ముంబై: ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్.. యూఎస్ కంపెనీ టింకర్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. పిల్లలకు కోడింగ్ నైపుణ్యాలు అందించే ప్లాట్‌ఫామ్ టింకర్‌ను సొంతం చేసుకునేందుకు 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 740 కోట్లు) వెచ్చించవచ్చని అంచనా. గతేడాది(2020) ఆగస్ట్‌లోనూ కోడింగ్ కార్యకలాపాల సంస్థ.. వైట్‌హ్యాట్ జూనియర్‌ను 30 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.
ఈ బాటలో తాజాగా టింకర్ కొనుగోలుకి తెరతీసింది. తద్వారా కిండర్‌గార్టెన్(కేజీ) నుంచి 12వ తరగతి(గ్రేడ్)వరకూ బైజూస్ బిజినెస్ మరింత పటిష్టమయ్యేందుకు వీలుంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే బైజూస్ యూఎస్‌కు చెందిన రెండు కంపెనీలను సొంతం చేసుకుంది. వీటిలో గేమింగ్ స్టార్టప్ ఓస్మో, ఆన్‌లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్ ఉన్నాయి. కాగా.. త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్న బైజూస్ ఈ ఏడాది ఆరు కంపెనీలను హస్తగత చేసుకున్న విషయం విదితమే. ఇందుకు 200 కోట్ల డాలర్లు(సుమారు రూ. 14,800 కోట్లు) వెచ్చించింది.
కంపెనీ ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ 15 సంస్థలను కొనుగోలు చేసింది. ఇందుకు అనుగుణంగా 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు కంపెనీ సిద్ధపడుతోంది. తద్వారా బైజూస్ 21 బిలియన్ డాలర్ల విలువను అందుకోనున్నట్లు అంచనా. వెరసి ఇటీవల 16.5 బిలియన్ డాలర్ల విలువకు చేరిన పేటీమ్‌ను అధిగమిస్తూ దేశంలోనే అత్యంత విలువైన యూనికార్న్‌గా ఆవిర్భవించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment