వారికి యూఎస్ వీసా తిరస్కరణ
కాబూల్: అంతర్జాతీయ రొబోటిక్స్ పోటీలో పాల్గొనేందుకు ఆరుగురు ఔత్సాహిక అఫ్గానిస్తాన్ విద్యార్థినులకు వీసా ఇచ్చేందుకు అమెరికా తిరస్కరించింది. ఇలా ఒకసారి కాదు రెండుసార్లు నిరాకరించింది. 162 బృందాలు హాజరయ్యే ఈ పోటీలో అఫ్గాన్‌లు కూడా రోబోలను తయారు చేయగరలని ప్రపంచానికి చాటిచెప్పేందుకు అఫ్గానిస్తాన్ నుంచి ఒకే ఒక్క మహిళల టీమ్ పాల్గొనాలని భావించింది.
అమెరికాకు 800 కిలోమీటర్లు ప్రయాణం చేశాక మొదటిసారి తమ వీసాల దరఖాస్తులను అమెరికా తిరస్కరించిందని 14 సంవత్సరాల విద్యార్థిని సౌమ్యా ఫరూఖి తెలిపింది. కాబూల్‌లోని రాయబార కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోగా రెండోసారి కూడా తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై మాట్లాడేందుకు యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ నిరాకరించింది.
ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న ఆరు ముస్లిం దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్ లేనప్పటికీ వీరికి వీసా నిరాకరించడం గమనార్హం. గాంబియా విద్యార్థుల బృందానికి ముందుగా వీసా నిరాకరించారు. మలిదశలో వారికి వీసాలు మంజూరు చేశారు. అఫ్గానిస్తాన్ విద్యార్థినులకు అమెరికా వీసా నిరాకరించడం బాధాకరమని రోబో పోటీ నిర్వాహకులు వ్యాఖ్యనించారు.