Visa fraud
-
HYD: పాస్‌పోర్టు స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్‌పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్టు చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. నిందితులందరిని కస్టడీకి తీసుకొని విచారించనుంది. ఇప్పటికే 92 నకిలీ పాస్‌పోర్టులను సీఐడీ గుర్తించింది. అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్‌పోర్టులు రద్దు చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. పలువురు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది.. మిగతావారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. పాస్‌పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాస్‌పోర్టు జారీ, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు.. అధికారులకు లంచాలు ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది. -
యూఎస్ కాన్సులేట్ కేసులో క్లారిటీ!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో అమెరికా వీసా కోసం స్లాట్ బుక్ చేస్తున్న కొందరు తమ వెబ్‌సైట్‌ను యాక్సస్ చేస్తున్నట్లు అనుమానం ఉందంటూ యూఎస్ కాన్సులేట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలో బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదుతో దీన్ని నమోదు చేశారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు అప్పట్లో వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ ఆన్లైన్ దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించిన నేపథ్యంలోనే స్లాట్ దొరికిందంటూ చెప్పారు. దీని నిమిత్తం తాము వారికి రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున చెల్లించామని కాన్సులేట్ అధికారులతో పేర్కొన్నారు. దీంతో తమ అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సస్ చేస్తున్న కొందరు వీసా స్లాట్స్ బుక్ చేస్తున్నారని, ఆ దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమంటూ మైఖేల్ పీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. వీసా స్లాట్స్ బుకింగ్ వెనుక.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తేజ, కృష్ణ జిల్లావాసి ప్రభాకర్‌లు ఇలా దరఖాస్తులు నింపినట్లు గుర్తించారు. వీరిద్దరినీ ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీసా స్లాట్స్ బుకింగ్ వెనుక ఎలాంటి నేరం లేదని బయటపడింది. బీటెక్ పూర్తి చేసిన వీళ్లు గూగుల్ క్రోమ్‌లో అందుబాటులో ఉండే అలెర్ట్ వ్యవస్థను వాడుకున్నారు. వీసా స్లాట్స్‌ను విడుదల చేసిన యూఎస్ కాన్సులేట్ అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తుంది. దీన్ని క్రోమ్ ద్వారా గుర్తించే గూగుల్ వీరికి అలెర్ట్ ఇస్తోంది. ఆ సమయంలో తమ వద్ద ఉన్న దరఖాస్తుదారుల వివరాలతో ఆన్లైన్లో అప్లై చేస్తున్న వీరిద్దరూ స్లాట్స్ ఇప్పిస్తున్నారు. దీనికోసం కొంత రుసుము తీసుకుంటున్నారు. ఒక్కోసారి క్రోమ్ అలెర్ట్ కాని సందర్భాల్లో తాము రోజుకు 17 గంటలు కంప్యూటర్ ముందే, కాన్సలేట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని గడుపుతామని వెల్లడించారు. కాన్సులేట్ అధికారులను సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు పిలిపించిన దర్యాప్తు అధికారులు ఈ క్రోమ్ అలెర్ట్ విధానంపై వీరిద్దరితో డెమో ఇప్పించారు. నేరమా? కాదా? ఈ నేపథ్యంలోనే ఇందులో ఎక్కడా తమ వెబ్‌సైట్‌ను యాక్సస్ చేయడం లేదని కాన్సులేట్ అధికారులకు స్పష్టమైంది. అయితే స్లాట్స్ ఇప్పించి, దరఖాస్తు పూర్తి చేస్తున్నందుకు రుసుము వసూలు చేయడంపై మాత్రం కాన్సులేట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేని నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు తేజ, ప్రభాకర్లకు నోటీసులు ఇచ్చి పంపారు. ఈ కేసుపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి న్యాయ నిపుణుల అభిప్రాయానికి పంపాలని నిర్ణయించారు. వీరి నుంచి వచి్చన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. -
‘వీసా అప్లికేషన్ల’పై డబ్బుల వసూలు
సాక్షి, హైదరాబాద్: అన్లైన్లో అమెరికా వీసా కోసం దరఖాస్తు నింపుతున్న అనేకమంది డబ్బు వసూలు చేస్తున్నారంటూ అమెరికా కాన్సులేట్ అధికారులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు ఇటీవల వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వూ్యకు హాజరయ్యారు. దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించుకుని రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున చెల్లించామని చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్లో వీసా దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇది నేరమంటూ మైఖేల్ పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వారితో పూర్తి చేయించుకుని డబ్బు చెల్లించిన కొందరి ఫోన్ నంబర్లు జతచేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెపుతున్నారు. పాస్‌పోర్ట్ పొందడానికి, రెన్యువల్ చేసుకోవడానికి అనేక ఈ, మీ–సేవ కేంద్రాలు సైతం ఈ సేవల్ని అందిస్తున్నాయి. దరఖాస్తు నింపడం తెలియని, ఇబ్బందిగా భావించేవాళ్లు వీటిని ఆశ్రయించి స్లాట్లు బుక్ చేసుకుంటారు. దీని కోసం నిర్ణీత మొత్తాలను చెల్లిస్తారు. ఇది నేరం కానప్పుడు యూఎస్ వీసాకు ఆన్లైన్లో దరఖాస్తును వేరే వ్యక్తుల ద్వారా పూర్తి చేయించడం ఎలా తప్పవుతుందని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా విద్యార్థులతో మాట్లాడాలని నిర్ణయించారు. తామే ఇతరులను ఆశ్రయించి దరఖాస్తును ఇష్టపూర్వకంగా పూర్తిచేయించుకున్నామని చెప్తే కేసు నిలబడదని అధికారులు చెపుతున్నారు. -
అమెరికాలో వీసా మోసం..
వాషింగ్టన్: అమెరికా అధికారులు వీసా మోసానికి సంబంధించి 90 మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. తాజా అరెస్టులతో, మిషిగాన్ రాష్ట్రం డెట్రాయిట్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే నకిలీ వర్సిటీకి చెందిన 250 విద్యార్థులను అరెస్టు చేసినట్లయింది. ఈ ఏడాది మార్చిలో అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్(యూఎస్ఐసీఈ)అధికారులు ఈ వర్సిటీకి చెందిన 161 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ సమయంలో వర్సిటీలో 600 మంది, అందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. కాగా, అరెస్టయిన 250 మందిలో 80 శాతం మంది ఇప్పటికే అమెరికా విడిచి వెళ్లిపోయారని యూఎస్ఐసీఈ అధికారులు తెలిపారు. మరో 10 శాతం మందిని పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఫార్మింగ్టన్ వర్సిటీ ఫేక్ అని విద్యార్థులకు ముందుగానే తెలుసునని, అక్కడ ఎలాంటి క్లాసులు జరగడంలేదని అధికారులు వాదిస్తున్నారు. ఆ వర్సిటీలో విద్యార్థులను చేర్పించిన 8 మందిపై వీసా మోసం తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై టెక్సాస్ అటార్నీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టబద్ధంగా అమెరికా వలస రావాలనుకున్న వారు కూడా అనుకోకుండా కుట్రదారులకు చిక్కారని అన్నారు. ఈయన బాధిత విద్యార్థుల పక్షాన పోరాడుతున్నారు. -
మోసాలకుఅడ్డుకట్ట వేయలేమా..
మోర్తాడ్: మోసపోయేవారు ఉన్నంత కాలం.. మోసగించేవారు ఉంటారు అనే నానుడికి గల్ఫ్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు ఎక్కడో ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. ఇటీవల పలు ఘటనలు వెలుగుచూశాయి. షార్జాలోని బల్దియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా యని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి దాదాపు 300 మంది నిరుద్యోగులను నమ్మించి రూ.5 కోట్లతో ఉడాయించిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన ఆ యువకుడు నకిలీ వీసాలను నిరుద్యోగులకు అంటగట్టాడు. ఆ వీసాలతో కార్మికులు షార్జాకు వెళ్లే ప్రయత్నంలో ఎయిర్‌పోర్టులో అధికారులు గుర్తించి తిప్పిపంచారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి వీసాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి రూ.3 కోట్లు వసూలు చేసిన ఓ ఏజెంటు బాగోతాన్ని వరంగల్ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఇవే కాకుండా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం అనధికారికంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కొందరిని నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిరుద్యోగుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న మోసగాళ్లు అమాయకులను వంచనకు గురిచేస్తున్నారు. ఇదిలావుండగా.. కొందరు లైసెన్స్డ్ ఏజెంట్లు గల్ఫ్ దేశాలకు మొదట విజిట్ వీసాలపై మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిట్ వీసాలపై వెళ్లి గల్ఫ్ దేశాల్లో పనులుచేస్తే ఎన్నో విధాలుగా నష్టపోతారు. నిరుద్యోగులకు అవగాహన లేకపోవడంతో విజిట్ వీసాలపైనే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఎస్ఓపీపై పోలీసులకు అవగాహన.. విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అండగా విదేశాంగ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ని రూపొందించింది. ఈ ఎస్ఓపీపై రాష్ట్ర పోలీసులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను మోసం చేసిన ఏజెంట్లపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో బాధితులకు ప్రయోజనం కలుగడం లేదు. వీసా మోసాలపై కఠినంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగడంతో పాటు మోసాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీసా మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం.. విదేశాలకు వెళ్లాలనుకునే వారు వీసాలను పొందే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మా టామ్‌కామ్ సంస్థ ఆధ్వర్యంలో, ఉపాధి కల్పన శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వీసాలు పొందిన తరువాత అవి నకిలీవా లేక సరైనవా అని నిర్ధారించుకోవడానికి వలసదారులకు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లలో పరిశీలించి వీసాలను నిర్ధారించుకోవాలి. వలసదారులు రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వీసాల కోసం ప్రయత్నం చేయాలి. లైసెన్స్ లేని ఏజెంట్లను వీసాల కోసం సంప్రదించవద్దు. జాగ్రత్తగా వ్యవహరిస్తే మోసపోకుండా ఉంటారు. వలస వెళ్లాలనుకునేవారికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అండగా ఉంటుంది. సాధారణ కేసుల నమోదుతో ప్రయోజనం లేదు వీసా మోసాలపై పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తే ప్రయోజనం లేదు. వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం వల్ల ఏజెంట్లు సులభంగా తప్పించుకుంటున్నారు. ఎమిగ్రేషన్ యాక్ట్ 1983తో పాటు ఐపీసీ 370 (మానవ అక్రమ రవాణా) కింద కేసులు పెట్టాలి. నకిలీ ఏజెంట్లు, మోసగించిన ఏజెంట్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. మోసాలను అరికట్టడానికి అవకాశం కలుగుతుంది. వీసా రాకెట్లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న చైన్ మొత్తాన్ని కేసు పరిధిలోకి తీసుకురావాలి. వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం.. విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. అనేక మంది కార్మికులు ఎలాంటి శిక్షణ లేకుండానే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్నారు. అక్కడ పనిపై అవగాహన లేకపోవడంతో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఏజెంట్లు ఫలానా పని అని చెబితే ఆ పనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణ పొంది విదేశాలకు వెళ్తే ఎలాంటి నష్టమూ ఉండదు. కార్మికులు కచ్చితంగా తాము ఉపాధి పొందే రంగంలో శిక్షణ పొంది ఉండాలి. అవగాహన కల్పించాలి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న చాలామంది యువత అవగాహన లోపంతోనే మోసపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్కామ్పైనా అవగాహన లేకపోవడంతో ప్రైవేటు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. చదువుకున్న యువత కూడా ముందువెనకా ఆలోచించకుండా వెళ్లి బలవుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా వెళ్తే బాగుంటుందనేది తెలుసుకోవాలి. -
జయేష్.. అందుకే కొత్త గెటప్
న్యూఢిల్లీ: జయేష్ పటేల్(32) అనే యువకుడు ఓ వృద్ధుడి వేషంలో అమెరికాకు వెళుతూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టవడం తెల్సిందే. పోలీసు విచారణలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అతడు అమెరికాలో ఉద్యోగం పొందేందుకు జయేష్ పలుమార్లు ప్రయత్నించినా వీసా దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న భరత్ అనే యువకుడు రూ.30 లక్షలు ఖర్చుపెడితే అమెరికాకు వెళ్లొచ్చని చెప్పాడు. ఇందుకు జయేష్ అంగీకరించడంతో కొందరు ఏజెంట్లు అతడిని పటేల్ నగర్‌లోని ఓ సెలూన్‌కు తీసుకెళ్లారు. దాని యజమాని షంషేర్ తన మేకప్ మాయాజాలం ప్రదర్శించి 32 ఏళ్ల జయేష్‌ను 81 సంవత్సరాల వృద్ధుడిగా మార్చేశాడు. తలకు పాగాతో పాటు పాత కళ్లద్దాలను అమర్చాడు. మరోవైపు ఏజెంట్లు అర్మిక్ సింగ్ పేరుతో జయేష్‌కు నకిలీ పాస్‌పోర్టును అందజేశారు. ఈ వేషంలో తొలుత చెకింగ్‌ను సులభంగా దాటేసిన జయేష్, తన స్వరం వయసుకు తగ్గట్లు లేకపోవడం, ఒంటిపై ముడతలుండకపోవడంతో... సీఐఎస్ఎఫ్ అధికారుల కళ్లలోకి సూటిగా చూడకుండా మాట్లాడటంతో దొరికిపోయాడు. షంషేర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. (చదవండి: నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట!) -
వీసా మోసంపై బ్రిటన్ హోంమంత్రికి లేఖ
లండన్: బ్రిటన్‌లో విద్యార్థి వీసాలు పొందేందుకు రాసే టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్(టీవోఈఐసీ)లో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయులు గురువారం హోంమంత్రి సాజిద్ జావిద్‌కు లేఖ రాశారు. 2014లో జరిగిన టీవోఈఐసీ పరీక్షల్లో మోసానికి పాల్పడినట్లు తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వేలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను బ్రిటన్ హోంశాఖ అన్యాయంగా లాక్కుంది. ఈ జాబితా నుంచి మా పేర్లను తప్పించేందుకు ఐదేళ్లుగా పోరాడుతున్నాం. బ్రిటన్ హోంశాఖ మా భవిష్యత్‌ను నాశనం చేసింది. మేం మోసానికి పాల్పడ్డట్లు ఇప్పటివరకూ కనీసం ఒక్క సాక్ష్యాన్ని చూపలేకపోయింది. మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని హోంమంత్రి సాజిద్ జావిద్‌ను కోరుతున్నాం’ అని తెలిపారు. -
గడువుకు ముందే.. ఇంటికి!
ఎన్నో ఆశలతో సౌదీలో అడుగుపెట్టిన మన కార్మికులు వారి కలలు నెరవేరక ముందే అక్కడి బల్దియా అధికారుల తీరుతో ఇంటిదారి పడుతున్నారు. సౌదీ అరేబియాలోని బల్దియా (మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ)ల్లో ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్న భారతీయ కార్మికులను అక్కడి అధికారులు పనుల నుంచి అకారణంగా తొలగిస్తున్నారు. సౌదీలో పనిచేస్తున్న మన దేశ కార్మికులకు నెలకు కనీసం 1,500 రియాళ్ల వేతనం చెల్లించాలని మన కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. అయితే షరతు ప్రకారం అంత మొత్తంలో వేతనం చెల్లించలేమని బల్దియా అధికారులు చెప్పకుండా.. కార్మికులను పనుల నుంచి తొలగిస్తూ ఇంటిబాట పట్టిస్తున్నారు. కార్మికులకు వీసా, వర్క్ పర్మిట్‌కు గడువు ఉన్నా ముందుగానే స్వదేశానికి పంపిస్తున్నారు. బల్దియాల్లో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 150 మంది కార్మికులు వీసా, వర్క్ పర్మిట్ గడువు ముగిసిపోక ముందుగానే ఇళ్లకు చేరుకున్నారు. మరికొంతమంది కార్మికులను ఇంటికి పంపించడానికి సౌదీ బల్దియా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారంఅందుతోంది. కార్మికుల సంక్షేమం కోసంవేతన ఒప్పందం గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న మన దేశ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని విదేశాంగ శాఖ షరతు విధించింది. సౌదీలో ఏ కంపెనీలోనైనా, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే కార్మికులకు నెలకు కనీసం 1,500 రియాళ్ల వేతనం మన కరెన్సీలో (రూ.25వేలు) చెల్లించాలని విదేశాంగ శాఖ షరతు విధించగా ఇందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. విదేశాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతన విధానం అమలు జరిగితే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని మన కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఒప్పందంలో భాగంగా గడిచిన జనవరి నుంచి ఈ విధానం అమలు కావాల్సి ఉంది. ముఖ్యంగా సౌదీ ప్రభుత్వరంగ సంస్థల్లోనే కనీస వేతన విధానం మొదట అమలు చేయాల్సి ఉంది. అయితే, భారత ప్రభుత్వం విధించిన షరతు ప్రకారం వేతనం చెల్లిస్తే తమపై ఆర్థిక భారం పడుతుందని భావించిన బల్దియా అధికారులు మన కార్మికులను ముందస్తుగానే పనుల నుంచి తొలగిస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్కార్మికులకు అవకాశం! మన దేశానికి చెందిన కార్మికులకు నెలకు 1,500 రియాళ్ల వేతనం చెల్లించడం కంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన కార్మికులకు తక్కువ వేతనం చెల్లించవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. మన కార్మికులను పనుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతర దేశాల కార్మికులను నియమించుకుంటున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కార్మికులు 700 రియాళ్ల నుంచి 800 రియాళ్ల వేతనానికి పనిచేయడానికి ముందుకు వస్తుండటంతో మన కార్మికులకు నష్టం కలుగుతోంది. విదేశాంగ శాఖ స్పందిస్తేనే మన కార్మికులకు ప్రయోజనం మన కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని షరతు విధించిన విదేశాంగ శాఖ ఇప్పుడు కార్మికుల తొలగింపుపై స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బల్దియాలో పని చేస్తున్న కార్మికుల వీసా, వర్క్ పర్మిట్‌కు గడువు ముగిసిపోకున్నా ఎగ్జిట్ వీసా ఇచ్చి ఇంటికి పంపిస్తున్న ఆంశంపై కొందరు కార్మికులు రియాద్‌లోని మన విదేశాంగ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కానీ, అక్కడ అధికారులు పట్టించుకోలేదని పలువురు కార్మికులు ఆరోపించారు. విదేశాంగ శాఖ అధికారులే పట్టించుకోక పోవడంతో నిరాశతో ఇంటికి చేరుకున్నామని పలువురు కార్మికులు తెలిపారు. మానసికంగా కృంగిపోతున్న కార్మికులు సౌదీ బల్దియాలో పని కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి వీసాలు పొందితే అక్కడి అధికారుల నిర్ణయంతో ఇంటిదారి పట్టడం వల్ల కార్మికులు ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు. సౌదీ వెళ్లడానికి చేసిన అప్పులు తీరక ముందే ఇంటికి చేరుకోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఇంటికి చేరుకున్న కార్మికులు మానసికంగా కృంగిపోతున్నారు. సౌదీ నుంచి ఇంటికి చేరుకున్న కార్మికులకు పునరావాసం కల్పించాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ వారే ఎక్కువ... సౌదీ అరేబియా బల్దియాల్లో పనిచేసే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు. రోడ్ల పక్కన చెత్తా చెదారం ఎత్తిపోయడం, పార్కుల్లో మొక్కలకు నీరు పట్టడం తదితర పనులు చేస్తుంటారు. నిర్మాణ రంగంలో కంటే బల్దియాలో పనులు తేలికగా ఉంటుండటంతో కార్మికులు అందులో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో కార్మికుడు దాదాపు రూ.1.50లక్షల వరకు ఏజెంట్లకు చెల్లించి వీసాలు పొందుతున్నారు. వీరికి గతంలో నెలకు మన కరెన్సీలో రూ.18వేల వరకు వేతనం చెల్లించేవారు. ఈ వేతనం సరిపోదనే ఉద్దేశంతో కనీస వేతన విధానం అమలు చేయాలని విదేశాంగ శాఖ సౌదీ అరేబియా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. మొదట్లో అక్కడి ప్రభుత్వంఅంగీకరించినా ఇప్పుడు మాత్రం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జూలై వరకు వీసా ఉంది నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం, తాళ్లరాంపూర్‌కు చెందిన గుండ సురేష్‌కు సౌదీ బల్దియాలో పనిచేయడానికి జూలై వరకు వీసా, వర్క్ పర్మిట్ ఉంది. మూడేళ్ల కింద బల్దియాలో చేరగా అతనికి జూలై తరువాత వీసాను రెన్యూవల్ చేయాల్సి ఉంది. కానీ, సురేష్‌కు ఎక్కువ వేతనం చెల్లించడం ఇష్టంలేక బల్దియా అధికారులు ఎగ్జిట్ వీసా ఇచ్చి జనవరిలోనే ఇంటికి పంపించారు. తాను ఇంకా పని చేస్తానని చెప్పినా బల్దియా అధికారులు పట్టించుకోలేదు. విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనమూ లేక పోయింది. మరో ఏడాది వరకు అవకాశం ఉన్నా.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందికి చెందిన దర్శన్ రెండున్నర సంవత్సరాల కింద సౌదీ బల్దియాలో పని చేయడానికి వీసా పొందాడు. ఆరు నెలల కిందనే సెలవుపై ఇంటికి వచ్చి మళ్లి సౌదీకి వెళ్లాడు. ఇప్పుడిప్పుడే అప్పులు తీరుతున్నాయని ఎంతో కొంత సంపాదించి దాచుకోవచ్చని భావించిన దర్శన్‌కు బల్దియా అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేసింది. మరో ఏడాది పాటు బల్దియాలో పనిచేయడానికి దర్శన్‌కు అవకాశం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోవడం లేదని దర్శన్ చెబుతున్నాడు. ప్రభుత్వం మాకుఉపాధి చూపాలి సౌదీ బల్దియాలో పనిచేయడానికి నాకు మరో ఆరు నెలల అవకాశం ఉంది. కానీ, అక్కడి అధికారులు ఎగ్జిట్ వీసా ఇచ్చి ఇంటికి పంపించారు. నాతో పాటు ఎంతో మంది ఇంటికి చేరారు. ప్రభుత్వం స్పందించి మాకు ఉపాధి చూపాలి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.– రాంపల్లి జనార్దన్, తాళ్లరాంపూర్ -
షాకింగ్.. అన్నాచెల్లెల పెళ్లి!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పచుకునేందుకు అన్నాచెల్లెలు ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్యాభర్తలుగా చెలామణి అవుతున్న వీరి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇదంతా చేశారని వీరి బంధువు ఒకామె పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడిందని ఆస్ట్రేలియా వార్తా సంస్థ ఎస్బీఎస్ డాట్‌కామ్ వెల్లడించింది. ఫిర్యాదు ఆధారంగా బథిండా జిల్లాలోని బాలియన్‌వాలా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరితో పాటు వారి ఆరుగురు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ పేర్కొన్నట్టు బాలియన్‌వాలా ఎస్ఐ జైసింగ్ తెలిపారు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఉంటున్న నిందితుడు తన సోదరిని కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు ఈ నాటకం ఆడాడు. ముందుగా తన సమీప బంధువు పేరుతో నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటితో గరుద్వారా నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకుని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారని జైసింగ్ వివరించారు. 2012లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉన్నారని, తాము దర్యాప్తు పూర్తి చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ కేసు తమను షాక్‌కు గురి చేసిందని పోలీసులు తెలిపారు. వీసా కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతుండడం తాము చూశామని, అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్నట్టుగా నటించడం ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యపోయారు. నకిలీ పెళ్లి పత్రాలతో తమ దేశానికి రావాలని చూస్తే కఠిన దండన తప్పదని భారతీయులకు గతేడాది ఆస్త్రేలియా హెచ్చరిక జారీ చేసింది. 32 ఏళ్ల భారతీయుడొకరు నిరుడు నవంబర్‌లో నకిలీ వివాహ పత్రాలతో దొరికిపోవడంతో ఈమేరకు వార్నింగ్ ఇచ్చింది. ఫోర్జరీ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో 164 మందికి భాగస్వామ్య వీసాలు నిరాకరించినట్టు ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తెలిపింది. -
హెచ్1 బీ ఫ్రాడ్ : ఇండియన్ సీఈవో అరెస్టు
న్యూయార్క్: హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల దరఖాస్తుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఒక ఇండియన్ సీఈవోకు అమెరికా ప్రభుత్వం చెక్ చెప్పింది. తప్పుడు, మోసపూరిత పత్రాలతో దాదాపు 200 హెచ్1 బీ వీసాలను పొందిన కేసులో అమెరికాలో అజీమెట్రీ, డివెన్సి అనే రెండు ఐటీ కంపెనీలకు సీఈవో ప్రద్యుమ్న కుమార్ సామల్ (49) ను అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ, మోసపూరితమైన డాక్యుమెంట్లతో 200మంది విదేశీయులకు హెచ్1 బీ వీసాలు సాధించారనే ఆరోపణలతో కమార్‌ను అరెస్ట్ చేశారు. ఇండియానుంచి తిరిగి అమెరికా వస్తుండగా సియాటెల్ విమానాశ్రయం వద్ద ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. 2018, ఏప్రిలో నమోదైన వీసా ఫ్రాడ్ కేసు విచారణ జరుగుతుండగా నిందితుడు సామల్ పారిపోయాడని అధికారులు తెలిపారు. 2010, 2011 సంవత్సరాల్లో వాషింగ్టన్ లో హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల పేరుతో భారీ మోసాలకి పాల్పడాడనీ, బెంచ్-అండ్-స్విచ్ స్కీం కింద వీసా దరఖాస్తుల కోసం కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించి, తద్వారా ప్రభుత్వాన్ని మోసగించాడని అధికారులు ఆరోపించారు. కాగా వీసా మోసం కేసులో పది సంవత్సరాల జైలుతో పాటు, 250,000 డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది. -
వీసా మోసాలపై ఉక్కుపాదం: కేటీఆర్
• అక్రమ ఏజెంట్లను ఏరేస్తామన్న మంత్రి • నూతన పాలసీపై ఎన్నారైలతో సమాలోచన సాక్షి, హైదరాబాద్ : వీసా మోసాలకు పాల్పడుతున్న అక్రమ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. గ్రామాల్లో ఉన్న అక్రమ ఏజెంట్లను పోలీసుల సహాయంతో ఏరివేస్తామన్నారు. త్వరలో ‘ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్’తో సమావేశమై అక్రమ ఏజెంట్లపై చర్యల కోసం నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. తెలంగాణ ఎన్నారై పాలసీ రూపకల్పనలో భాగంగా బుధవారం ఇక్కడ ఎన్నారైలు, ఎన్నారై సంస్థలు, సంఘాలతో మంత్రి సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరించారు. నైపుణ్యం లేని బ్లూకాలర్ ఎన్నారైల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలంటూ విజ్ఞప్తులు వచ్చాయన్నారు. వివిధ అంశాలపై వచ్చిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని దేశంలోనే ఉత్తమ ఎన్నారై పాలసీని తీసుకొస్తామన్నారు. విదేశాలకు వలస వెళ్లడానికి ముందు ఆయా దేశాల్లో ఆచరించాల్సిన పద్ధతులు, అక్కడి చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. విదేశాలకు వలస వెళ్లినవారి సమగ్ర సమాచారనిధిని రూపొందించడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రవాసి దివస్‌ను నిర్వహించి విదేశాల్లో రాణిస్తున్న ప్రవాసీయులు, ఉత్తమ కార్మికులు, ఏజెంట్లకు పురస్కారాలు అందిస్తామని చెప్పారు. ప్రవాసీయుల కోసం ఐటీ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషాల్లో వెబ్ పోర్టల్‌ను తీసుకొస్తామని, తెలుగు కార్మికుల కోసం గల్ఫ్ దేశాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, తొలుత దుబాయ్ నుంచి శ్రీకారం చుడతామన్నారు. ప్రవాసీయుల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అనుసంధానం చేస్తామని, దీనిపై శనివారం కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌తో ఢిల్లీలో సమావేశం అవుతానన్నారు. నువ్వెందుకు ఉన్నావు: అధికారిపై మంత్రి ఆగ్రహం రాష్ట్రంలో వీసా మోసాలకు పాల్పడుతున్న అక్రమ ఏజెంట్ల సమాచారాన్ని ఇతరులు అందజేసినా చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వెందుకు ఉన్నావ్.. ఇంత కాలం ఏం చేస్తున్నావ్.. నువ్వు వలసదారుల రక్షకుడివి కాదా? అక్రమ ఏజెంట్లను అరికట్టడం నీ బాధ్యత కాదా?’ అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అక్రమ ఏజెంట్ల వివరాలను ఏటా ప్రభుత్వానికి అందజేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని పలువురు గుర్తింపు పొందిన ఏజెంట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
వీసాల మోసగాళ్లపై హెచ్చార్సీకి ఫిర్యాదు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ హెచ్చార్సీ గడపతొక్కింది. సైనిక్‌పురికి చెందిన తాటిపత్రి డానియల్, షీబారాణి దంపతులు విదేశాల్లో ఉద్యోగం చూపుతామంటూ తన వద్ద రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఇర్ఫానా సుబానీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. గతంలో వీరిపై సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్స్టేషన్లలో కూడా ఇదే విషయంలో కేసులున్నాయని ఆమె బుధవారం అందజేసిన ఫిర్యాదులో వివరించింది. -
వీసా కోసం నకిలీ పెళ్లిళ్లు
వాషింగ్టన్: వీసా కోసం భారతీయులు, భారత సంతతికి చెందిన అమెరికన్లను నకిలీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అధికారులు ఆరోపించారు. వీసా లభించని వాళ్లు అమెరికన్లను మోసగించి వివాహమాడుతున్నారని, ఆ తర్వాత యూ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారని వెల్లడించారు. సాధారణంగా యూవీసాను మానసిక, శారీరక సమస్యలు ఉన్నవారికి ఇస్తారు. యూ-వీసాతో ఇక్కడ ఎక్కువ కాలం ఉండేందుకు అమెరికా అనుమతినిస్తుంది. అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇటీవల సిమ్సన్ గుడ్మన్ అనే న్యాయవాది నకిలీ పత్రాలను సమర్పించారని అధికారుల బృందం ఆరోపించింది. అమెరికా కేంద్ర సమాచార శాఖకు సమర్పించిన ఈ నకిలీ పత్రాలను ఐవరీ హారిస్ కు చెందిన జాక్సన్ అనే వ్యక్తి తయారుచేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇండియన్ స్టూడెంట్స్పై చర్యలు
