మోడీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు: అమెరికా
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కావాలనుకుంటే అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై ప్రస్తుతమున్న నియమ నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ 2005లో మోడీ వీసాను రద్దుచేసింది. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా ఇన్నాళ్లుగా పదే పదే చెబుతూ వస్తోంది. కానీ, ఇప్పుడు మాత్రం అమెరికా స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఇటీవలే అక్కడి అత్యంత ప్రభావవంతమైన 'టైమ్' పత్రిక తన సంపాదకీయంలో మోడీ ప్రధాని అయితే అప్పుడు కూడా వీసా నిరాకరించగలరా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచి అమెరికా స్వరంలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ఇలా చెప్పడం కూడా అందులో భాగమేనని భావిస్తున్నారు.