modern equipment
-
సర్వజనాస్పత్రికి అత్యాధునిక పరికరాలు
అనంతపురం మెడికల్ : అనంతపురం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వజనాస్పత్రికి అత్యాధునిక పరికరాలు వచ్చాయి. సుమారు రూ.2 కోట్ల విలువైన పరికరాలను విజయవాడ నుంచి పంపారు. రెండు ల్యాప్రోస్కోపీ యంత్రాలు, ఆర్థో ఆపరేషన్ థియేటర్‌కు సియాం, టేబుళ్లు, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రి, గైనిక్ తదితర పది విభాగాలకు వీటిని సరఫరా చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద శస్త్ర చికిత్సలు మెరుగు పర్చడంలో భాగంగా ఈ ఆధునిక పరికరాలను ఆస్పత్రికి సమకూర్చారు. ఇందులో ఓ ల్యాప్రోస్కోపీ పరికరం ఒక్కటే రూ.52 లక్షలు కావడం గమనార్హం. -
భారమైన కులవృత్తి
ఆదిలాబాద్ రూరల్ : ముడిసరుకుల ధరలు పెరిగిపోవడం, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న రజకులు ఆదా యం లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 35వేల కుటుంబాలు రజక వృత్తిని నమ్ముకుని జీవిస్తుం డగా కొన్నేళ్ల నుంచి వృత్తికి ఆదరణ తగ్గింది. దీంతో ఆదాయం లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారు. కొన్ని కుటుంబాలవారు ఇతర పనులు చూసుకుంటున్నారు. కూడు పెట్టని కుల వృత్తి.. కొంత మంది రజకులు కులవృత్తిని విడిచిపెట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వారి సంక్షేమం కోసం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో గ్రామపంచాయతీలు వారి శ్రమను గుర్తించి గ్రామ పంచాయతీ నిధుల నుంచి ధోబీఘాట్లను నిర్మించి ఇస్తున్నారు. కానీ వాటికి మోటార్ కనెక్షన్లు లేకపోవడంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ధోబీఘాట్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ నుంచి రూ.2లక్షలు ఖర్చు చేసి ధోబీఘాట్ నిర్మించారు. దానికి నీటి మోటార్ మంజూరు లేకపోవడంతో అది నిరుపయోగమైంది. ఇలా జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో రజకుల కులవృత్తులను కాపాడడానికి గ్రామపంచాయతీలు ముందుకు వస్తున్నా ప్రభుత్వాలు మాత్రం వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పలువురు రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరుకు నోచుకోని ధోబీఘాట్లు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 29 ధోబీఘాట్లను నిర్మించాలని అధికారులు అంచనా వేశారు. వీటికి అవసరమయ్యే నిధుల కోసం బీసీ సంక్షేమాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించగా ఒక్క ధోబీఘాట్‌కు నిధులు మంజూరు కాలేదు. దీంతో జిల్లాలోని రజకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 52 మండలాల్లో సుమారు 40వేల రజక కుటుంబాలున్నాయి. వీరిలో సుమారు 4వేల కుటుంబాలకు పైబడి హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోయాయి. కొందరు అపార్ట్మెంట్స్ వద్ద వాచ్మెన్లుగా, మరి కొందరు భవన నిర్మాణ కార్మికులుగా స్థిరపడ్డారు. వృత్తిని నమ్ముకున్నవారు వేసవిలో చెరువులు, కాలువలు ఎండిపోవడంతో నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు గంజి పొడి, బొగ్గులు, సబ్బులు, సోడా, నీలి మందు ధరలు పెరిగిపోవడంతో శ్రమకు తగ్గ ప్రతిఫలం రావడంలేదని వారు వాపోతున్నారు. కులవృత్తులపై ఆధారపడిన వారికి పింఛన్లు, ఇళ్ల స్థలా లు, రేషన్‌కార్డులు ఇప్పించాలని వారు కోరుతున్నారు. -
బూట్ ఫర్ బెనిఫిట్