వాషింగ్టన్: అనుకున్నది జరగబోతోంది. స్టూడెంట్ వీసాలపై వచ్చి అమెరికాలోనే స్థిరపడిపోవాలనే ఉద్దేశంతో ఒక అక్రమ సంస్థతో చేతులు కలిపిన భారతీయ విద్యార్థులపై తాము చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధికారులు చెప్పారు. 306మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్రమాలకు పాల్పడ్డారని, వీరిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. కొందరు బ్రోకర్లు, అమెరికాకు చెందిన హోమ్ లాండ్ సెక్యూరిటీ సంస్థలోని ఇంకొందరు వ్యక్తులు కుమ్మక్కై 2013లో క్రాన్ఫోర్డ్లో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే పేరుతో బోగస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానికంగా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ దీనికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. కానీ, ఇది పైకి యూనివర్సిటీ భవనంలాగే కనిపించినా అక్కడ పాఠాలు లేవు.. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. కేవలం హెచ్ 1 వీసాకు నిరాకరించబడిన వారిని చేర్చుకొని భారీ మొత్తంలో డబ్బులు దండుకునేందుకు స్థాపించబడిందే ఈ బోగస్ వర్సిటీ. ఈ విషయం ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా తెలిసింది. సాధారణంగా అమెరికా విద్యకోసం వెళ్లిన వారికి తొలి ఏడాదిన్నరలో కర్రిక్యులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్(సీపీటీ) ప్రోగ్రాం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనే మరో కార్యక్రమం ఉంటుంది. ఇవి పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు హెచ్ 1 వీసాకోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే, ఏకారణం రీత్యానైనా వారికి హెచ్ 1 వీసా లభించని పక్షంలో ఆ విద్యార్థులు ఆ దేశం విడిచి తమ స్వదేశాలకు రావాల్సి ఉంటుంది. అయితే, అలా రాకుండా ఉండేందుకు మరో యూనివర్సిటీలో ప్రవేశం పొంది.. తిరిగి సీపీటీ, ఓపీటీలు పూర్తి చేసి హెచ్ 1 వీసాకోసం ప్రయత్నిస్తారు. వాస్తవానికి ఒకసారి హెచ్ 1వీసాకు నిరాకరించబడిన విద్యార్థులను ఏ యూనివర్సిటీలు రెండోసారి చేర్చుకోవు. అలా చేయడం నేరం కూడా. కానీ, యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ మాత్రం భారతీయ విద్యార్థులను డబ్బులకోసం బుట్టలో వేసుకొని ప్రవేశాలు ఇచ్చింది. ఇందులో వెయ్యిమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉండగా వారిలో 306మందికి ముందే ఈ వర్సిటీ బాగోతం తెలుసు. అంటే ఉద్దేశ పూర్వకంగా అమెరికాలో ఉండిపోయేందుకు అక్రమ వర్సిటీతో వారు చేతులు కలిపారన్నమాట. ప్రస్తుతం ఆ విద్యార్థులపైనే చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు అంటున్నారు. అయితే, వాస్తవానికి ఆ వర్సిటీ గురించి తెలియని విద్యార్థులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా టోనర్ చెప్పారు. ఒక అక్రమ సంస్థ ద్వారా ప్రవేశాలు పొంది శాశ్వతంగా ఉండిపోవాలని ప్రణాళిక రచించడం తప్పేనని చెప్పారు. -
ఇండియన్ స్టూడెంట్స్‌కు న్యూజెర్సీ గండం
న్యూయార్క్: అమెరికాలో కొందరు భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ 1 వీసాకోసం వారు అనుసరించిన మార్గాలు వారిని చిక్కుల్లో పడేసేలా ఉంది. ఓ బోగస్ కాలేజీ తయారై వారికి ఆశలు రేకెత్తించి చివరకు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితిని కల్పించింది. అది ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు. అమెరికాలోని క్రాన్ఫోర్డ్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే పేరుతో విశ్వవిద్యాలయాన్ని 2013లో స్థాపించారు. ఉన్నత విద్యలో భాగంగా ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ కింద అకౌంటింగ్, మార్కెటింగ్, హెల్త్ కేర్ వంటి కోర్సులను అందిస్తామని ప్రకటించింది. స్థానికంగా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ దీనికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. అదిగో అలా గుర్తింపు వచ్చినప్పటి నుంచి మొదలైంది అసలు దందా. ఎందుకంటే అది పైకి చూడ్డానికే ఓ యూనివర్సిటీ కానీ, అక్కడ పాఠాలు లేవు.. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. కేవలం హెచ్ 1 వీసాకు నిరాకరించబడిన వారిని చేర్చుకొని భారీ మొత్తంలో డబ్బులు దండుకునేందుకు స్థాపించబడిందే ఈ బోగస్ వర్సిటీ. సాధారణంగా అమెరికా విద్యకోసం వెళ్లిన వారికి తొలి ఏడాదిన్నరలో కర్రిక్యులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్(సీపీటీ) ప్రోగ్రాం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనే మరో కార్యక్రమం ఉంటుంది. దీనిని సాధరణంగా కొన్నిగంటలపాటు పనిచేసుకుంటూ మరి కొన్ని గంటలు కాలేజీకి వెళ్లి చదువుకుంటూ ఏవో చిన్నచిన్న సంస్థల్లో పనిచేసుకుంటూ ఉంటారు. ఇవి పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు హెచ్ 1 వీసాకోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే, ఏకారణం రీత్యానైనా వారికి హెచ్ 1 వీసా