
భారత రక్షణ, నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ (Simpliforge Creations), ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా లేహ్‌లో సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో దేశ తొలి 3డీ ప్రింటెడ్ రక్షణాత్మక సైనిక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.
భారత సైన్యం తరపున ప్రాజెక్ట్ ప్రబల్‌లో(Project PRABAL) భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి అరుణ్ కృష్ణన్ దీనికి సహకారం అందించారు. అత్యంత ఎత్తైన ప్రదేశాలు, తక్కువ ఆక్సిజన్ (HALO) ఉన్న ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3డీ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది.
ఐఐటీ హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రమణ్యం మార్గదర్శకంలో.. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్, ఐఐటీ హైదరాబాద్ బృందాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యేక 3డీ ప్రింటింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా స్థానికంగా లభించే పరికరాలను ఉపయోగించి అనుకూలమైన రక్షణాత్మక బంకర్‌ను నిర్మించారు. ఈ నిర్మాణానికి 14 గంటల సమయం పట్టింది. ప్రబల్ కార్యక్రమం స్వదేశీ సాంకేతికత, విద్యా-పరిశ్రమ సహకారం ద్వారా నిర్మాణ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లింది.
ఈ 3డీ బంకర్ భారతదేశంలో తొలిసారి కాగా, సవాళ్లు ఎదురయ్యే ప్రాంతాల్లో వేగవంతమైన నిర్మాణాలకు మార్గం సుగమం చేసి, రక్షణ సన్నద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ అద్భుత ప్రాజెక్ట్.. ఇంజినీరింగ్ నూతనత్వం, సైనిక ఉపయోగం, మేక్-ఇన్-ఇండియా సంకల్పాన్ని కలగలిపి భవిష్యత్ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుంది.
ఈ సందర్భంగా సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సీఈఓ 'ధ్రువ్ గాంధీ' మాట్లాడుతూ.. "లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ విజయవంతం కావడం మా బృందానికి, యంత్రాలకు పెద్ద సవాలనే చెప్పలి. అయినా.. రోబోటిక్ ప్రింటర్ వ్యవస్థను 24 గంటల్లో సిద్ధం చేసి, 5 రోజుల రికార్డు సమయంలో అందించి విజయం సాధించాం" అని పేర్కొన్నారు.
ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి తీవ్రమైన పర్యావరణ పరిస్థితుల్లో పనిచేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాల అభివృద్ధి. ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్, తక్కువ ఆర్ద్రత, ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం నిర్మాణాత్మక వినూత్నత మాత్రమే కాకుండా, అత్యుత్తమ విజ్ఞానం అవసరమైంది. ఐఐటీ హైదరాబాద్ బృందం, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ కలిసి, మెరుగైన యంత్రాలను, మన్నిక కలిగిన కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసింది. అలా ఆ ప్రదేశంలోనే 3డీ ప్రింటింగ్ ద్వారా నిర్మించగలిగారు” అని వెల్లడించారు.
ఐఐటీ పీహెచ్‌డీ స్టూడెంట్ అరుణ్ కృష్ణన్ మాట్లాడుతూ.. "ఐఐటీ హైదరాబాద్‌లో నేను ఎంటెక్ చేస్తున్న సమయంలో ప్రబల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. లేహ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో 3డీ ప్రింటింగ్ నిర్మాణాన్ని తీసుకురావడానికి అనేక బృందాలు, కంపెనీలు ప్రయత్నించాయి. అయితే లడాఖ్‌లోని తీవ్ర వాతావరణ పరిస్థితులు వారికి పెను సవాలును విసిరాయి" అని తెలిపారు.
సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి మాట్లాడుతూ.. “2022 నుంచి మేము అడిటివ్ కన్‌స్ట్రక్షన్‌లో సవాళ్లను అధిగమించుకుంటూ వస్తున్నాం. భారతదేశపు తొలి 3డీ ముద్రిత వంతెనను, ప్రపంచంలోనే మొదటి 3డీ ముద్రిత ప్రార్థనా మందిరాన్ని మేమే నిర్మించాం. భారత సైన్యం కోసం, స్థానికంగా దొరికే పరికరాలను ఉపయోగించి, తొలిసారిగా ఒక 3డీ ముద్రిత వైద్య సదుపాయాన్ని, ఇన్-సిటు(in-situ) పద్ధతిలో నిర్మించాం" అని వివరించారు.