మాచర్ల టౌన్, న్యూస్‌లైన్: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఆధునిక పరికరాలతో కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఎస్‌ఐ విజయవాడ రీజియన్ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక ఈఎస్‌ఐ డిస్పెన్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. విజయవాడ రీజియన్ పరిధిలోని 49 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి కార్మికులకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.
కార్మికులు ఎక్కువగా ఉన్న దాచేపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి ప్రాంతాల్లో శాశ్వత డిస్పెన్సరీలు లేకపోవడంతో అక్కడ ప్యానల్ వైద్యులతో సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో రూ.15 వేల లోపు వేతనం పొందే కార్మికులకే ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో వైద్యం పొందే అవకాశం ఉండగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసిందన్నారు. రూ.25 వేల లోపు వేతనం పొందే కార్మికులకు కూడా ఈఎస్‌ఐ ద్వారా వైద్యం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న కార్మికులకు ఎక్కడ వైద్యం చేయించుకున్నా రూ.పది లక్షల వరకు మెడికల్ రీయింబర్స్‌మెంటు సౌకర్యం కల్పిస్తామన్నారు.
డిస్పెన్సరీ సొంత భవనంపై చర్చ
స్థానికంగా అద్దె భవనంలో ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీని సందర్శించిన ఆర్జేడీ రవికుమార్ స్థానిక వైద్యుడు కె.రామకోటయ్యతో చర్చించారు. వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత భవనం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి గతంలోనే భూమి కేటాయించాలని అడిగినట్లు చెప్పారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చేంతవరకు కేసీపీ కాలనీలో ఓ గృహాన్ని ఆస్పత్రి నిర్వహణకు కేటాయించాలని కోరామన్నారు. సంబంధిత విషయమై కేసీపీ యాజమాన్యంతో చర్చించి సొంత భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈఎస్‌ఐ పానల్ క్లినిక్‌ను సందర్శించిన ఆర్జేడీ
దాచేపల్లి: ఈఎస్‌ఐ ద్వారా కార్మికులకు కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నామని విజయవాడ ఆర్జేడీ డాక్టర్ జి.రవికుమార్ అన్నారు. నారాయణపురంలోని క్రాంతి నర్సింగ్ హోంలోని ఈఎస్‌ఐ పానల్ క్లినిక్‌లో అమలవుతున్న వైద్యసేవలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈఎస్‌ఐ పరిధిలో 1390 మంది కార్మికులు ఉన్నారని, రోజూ 15 నుంచి 20 మంది కార్మికులకు వైద్యం అందిస్తున్నామని డాక్టర్ క్రాంతికుమార్ వివరించారు. ఈఎస్‌ఐకి సంబంధించిన రికార్డులను పరిశీలించి ఆర్‌జేడీ సంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ రీజియన్ పరిధిలో 3.50 లక్షల మంది కార్మికులు ఈఎస్‌ఐలో సభ్యత్వం పొందారని, ఒక్కో కుటుంబంలో నలుగురు వంతున సుమారు 12 లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. రీజియన్ పరిధిలోని గుంటూ రు, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో రోజుకు 5 వేల మంది ఈఎస్‌ఐ ద్వారా వైద్యసేవలు పొందుతున్నారని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.
కార్మికులకు ఆధునిక వైద్యసేవలు
Published Sat, Mar 29 2014 3:07 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement