వీసా మోసాలపై ఉక్కుపాదం: కేటీఆర్
• అక్రమ ఏజెంట్లను ఏరేస్తామన్న మంత్రి
• నూతన పాలసీపై ఎన్నారైలతో సమాలోచన
సాక్షి, హైదరాబాద్ : వీసా మోసాలకు పాల్పడుతున్న అక్రమ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. గ్రామాల్లో ఉన్న అక్రమ ఏజెంట్లను పోలీసుల సహాయంతో ఏరివేస్తామన్నారు. త్వరలో ‘ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్’తో సమావేశమై అక్రమ ఏజెంట్లపై చర్యల కోసం నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. తెలంగాణ ఎన్నారై పాలసీ రూపకల్పనలో భాగంగా బుధవారం ఇక్కడ ఎన్నారైలు, ఎన్నారై సంస్థలు, సంఘాలతో మంత్రి సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరించారు.
నైపుణ్యం లేని బ్లూకాలర్ ఎన్నారైల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలంటూ విజ్ఞప్తులు వచ్చాయన్నారు. వివిధ అంశాలపై వచ్చిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని దేశంలోనే ఉత్తమ ఎన్నారై పాలసీని తీసుకొస్తామన్నారు. విదేశాలకు వలస వెళ్లడానికి ముందు ఆయా దేశాల్లో ఆచరించాల్సిన పద్ధతులు, అక్కడి చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. విదేశాలకు వలస వెళ్లినవారి సమగ్ర సమాచారనిధిని రూపొందించడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రవాసి దివస్‌ను నిర్వహించి విదేశాల్లో రాణిస్తున్న ప్రవాసీయులు, ఉత్తమ కార్మికులు, ఏజెంట్లకు పురస్కారాలు అందిస్తామని చెప్పారు.
ప్రవాసీయుల కోసం ఐటీ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషాల్లో వెబ్ పోర్టల్‌ను తీసుకొస్తామని, తెలుగు కార్మికుల కోసం గల్ఫ్ దేశాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, తొలుత దుబాయ్ నుంచి శ్రీకారం చుడతామన్నారు. ప్రవాసీయుల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అనుసంధానం చేస్తామని, దీనిపై శనివారం కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌తో ఢిల్లీలో సమావేశం అవుతానన్నారు.
నువ్వెందుకు ఉన్నావు: అధికారిపై మంత్రి ఆగ్రహం
రాష్ట్రంలో వీసా మోసాలకు పాల్పడుతున్న అక్రమ ఏజెంట్ల సమాచారాన్ని ఇతరులు అందజేసినా చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వెందుకు ఉన్నావ్.. ఇంత కాలం ఏం చేస్తున్నావ్.. నువ్వు వలసదారుల రక్షకుడివి కాదా? అక్రమ ఏజెంట్లను అరికట్టడం నీ బాధ్యత కాదా?’ అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అక్రమ ఏజెంట్ల వివరాలను ఏటా ప్రభుత్వానికి అందజేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని పలువురు గుర్తింపు పొందిన ఏజెంట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.