సెంట్రల్ ఏసీ... మోడ్రన్ ఎక్విప్మెంట్, చెమటలు పట్టిన శరీరం నుంచి వచ్చే స్మెల్, నియంత్రించేందుకు ఉపయోగించే ఆర్టిఫిషియల్ పరిమళం... వీటి నుంచి ఉపశమనం కలిగిస్తూ అందుబాటులోకి వచ్చినవే బూట్ క్యాంప్స్. నాలుగు గోడల మధ్య కన్నా గాలి, వెలుతురుధారాళంగా ఉండే చోటే ఎక్సర్సైజ్కు సరైన నెలవని భావిస్తున్నారు సిటీజనులు. కాళ్లకు బూట్లు తొడుక్కొని పచ్చదనం పరుచుకున్న ప్రదేశాల్లో ప్రత్యక్షం అవుతున్నారు. క్యాహై ‘క్యాంప్’? సైనిక శిక్షణలో భాగంగా అమెరికాలో ప్రారంభమైన బూట్‌క్యాంప్ యాక్టివిటీ.. దేహాన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించినది. కామన్ పబ్లిక్ దీనికి చేరువ కావడానికి కారణం.. ఇది సమూహంతో కలసి చేసే ఓపెన్ ఎయిర్ వర్కవుట్ కావడమే. సిటీలో పార్క్‌లు.. స్పేసియస్ గ్రౌండ్స్.. అవుట్ కట్స్‌లో కొండ గుట్టలు ఈ బూట్క్యాంప్స్కు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఫిట్నెస్ కోసం తపిస్తున్న సిటీవాసులు.. ప్రకృతి ఒడిలో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ బూట్‌క్యాంప్ మంత్రాన్ని పఠిస్తున్నారు. వెయిట్ నిల్.. ఎనర్జీ ఫుల్.. ఈ బూట్‌క్యాంప్‌లో వయసు, ఫిట్నెస్ స్థాయిల వారీగా బృందాలను విభజిస్తారు. ఆయా బృందాలకు తగ్గట్టుగా ఫిట్నెస్ ఫార్ములా రూపొందిస్తారు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా పరికరాలు సమకూరుస్తారు. ఇందులో బాడీ వెయిట్ తగ్గించే వ్యాయామాలకే ఫ్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాకింగ్‌తో మొదలయ్యే బూట్‌క్యాంప్ వ్యాయామం.. స్ట్రెచ్ లేదా యోగా భంగిమలతో పూర్తవుతుంది. ఈ మధ్యలో విభిన్న రకాలుగా చేసే పుషప్స్, జంపింగ్ జాక్స్, ట్విస్టింగ్, క్రాస్ జాక్స్, ఫ్రంట్ జాక్స్, డక్ వాక్, టైగర్ వాక్, క్రొకడైల్ వాక్, క్రాబ్ వాక్, రన్నింగ్, జాగింగ్, స్ప్రింటింగ్.. ఇలా సరికొత్త థీమ్స్‌తో వర్కవుట్స్ చేయిస్తారు. ఈ వ్యాయామంలో భాగంగా కోన్స్, స్విస్బాల్స్, ఫ్లోర్నెట్స్, క్లైంబర్ నెట్స్, చాపింగ్ స్టిక్స్, రెసిస్టెన్స్ ట్యూబ్స్, హ్యామర్స్, బ్యాగ్స్ వంటి పరికరాలను సైతం వినియోగిస్తారు. ఈ శిబిరాల్లో ఆర్గానిక్ ఫుడ్ అందిస్తారు. వీటిలో హెల్త్-ఫిట్నెస్ సెషన్స్ కూడా భాగమే. ఆరోగ్యమే.. బెని‘ఫిట్’ ఈ తరహా బూట్ క్యాంప్‌లను నిర్వహించడానికి నగరానికి చెందిన కార్పొరేట్ కంపెనీలు బాగా ఆసక్తి చూపిస్తున్నాయని వావ్ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకురాలు పూర్ణిమారావు అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని, పనిలో చురుకుదనాన్ని ఆశిస్తున్న కంపెనీలు.. వారి కోసం బూట్క్యాంప్స్ను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. ఈ క్యాంప్‌ల నిర్వహణ కోసం విశాల ప్రాంగణాలను కూడా నిర్వాహకులు అద్దెకు తీసుకుంటున్నారు. అనుభవ జ్ఞులైన ఫిట్నెస్ ట్రైనర్స్, ఫిజియో థెరపిస్ట్, డైటీషియన్.. వంటి నిపుణుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో పిక్నిక్లా ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుండడంతో బూట్‌క్యాంప్‌లకు సిటీలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. హ్యాపీనెస్.. ఎక్సర్సైజ్లకు ఎక్కువ స్పేస్ దొరుకుతూ, టైర్డ్‌గా అనిపించకపోవడం, డిఫరెంట్ టైప్ వర్కవుట్స్‌తో పాటు ఫన్నీగేమ్స్, క్లీన్ వెదర్ బూట్‌క్యాంప్‌ల ప్రత్యేకత. మా ఫిట్నెస్ స్టూడియో ఆధ్వర్యంలో వారానికి రెండు సార్లయినా ఈ తరహా క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. వీటి వల్ల ఫిట్నెస్తో పాటు హ్యాపీనెస్ కూడా అదనంగా దొరుకుతుంది. - పూర్ణిమారావు, వావ్ ఫిట్నెస్ స్టూడియో -