లభించని పక్షంలో ఆ విద్యార్థులకు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. పైగా ఒక్కసారి హెచ్ 1వీసా నిరాకరించబడి ఇంటికొస్తే అలాంటి విద్యార్థికి తిరిగి అమెరికాలో విద్యకోసం అడుగుపెట్టే అవకాశం ఉండదు. అయితే, అలా వీసాకు నిరాకరించబడిన వాళ్లంతా తిరిగి వేరే కళాశాలల్లో ప్రవేశం పొంది పైన పేర్కొన్న సీపీటీ, ఓపీటీ చేసుకుంటూ తిరిగి హెచ్ 1 వీసాకోసం ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించేవారిని అందుకునేందుకు అక్కడ ఉన్న కొందరు దళారీలు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్‌తో చేతులు కలిపి చేసిన సృష్టే యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ. ఈ వర్సిటీని స్థాపించి హెచ్ 1 వీసా పొందడంలో విఫలమైనవారందరిని ఇబ్బడిముబ్బడిగా సీట్లు ఇస్తూ ఒక వసతి గృహంలాగా తయారై విద్యార్థులకు చిన్నచిన్న సంస్థల్లో సీపీటీ, ఓపీటీ, హెచ్ 1 వీసాకోసం ప్రయత్నించడానికి అక్రమంగా సహకరించింది. ఇలా ఈ వర్సిటీలో చేరినవాళ్లలో భారతీయులు, చైనీయులే అధికం. వీరంతా దాదాపు వెయ్యిమందికి పైగే ఉన్నారు. ఇందులో వాస్తవానికి చదువుకుందామని చేరినవారు కొందరైతే దీని బాగోతం ముందే తెలిసి ఏదో షెల్టర్ దొరికితే చాలు హెచ్ 1వీసాకోసం ప్రయత్నించవచ్చు అని చేరిన విద్యార్థులు కొందరు. వాస్తవానికి ఇలాంటి చర్యలకు ఓ వర్సిటీ పాల్పడటం చట్టప్రకారం నేరం. హెచ్ 1 వీసాల విషయంలో ఇటీవల కాలంలో సీరియస్ గా స్పందిస్తున్న అమెరికా ఉన్నతాధికారులు వర్సిటీల తీరుపై దృష్టిసారించారు. అందులో భాగంగానే యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా దాని అసలు డొల్లతనం బయటపడింది. మంగళవారం నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా వర్సిటీకి చెందిన అధికారులను 21మందిని అరెస్టు చేశారు. అక్రమ మార్గాల్లో హెచ్ 1 వీసాలకు ఇప్పించేందుకు యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అక్రమాలకు పాల్పడిందంటూ న్యూజెర్సీ అటార్నీ పాల్ జే ఫిష్ మేన్, అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అధికారి సరాహ్ ఆర్ సాల్దానా మీడియా సమావేశంలో వెల్లడించారు. వర్సిటీ గురించి తెలిసి కూడా విద్యార్థుల ప్రవేశాలు పొందడం నేరం కావడంతో ఇప్పుడు అక్కడ ఉన్న విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. అంతేకాదు.. విద్యార్థుల స్టడీ వీసాలను కొనసాగించేందుకు కొందరు మద్యవర్తులు సహాయపడటమే కాకుండా చట్ట విరుద్ధంగా వర్కింగ్ వీసాలు కూడా ఆ విద్యార్థులకు ఇప్పించారు. పెద్దపెద్ద కంపెనీలల్లో పనిచేసేందుకు కూడా ఆ విద్యార్థులు ఈ వీసాలను ఉపయోగించినట్లు తెలిపారు. అరెస్టయిన వారంతా కూడా అమెరికా బ్రోకర్లే. వీరిలో ఆరుగురు న్యూయార్క్‌లో ఉండేవారు కాగా.. మరో ముగ్గురు ఫ్లషింగ్.. క్వీన్స్‌లో ఉండేవారు. ఈ సందర్భంగా ఫిష్ మాన్ మాట్లాడుతూ.. నిజమైన విద్యార్థులకు తప్పక న్యాయం చేస్తామని అన్నారు. అక్రమంగా న్యూజెర్సీ 1,076మందికి ప్రవేశాలు కల్పించిందని, ఈ విద్యార్థులంతా కూడా చట్టబద్ధంగా స్టూడెంట్ వీసాలు కలిగి ఉన్నవారేనని, కాకపోతే వారంతా ఇక్కడే ఉండిపోయేందుకు కావాల్సిన మార్గాల గురించే ఎక్కువగా వెతికారని చెప్పారు. అంతేకాకుండా బ్రోకర్లు కూడా దారుణంగా వ్యవహరించారని అసలు వారు ఎవరికి ఈ అనుమతులిస్తున్నారో కూడా తనిఖీలు చేయలేదని, వారు విద్యార్థులా, ఉగ్రవాదులా అనే కనీసం సమాచారం తెలుసుకోకుండానే ప్రవేశాలు ఇచ్చారని, వీసా ఫ్రాడ్‌కు పాల్పడ్డారని అన్నారు. ఈ వర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థులను అదుపులోకి తీసుకునే అవకాశంగానీ, లేదంటే వారిని తిరిగి వెనక్కి పంపించే అవకాశంగానీ లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. -
భారతీయ దౌత్యకార్యాలయ అధికారి అరెస్ట్,విడుదల
వ్యకిగత సహాయకురాలి కోసం వీసా అవకతవకలకు పాల్పడి నిన్న అరెస్ట్ అయిన న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యవేత్త కార్యాలయంలో ఉన్నతాధికారి దేవయాని కొబ్రాగాడె బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ మేరకు మన్‌హట్టన్‌లోని అత్యున్నత ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీతి బరార్ శుక్రవారం వెల్లడించారు. రూ.25 వేల అమెరికన్ డాలర్లు చెల్లించి ఆమె విడుదల అయ్యారని చెప్పారు. స్వదేశం నుంచి వ్యక్తిగత సహాయకురాలుని తీసుకువచ్చే క్రమంలో వీసా కోసం పలు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో దేవయానికిని నిన్న ఉదయం లా ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దేవయానిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్యకార్యాలయం ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇచ్చింది. న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో డిప్యూటీ కౌనిల్స్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని రాజకీయ,ఆర్థిక, వాణిజ్య, మహిళ వ్యవహారాల విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.