ఇండియన్ స్టూడెంట్స్కు న్యూజెర్సీ గండం | New Jersey University Was Fake, but Visa Fraud Arrests Are Real | Sakshi
Sakshi News home page

ఇండియన్ స్టూడెంట్స్కు న్యూజెర్సీ గండం

Published Thu, Apr 7 2016 10:05 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

ఇండియన్ స్టూడెంట్స్కు న్యూజెర్సీ గండం

ఇండియన్ స్టూడెంట్స్కు న్యూజెర్సీ గండం

న్యూయార్క్: అమెరికాలో కొందరు భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ 1 వీసాకోసం వారు అనుసరించిన మార్గాలు వారిని చిక్కుల్లో పడేసేలా ఉంది. ఓ బోగస్ కాలేజీ తయారై వారికి ఆశలు రేకెత్తించి చివరకు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితిని కల్పించింది. అది ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు. అమెరికాలోని క్రాన్ఫోర్డ్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే పేరుతో విశ్వవిద్యాలయాన్ని 2013లో స్థాపించారు. ఉన్నత విద్యలో భాగంగా ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ కింద అకౌంటింగ్, మార్కెటింగ్, హెల్త్ కేర్ వంటి కోర్సులను అందిస్తామని ప్రకటించింది.

స్థానికంగా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ దీనికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. అదిగో అలా గుర్తింపు వచ్చినప్పటి నుంచి మొదలైంది అసలు దందా. ఎందుకంటే అది పైకి చూడ్డానికే ఓ యూనివర్సిటీ కానీ, అక్కడ పాఠాలు లేవు.. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. కేవలం హెచ్ 1 వీసాకు నిరాకరించబడిన వారిని చేర్చుకొని భారీ మొత్తంలో డబ్బులు దండుకునేందుకు స్థాపించబడిందే ఈ బోగస్ వర్సిటీ. సాధారణంగా అమెరికా విద్యకోసం వెళ్లిన వారికి తొలి ఏడాదిన్నరలో కర్రిక్యులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్(సీపీటీ) ప్రోగ్రాం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనే మరో కార్యక్రమం ఉంటుంది.

దీనిని సాధరణంగా కొన్నిగంటలపాటు పనిచేసుకుంటూ మరి కొన్ని గంటలు కాలేజీకి వెళ్లి చదువుకుంటూ ఏవో చిన్నచిన్న సంస్థల్లో పనిచేసుకుంటూ ఉంటారు. ఇవి పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు హెచ్ 1 వీసాకోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే, ఏకారణం రీత్యానైనా వారికి హెచ్ 1 వీసా లభించని పక్షంలో ఆ విద్యార్థులకు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. పైగా ఒక్కసారి హెచ్ 1వీసా నిరాకరించబడి ఇంటికొస్తే అలాంటి విద్యార్థికి తిరిగి అమెరికాలో విద్యకోసం అడుగుపెట్టే అవకాశం ఉండదు. అయితే, అలా వీసాకు నిరాకరించబడిన వాళ్లంతా తిరిగి వేరే కళాశాలల్లో ప్రవేశం పొంది పైన పేర్కొన్న సీపీటీ, ఓపీటీ చేసుకుంటూ తిరిగి హెచ్ 1 వీసాకోసం ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించేవారిని అందుకునేందుకు అక్కడ ఉన్న కొందరు దళారీలు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్తో చేతులు కలిపి చేసిన సృష్టే యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ.

ఈ వర్సిటీని స్థాపించి హెచ్ 1 వీసా పొందడంలో విఫలమైనవారందరిని ఇబ్బడిముబ్బడిగా సీట్లు ఇస్తూ ఒక వసతి గృహంలాగా తయారై విద్యార్థులకు చిన్నచిన్న సంస్థల్లో సీపీటీ, ఓపీటీ, హెచ్ 1 వీసాకోసం ప్రయత్నించడానికి అక్రమంగా సహకరించింది. ఇలా ఈ వర్సిటీలో చేరినవాళ్లలో భారతీయులు, చైనీయులే అధికం. వీరంతా దాదాపు వెయ్యిమందికి పైగే ఉన్నారు. ఇందులో వాస్తవానికి చదువుకుందామని చేరినవారు కొందరైతే దీని బాగోతం ముందే తెలిసి ఏదో షెల్టర్ దొరికితే చాలు హెచ్ 1వీసాకోసం ప్రయత్నించవచ్చు అని చేరిన విద్యార్థులు కొందరు. వాస్తవానికి ఇలాంటి చర్యలకు ఓ వర్సిటీ పాల్పడటం చట్టప్రకారం నేరం. హెచ్ 1 వీసాల విషయంలో ఇటీవల కాలంలో సీరియస్ గా స్పందిస్తున్న అమెరికా ఉన్నతాధికారులు వర్సిటీల తీరుపై దృష్టిసారించారు.

అందులో భాగంగానే యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా దాని అసలు డొల్లతనం బయటపడింది. మంగళవారం నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా వర్సిటీకి చెందిన అధికారులను 21మందిని అరెస్టు చేశారు. అక్రమ మార్గాల్లో హెచ్ 1 వీసాలకు ఇప్పించేందుకు యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అక్రమాలకు పాల్పడిందంటూ న్యూజెర్సీ అటార్నీ పాల్ జే ఫిష్ మేన్, అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అధికారి సరాహ్ ఆర్ సాల్దానా మీడియా సమావేశంలో వెల్లడించారు. వర్సిటీ గురించి తెలిసి కూడా విద్యార్థుల ప్రవేశాలు పొందడం నేరం కావడంతో ఇప్పుడు అక్కడ ఉన్న విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. అంతేకాదు.. విద్యార్థుల స్టడీ వీసాలను కొనసాగించేందుకు కొందరు మద్యవర్తులు సహాయపడటమే కాకుండా చట్ట విరుద్ధంగా వర్కింగ్ వీసాలు కూడా ఆ విద్యార్థులకు ఇప్పించారు.

పెద్దపెద్ద కంపెనీలల్లో పనిచేసేందుకు కూడా ఆ విద్యార్థులు ఈ వీసాలను ఉపయోగించినట్లు తెలిపారు. అరెస్టయిన వారంతా కూడా అమెరికా బ్రోకర్లే. వీరిలో ఆరుగురు న్యూయార్క్లో ఉండేవారు కాగా.. మరో ముగ్గురు ఫ్లషింగ్.. క్వీన్స్లో ఉండేవారు. ఈ సందర్భంగా ఫిష్ మాన్ మాట్లాడుతూ.. నిజమైన విద్యార్థులకు తప్పక న్యాయం చేస్తామని అన్నారు. అక్రమంగా న్యూజెర్సీ 1,076మందికి ప్రవేశాలు కల్పించిందని, ఈ విద్యార్థులంతా కూడా చట్టబద్ధంగా స్టూడెంట్ వీసాలు కలిగి ఉన్నవారేనని, కాకపోతే వారంతా ఇక్కడే ఉండిపోయేందుకు కావాల్సిన మార్గాల గురించే ఎక్కువగా వెతికారని చెప్పారు.

అంతేకాకుండా బ్రోకర్లు కూడా దారుణంగా వ్యవహరించారని అసలు వారు ఎవరికి ఈ అనుమతులిస్తున్నారో కూడా తనిఖీలు చేయలేదని, వారు విద్యార్థులా, ఉగ్రవాదులా అనే కనీసం సమాచారం తెలుసుకోకుండానే ప్రవేశాలు ఇచ్చారని, వీసా ఫ్రాడ్కు పాల్పడ్డారని అన్నారు. ఈ వర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థులను అదుపులోకి తీసుకునే అవకాశంగానీ, లేదంటే వారిని తిరిగి వెనక్కి పంపించే అవకాశంగానీ లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement