ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా స్ఫూర్తివంతమైన విషయాలను యువతతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే పది లక్షల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. రతన్ టాటా ఎప్పుడూ ఏ విషయం చెబుతారా అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్‌టాటా తన బాల్యం, ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రెండవ భాగం ఇంటర్వ్యూలో మరి కొన్ని విషయాలు పంచుకున్నారు. (అలా మా బంధం బీటలు వారింది: రతన్ టాటా)
1991 లో జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా నుంచి టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్య వారసుడిగా రతన్ టాటా బాధ్యతలు అందిపుచ్చుకున్నారు. ఆ సమయంలో బంధుప్రీతిపై రతన్ టాటా ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చారు. అవి ఆయన మాటల్లోనే.. ‘‘నేను టాటా గ్రూప్‌లో చేరినప్పడు ఎలాంటి విమర్శలు లేవు. కానీ ఎప్పుడైతే టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి జేఆర్‌డీ టాటా వైదొలగాని నిర్ణయించుకున్నారో అప్పడు విమర్శలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే చైర్మన్ పదవికి కోసం ఆ సమయంలో ఎంతోమంది ఆశపడ్డారు. కానీ జేఆర్‌డీ.. నన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. దీంతో జేఆర్‌డీ బంధుప్రీతి కారణంగానే.. రతన్‌కు బాధ్యతలు అప్పజెప్పి తప్పు చేశారంటూ విపరీతమైన విమర్శలు వెలువడ్డాయి. విమర్శ అనేది ఆ కాలంలో వ్యక్తిగతంగా చేసేవారు. అయితే ఆ సమయంలో నేను ఎదురు దాడికి దిగలేదు. సంయమనం పాటించి నా పని ద్వారా నన్ను నేను నిరూపించుకోవడంపై దృష్టి సారించాను’’ అని వెల్లడించారు. (రతన్ టాటా అద్భుత రిప్లై)
ఇక జేఆర్‌డీకీ తనకు మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ.. ‘జేఆర్‌డీ నాకు తండ్రి, అన్న లాంటి వారు. అతన్ని సన్నిహితుడిగా కలిగి ఉండటం నా అదృష్టం. అతను గొప్ప గురువు. ఆయన గురించి మాటల్లో ఇంతకంటే ఏం చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా జహంగీర్ రతన్‌జీ దాదాబాయ్ టాటా, రతన్ టాటా.. టాటా కుటుంబంలోని విభిన్న నేపథ్యాల నుంచి వచ్చారు. దాదాపు 50 ఏళ్ల పాటు టాటా కంపెనీకి నాయకత్వం వహించిన జేఆర్‌డీ టాటా అనంతరం తన వ్యాపార సామ్రాజ్య వారసుడిగా 1991లో రతన్ టాటాను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment