ముడి నూనెల దిగుమతిపై సుంకం విధించిన కేంద్రం
రిఫైన్డ్ ఆయిల్స్‌పై 20 శాతం పెంపు
కొత్త స్టాక్ మీద ధరలు పెంచాల్సి ఉన్నా రిటైల్ మార్కెట్‌లో పెంచేసి విక్రయం
ప్యాకెట్‌పై రూ.10 నుంచి 16 పెంపు
కేంద్రం నిర్ణయంతో మన రైతులకు మేలు
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వంట నూనెలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం.
విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో వంట నూనెల ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘సోయా, నూనెగింజల రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు భారీగా ప్రయోజనం పొందుతారు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రపంచంలో వంట నూనెలను అత్య ధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది.
మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉంటోంది. పామాయిల్ వాటా 50 శాతంపైనే. ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్‌ఫ్లవర్ భారత్‌కు సరఫరా అవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఉన్న సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది.
రిటైల్ మార్కెట్‌లో పెంచేసి విక్రయం
విదేశాల నుంచి నూనెలు దిగుమతి అయిన తర్వాత రిఫైనరీలకు చేరుకుని అక్కడ శుద్ధి లేదా ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పెరిగిన పన్నుల ప్రకారం కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాల్సి ఉన్నా.. మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. రిటైల్‌లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం దాకా పెరిగాయి.
నిన్న మొన్నటి వరకు మార్కెట్‌లో లీటర్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లను రూ.108 వరకు విక్రయించగా, శనివారం ఒక్కసారిగా రూ.124 కి చేరింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై రూ.16 పెరిగింది. సూపర్‌మార్కెట్లు, దుకాణాల్లో పెరిగిన ధరలను చూసి వినియోగదారులు షాకయ్యారు. పామాయిల్ ధర మొన్నటి వరకు లీటర్‌కు రూ.95 ఉండగా, శనివారం మార్కెట్లో రూ.105కు అమ్మారు. అలాగే పల్లీ నూనె లీటర్‌కు రూ.155 ఉండగా, రూ.10 పెరిగి రూ.165కి చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లీ నూనెలు లీటర్‌కు రూ.106 ఉండగా, శనివారం రూ.116కు అమ్మారు.
Comments
Please login to add a commentAdd a comment