
సాక్షి, ముంబై: హెచ్1బీ వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికాలో చదువుతున్నవిద్యార్థుల తల్లితండ్రులు ఇన్వెస్టర్ వీసాలుగా పేరొందిన ఈబీ-5 వీసాలపై ఆరా తీస్తున్నారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు హెచ్1బీ వీసా పొందడం సంక్లిష్టంగా మారడంతో ఇన్వెస్టర్ వీసాలపై సంపన్న కుటుంబాలు కన్నేశాయి. ఈబీ-5 వీసాలపై ఎంక్వయిరీలు పెరగడంతో ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గడువును అమెరికా సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 8 వరకు పొడిగించింది. ఈ ఏడాది ఇలా గడువు పొడిగించడం ఇది రెండవసారి కావడం గమనార్హం. మరోవైపు గత ఏడాది అమెరికాలో ఉద్యోగాలు పొందిన ఐఐటీ గ్రాడ్యుయేట్లు సైతం వర్క్ వీసా పొందేందుకు సమస్యలు ఎదుర్కోవడంతో ఆర్థిక స్తోమత కలిగిన తల్లితండ్రులు ఇన్వెస్టర్ వీసాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈబీ-5 వీసాను పొందిన విద్యార్థి హెచ్1బీ సంబంధిత ఆటంకాలు లేకుండా అమెరికాలో పనిచేసే వెసులుబాటు ఉంది. ఇక ఈ వీసాలకు గడువు పొడిగించడంతో ఇమిగ్రేషన్ సంబంధిత పెట్టుబడి వ్యవహారాల్లో ప్రత్యేకంగా సేవలందించే నిపుణులు, సంస్థల్లో ఈ వీసాల గురించి ఆశావహులు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.