యూఎస్ వీసా ఫీజుల పెంపుపై జైట్లీ కోపం!
వాషింగ్టన్: అమెరికా వీసా ఫీజులను భారీగా పెంచడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వివక్ష చూపడమేనని, భారతీయ ఐటీ నిపుణులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఆ దేశ వాణిజ్య ప్రాతినిధ్య రాయబారి మైఖేల్ ఫ్రోమన్‌తో సమావేశమై.. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వీసా ఫీజుల పెంపు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా అమెరికాలో పనిచేసే భారతీయులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన టోటలైజేషన్ ఒప్పందాన్ని త్వరగా పూర్తిచేయాల్సిన అవసరముందని తెలిపారు.
అమెరికా హెచ్ 1బీ, ఎల్1 వీసా ఫీజులను పెంచడంపై జైట్లీ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. 'వీసా ఫీజుల పెంపుపై భారత్ ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ పెంపు వివక్షపూరితం. భారతీయ ఐటీ కంపెనీలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది' అని ఆయన పేర్కొన్నారు. హెచ్ 1బీ, ఎల్ 1 వీసాలు భారతీయ ఐటీ కంపెనీల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే వీటిపై 2015లో అమెరికా చట్టసభ కాంగ్రెస్ 4,500 డాలర్ల ప్రత్యేక ఫీజు విధించింది. ఈ మొత్తాన్ని 9/11 హెల్త్‌కేర్ చట్టానికి కేటాయించనున్నట్టు తెలిపింది. ఈ ఫీజు నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తంచేస్తున్నది.