భారమైన కులవృత్తి | The oppressive caste occupation | Sakshi
Sakshi News home page

భారమైన కులవృత్తి

Published Fri, Nov 14 2014 3:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

The oppressive caste occupation

ఆదిలాబాద్ రూరల్ : ముడిసరుకుల ధరలు పెరిగిపోవడం, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న రజకులు ఆదా యం లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 35వేల కుటుంబాలు రజక వృత్తిని నమ్ముకుని జీవిస్తుం డగా కొన్నేళ్ల నుంచి వృత్తికి ఆదరణ తగ్గింది. దీంతో ఆదాయం లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారు. కొన్ని కుటుంబాలవారు ఇతర పనులు చూసుకుంటున్నారు.  

 కూడు పెట్టని కుల వృత్తి..
 కొంత మంది రజకులు కులవృత్తిని విడిచిపెట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వారి సంక్షేమం కోసం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో గ్రామపంచాయతీలు వారి శ్రమను గుర్తించి గ్రామ పంచాయతీ నిధుల నుంచి ధోబీఘాట్‌లను నిర్మించి ఇస్తున్నారు. కానీ వాటికి మోటార్ కనెక్షన్‌లు లేకపోవడంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ధోబీఘాట్‌లు నిరుపయోగంగా మారుతున్నాయి.

ఉదాహరణకు ఆదిలాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ నుంచి రూ.2లక్షలు ఖర్చు చేసి ధోబీఘాట్ నిర్మించారు. దానికి నీటి మోటార్ మంజూరు లేకపోవడంతో అది నిరుపయోగమైంది. ఇలా జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో రజకుల కులవృత్తులను కాపాడడానికి గ్రామపంచాయతీలు ముందుకు వస్తున్నా ప్రభుత్వాలు మాత్రం వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పలువురు రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 మంజూరుకు నోచుకోని ధోబీఘాట్‌లు..
 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 29 ధోబీఘాట్‌లను నిర్మించాలని అధికారులు అంచనా వేశారు. వీటికి అవసరమయ్యే నిధుల కోసం బీసీ సంక్షేమాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించగా ఒక్క ధోబీఘాట్‌కు నిధులు మంజూరు కాలేదు. దీంతో జిల్లాలోని రజకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 52 మండలాల్లో సుమారు 40వేల రజక కుటుంబాలున్నాయి. వీరిలో సుమారు 4వేల కుటుంబాలకు పైబడి హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోయాయి.

కొందరు అపార్ట్‌మెంట్స్ వద్ద వాచ్‌మెన్లుగా, మరి కొందరు భవన నిర్మాణ కార్మికులుగా స్థిరపడ్డారు. వృత్తిని నమ్ముకున్నవారు వేసవిలో చెరువులు, కాలువలు ఎండిపోవడంతో నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు గంజి పొడి, బొగ్గులు, సబ్బులు, సోడా, నీలి మందు ధరలు పెరిగిపోవడంతో శ్రమకు తగ్గ ప్రతిఫలం రావడంలేదని వారు వాపోతున్నారు. కులవృత్తులపై ఆధారపడిన వారికి పింఛన్లు, ఇళ్ల స్థలా లు, రేషన్‌కార్డులు ఇప్పించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement