వాషింగ్టన్: అమెరికా అధికారులు వీసా మోసానికి సంబంధించి 90 మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. తాజా అరెస్టులతో, మిషిగాన్ రాష్ట్రం డెట్రాయిట్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే నకిలీ వర్సిటీకి చెందిన 250 విద్యార్థులను అరెస్టు చేసినట్లయింది. ఈ ఏడాది మార్చిలో అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్(యూఎస్‌ఐసీఈ)అధికారులు ఈ వర్సిటీకి చెందిన 161 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ సమయంలో వర్సిటీలో 600 మంది, అందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
కాగా, అరెస్టయిన 250 మందిలో 80 శాతం మంది ఇప్పటికే అమెరికా విడిచి వెళ్లిపోయారని యూఎస్‌ఐసీఈ అధికారులు తెలిపారు. మరో 10 శాతం మందిని పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఫార్మింగ్టన్ వర్సిటీ ఫేక్ అని విద్యార్థులకు ముందుగానే తెలుసునని, అక్కడ ఎలాంటి క్లాసులు జరగడంలేదని అధికారులు వాదిస్తున్నారు. ఆ వర్సిటీలో విద్యార్థులను చేర్పించిన 8 మందిపై వీసా మోసం తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై టెక్సాస్ అటార్నీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టబద్ధంగా అమెరికా వలస రావాలనుకున్న వారు కూడా అనుకోకుండా కుట్రదారులకు చిక్కారని అన్నారు. ఈయన బాధిత విద్యార్థుల పక్షాన పోరాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment