PhotoCredit:AFP
అంతర్జాతీయ అనిశ్చితులు, దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు ఇటీవలకాలంలో ఎక్కువ అవుతున్నాయి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దాంతో రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా దాడికి దిగవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఇరుదేశాలతో వాణిజ్య సంబంధాలున్న ఇండియన్ కంపెనీలు భారీగానే ప్రభావం చెందాయి. తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఆ దేశాలతో వాణిజ్యభాగస్వామ్యం ఉన్న మరిన్ని సంస్థలు ప్రభావితం చెందే పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎగుమతి-దిగుమతులు ఇలా..
భారత్ ఇరాన్‌ను ఎగుమతి చేస్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి రైస్, టీ ఉత్పత్తులు, షుగర్, పండ్లు, మందులు, ఫార్మసీ ఉత్పత్తులు, సాఫ్ట్‌డ్రింక్స్, పప్పులు, బోన్‌లెస్ మాంసం.. వంటివి ఉన్నాయి. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిలో స్పెషాలిటీ కెమికల్స్ తయారీకి అవసమయ్యే మిథనాల్, పెట్రోలియం బిట్యూమెన్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్, యాపిల్.. వంటివి ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం చెలరేగితే మాత్రం భారత్ నుంచి ఇరాన్‌కు ఎగుమతి చేసే వస్తువులపై ప్రభావం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆదేశం నుంచి ముడిసరుకులు దిగుమతులు చేసుకుంటున్న భారత కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం పడనుందని అంచనా వేస్తున్నారు.
ఫార్మా కంపెనీలపై ప్రభావం..
ప్రధానంగా ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలపై ఈ యుద్ధ ప్రభావం మరింత పడనుంది. ఇప్పటికే ఫార్మారంగంలోని స్టాక్స్‌లో పెద్దగా ర్యాలీ కనిపించడంలేదు. చాలా కంపెనీలు కొవిడ్ సమయంలో పోస్ట్ చేసిన లాభాలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేస్తున్న ఫలితాలు మదుపరులను నిరాశపరుస్తున్నాయి. దానికితోడు తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాల నేపథ్యంలో ఈ స్టాక్స్ మరింత ప్రభావానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇండియా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు 3.38 బిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసేది. దాన్ని క్రమంగా తగ్గించుకుంటూ 2022-23 ఏడాదికిగాను 1.66 బిలియన్ డాలర్లకు తీసుకొచ్చింది. అదే సమయంలో దిగుమతులు 2019-20లో 1.39 బిలియన్ డాలర్లుగా ఉండేవి. దాన్ని 2022-23 నాటికి 0.67 బిలియన్ డాలర్లకు తీసుకొచ్చింది.
తరలిపోనున్న ఐటీ కంపెనీలు..
ఇజ్రాయెల్‌కు ఏటా ఐటీ రంగం ద్వారా 14 శాతం ఆదాయం లభిస్తోంది. ఆ దేశ ఆర్థివ్యవస్థలో ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, విప్రో, టీసీఎస్ సహా 500కు పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మొత్తంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన పలు కీలక ప్రాజెక్ట్‌లను ఇజ్రాయెల్‌లోని ఐటీ సంస్థలు చేపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో కంపెనీ నిర్వహణ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఆయా కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్ట్‌లను భారత్ సహా యూరప్‌లోని దేశాలకు తరలించాలని నిర్ణయిస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి, సంస్థలకు భారం తప్పదా..!
ఆయుధ సంపత్తిలో సహకారం..
1962లో చైనాతో, 1965, 1971 సంవత్సరాల్లో పాకిస్థాన్‌తో యుద్ధ ఏర్పడినపుడు భారత్‌కు ఇజ్రాయెల్ కీలకమైన ఆయుధాలు సమకూర్చింది. ఇజ్రాయెల్ తయారుచేసే అత్యాధునిక తుపాకులు, డ్రోన్లు, క్షిపణులను ఎక్కువగా కొంటున్నది ఇండియానే. ఆ దేశ మొత్తం రక్షణ ఎగుమతుల్లో అధికభాగం భారత్‌కే చేరుతున్నాయి. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్వహణపరంగా అపారమైన అనుభవముంది. భారత్ వద్ద అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయి. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఈ సామర్థ్యాలన్నింటినీ జతచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఆ దిశగా భారత్, ఇజ్రాయెల్ రక్షణ సంస్థలు సంయుక్తంగా ఇండియాలో ఆయుధాలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment