వాషింగ్టన్: గుజరాత్ అల్లర్లపై తమ దేశ విధానంలో ఏ మాత్రం రాలేదని అమెరికా అధికారి స్పష్టం చేశారు. దేశాల వారీ మానవ హక్కుల పద్ధతుల నివేదికలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరు తొలిగించినంత మాత్రాన తమ విధానాన్ని మార్చుకున్నట్లు కాదని ప్రభుత్వ అధికార ప్రతినిధి జెన్ పసాకి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అమెరికా మంత్రి జాన్ కెర్రీ తాజాగా విడుదల చేసిన మానవ హక్కుల నివేదికలో మోడీ పేరు లేకపోవడం పట్ల పసాకీని ప్రశ్నించగా.. పై విధంగా సమాధానమిచ్చారు. విధానంలో మార్పు ఏమీలేదని, నివేదిక తయారీలో కూడా తప్పులు ఏమీ దొర్లలేదని పసాకీ స్పష్టం చేశారు.
ఈ నివేదిక గతేడాది జనవరి, డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాల ఆధారంగానే రూపొందించిందని చెప్పారు. ఈ సమయంలో జరిగిన సంఘటనలకు పాత సంఘటనలతో అనుబంధం ఉంటే వాటిని నివేదికలో ఉటంకిస్తారని తెలిపారు. అయితే 2011, 12 నివేదికల్లో మోడీ పేరు ఉంది. 2002 గుజరాత్ అల్లర్ల దోషులను అరెస్ట్ చేయడంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో మోడీ సర్కార్ విఫలమైందంటూ పౌర సమాజం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మాత్రం ఆ నివేదిక పేర్కొంది.