కార్మికులకు ఆధునిక వైద్యసేవలు
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్: ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఆధునిక పరికరాలతో కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఎస్ఐ విజయవాడ రీజియన్ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. విజయవాడ రీజియన్ పరిధిలోని 49 ఈఎస్ఐ డిస్పెన్సరీలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి కార్మికులకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. కార్మికులు ఎక్కువగా ఉన్న దాచేపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి ప్రాంతాల్లో శాశ్వత డిస్పెన్సరీలు లేకపోవడంతో అక్కడ ప్యానల్ వైద్యులతో సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో రూ.15 వేల లోపు వేతనం పొందే కార్మికులకే ఈఎస్ఐ డిస్పెన్సరీలలో వైద్యం పొందే అవకాశం ఉండగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసిందన్నారు. రూ.25 వేల లోపు వేతనం పొందే కార్మికులకు కూడా ఈఎస్ఐ ద్వారా వైద్యం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న కార్మికులకు ఎక్కడ వైద్యం చేయించుకున్నా రూ.పది లక్షల వరకు మెడికల్ రీయింబర్స్‌మెంటు సౌకర్యం కల్పిస్తామన్నారు. డిస్పెన్సరీ సొంత భవనంపై చర్చ స్థానికంగా అద్దె భవనంలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించిన ఆర్జేడీ రవికుమార్ స్థానిక వైద్యుడు కె.రామకోటయ్యతో చర్చించారు. వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత భవనం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి గతంలోనే భూమి కేటాయించాలని అడిగినట్లు చెప్పారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చేంతవరకు కేసీపీ కాలనీలో ఓ గృహాన్ని ఆస్పత్రి నిర్వహణకు కేటాయించాలని కోరామన్నారు. సంబంధిత విషయమై కేసీపీ యాజమాన్యంతో చర్చించి సొంత భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈఎస్ఐ పానల్ క్లినిక్‌ను సందర్శించిన ఆర్జేడీ దాచేపల్లి: ఈఎస్ఐ ద్వారా కార్మికులకు కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నామని విజయవాడ ఆర్జేడీ డాక్టర్ జి.రవికుమార్ అన్నారు. నారాయణపురంలోని క్రాంతి నర్సింగ్ హోంలోని ఈఎస్ఐ పానల్ క్లినిక్‌లో అమలవుతున్న వైద్యసేవలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈఎస్ఐ పరిధిలో 1390 మంది కార్మికులు ఉన్నారని, రోజూ 15 నుంచి 20 మంది కార్మికులకు వైద్యం అందిస్తున్నామని డాక్టర్ క్రాంతికుమార్ వివరించారు. ఈఎస్ఐకి సంబంధించిన రికార్డులను పరిశీలించి ఆర్జేడీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ రీజియన్ పరిధిలో 3.50 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐలో సభ్యత్వం పొందారని, ఒక్కో కుటుంబంలో నలుగురు వంతున సుమారు 12 లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. రీజియన్ పరిధిలోని గుంటూ రు, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో రోజుకు 5 వేల మంది ఈఎస్ఐ ద్వారా వైద్యసేవలు పొందుతున్నారని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.