపై రూ.1,500–2,000 వరకు ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి. మూడు నెలలుగా ముడిసరుకు వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని లాయిడ్ అంటోంది. తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ధరలు మరోసారి పెంచడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసింది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ ధరలను ఎల్జీ సవరించింది. కొత్త కస్టమర్ల చేరిక.. ఈసారి వేసవిలో ఏసీల అమ్మకాలు జోరుగా ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. ముందస్తుగా అమ్మకాలు మొదలు కావడంతో వేసవి తాపం మాదిరిగానే విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు అంటున్నాయి. ఈ సంవత్సరం కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశగా ఉన్నాయి. పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందనే ధీమాతో ఉంది. రవాణా వ్యయాలు భారమవుతున్నాయని హాయర్ చెబుతోంది. 4–5 శాతం ధర పెంచనున్నామని.. అధిక వేసవి దృష్ట్యా సవరించిన ధరల ప్రభావం అమ్మకాలపై ఉండబోదని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రెండింతల అమ్మకాలు సాధించామని వెల్లడించింది. ముందుగా మొదలైన విక్రయాలు.. విపరీత డిమాండ్ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి తయారీ సామర్థ్యంతో ఏసీ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని ఎల్జీ వెల్లడించింది. 2019తో పోలిస్తే 40 శాతం వృద్ధికి చాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. గతేడాది అమ్మకాలు లేకపోవడం, ప్రస్తుతం ఎండలు జోరుగా మొదలు కావడంతో 2021 సీజన్లో ఏసీలకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మూడు నాలుగు నెలలుగా డిమాండ్ 25 శాతం పెరిగిందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని జోస్యం చెబుతోంది. 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం సేల్స్‌లో 15 శాతంపైగా వృద్ధి ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. ఫిబ్రవరి నుంచే కస్టమర్ల రాక పెరిగిందని అన్నారు. వాహనం... భారం! ► మరోసారి పెంపునకు కంపెనీల సిద్ధం ► ముడి సరుకు వ్యయాల ప్రభావం ► ఇప్పటికే పెరిగిన పలు మోడళ్ల ధర చెన్నై: వాహనాల ధరలు మరోసారి పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ఇతర ముడి సరుకు వ్యయాలే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి 1–3 శాతం ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ, మోడల్‌నుబట్టి వాహనం ధర రూ.45,000 వరకు పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వాహనాల ధరలను సవరించే అవకాశం ఉంది. మరోవైపు బీఎస్–4 నుంచి బీఎస్–6కి మళ్లిన సమయంలో వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పదార్థాల భారం.. ముడి పదార్థాల ఖర్చులు అధికం అయ్యాయని ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ తెలిపారు. వాణిజ్య వాహనాలతోపాటు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ ధరలనూ పెంచుతామన్నారు. ‘అక్టోబరు, జనవరిలో ధరలను పెంచాం. స్టీల్, ప్రత్యేక ఖనిజాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ధరల సవరణ తప్ప మరో మార్గం లేదు’ అని అశోక్ లేలాండ్ సీఎఫ్‌వో, డైరెక్టర్ గోపాల్ మహదేవన్ అన్నారు. ఏప్రిల్–జూన్‌లో వాణిజ్య వాహనాలతోపాటు ఎస్‌యూవీల ప్రైస్ పెంచనున్నట్టు మహీంద్రా గ్రూప్ ఆటో ఈడీ రాజేశ్ జేజూరికర్ వెల్లడించారు. -
భారమైన కులవృత్తి
ఆదిలాబాద్ రూరల్ : ముడిసరుకుల ధరలు పెరిగిపోవడం, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న రజకులు ఆదా యం లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 35వేల కుటుంబాలు రజక వృత్తిని నమ్ముకుని జీవిస్తుం డగా కొన్నేళ్ల నుంచి వృత్తికి ఆదరణ తగ్గింది. దీంతో ఆదాయం లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారు. కొన్ని కుటుంబాలవారు ఇతర పనులు చూసుకుంటున్నారు. కూడు పెట్టని కుల వృత్తి.. కొంత మంది రజకులు కులవృత్తిని విడిచిపెట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వారి సంక్షేమం కోసం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో గ్రామపంచాయతీలు వారి శ్రమను గుర్తించి గ్రామ పంచాయతీ నిధుల నుంచి ధోబీఘాట్లను నిర్మించి ఇస్తున్నారు. కానీ వాటికి మోటార్ కనెక్షన్లు లేకపోవడంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ధోబీఘాట్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ నుంచి రూ.2లక్షలు ఖర్చు చేసి ధోబీఘాట్ నిర్మించారు. దానికి నీటి మోటార్ మంజూరు లేకపోవడంతో అది నిరుపయోగమైంది. ఇలా జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో రజకుల కులవృత్తులను కాపాడడానికి గ్రామపంచాయతీలు ముందుకు వస్తున్నా ప్రభుత్వాలు మాత్రం వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పలువురు రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరుకు నోచుకోని ధోబీఘాట్లు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 29 ధోబీఘాట్లను నిర్మించాలని అధికారులు అంచనా వేశారు. వీటికి అవసరమయ్యే నిధుల కోసం బీసీ సంక్షేమాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించగా ఒక్క ధోబీఘాట్‌కు నిధులు మంజూరు కాలేదు. దీంతో జిల్లాలోని రజకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 52 మండలాల్లో సుమారు 40వేల రజక కుటుంబాలున్నాయి. వీరిలో సుమారు 4వేల కుటుంబాలకు పైబడి హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోయాయి. కొందరు అపార్ట్మెంట్స్ వద్ద వాచ్మెన్లుగా, మరి కొందరు భవన నిర్మాణ కార్మికులుగా స్థిరపడ్డారు. వృత్తిని నమ్ముకున్నవారు వేసవిలో చెరువులు, కాలువలు ఎండిపోవడంతో నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు గంజి పొడి, బొగ్గులు, సబ్బులు, సోడా, నీలి మందు ధరలు పెరిగిపోవడంతో శ్రమకు తగ్గ ప్రతిఫలం రావడంలేదని వారు వాపోతున్నారు. కులవృత్తులపై ఆధారపడిన వారికి పింఛన్లు, ఇళ్ల స్థలా లు, రేషన్‌కార్డులు ఇప్పించాలని వారు కోరుతున్నారు.