
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా తన గురువు జేఆర్‌డీ టాటా (జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా)ను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. జేఆర్‌డీ టాటా 118వ జయంతి సందర్భంగా టాటాసన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. తాను ‘జే’ అని పిలుచుకునే జేఆర్‌డీ టాటా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తామిద్దరూ కలిసి జీవించిన కాలంలో ఆయన తన మీద అపారమైన ప్రభావాన్ని మిగిల్చి వెళ్లారని, ఇద్దరి మధ్య చాలా సారూప్యతలుండేవని పేర్కొన్నారు. ఆయన ప్రేమను, అభిమానాన్ని మిస్ అవుతున్నానంటూ రాశారు. ఈ రోజు జే మన మధ్య లేకపోయినా ఆయన గొప్పతనం, వారసత్వం కొనసాగుతుందని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఆర్‌డీ టాటా ఫోటోను షేర్ చేశారు. దీంతో కొన్న గంటల వ్యవధిలోనే లక్షల లైక్‌లతో వైరల్‌గా మారింది. గత ఏడాది కూడా పూణే ప్లాంట్‌లో టాటా ఎస్టేట్ లాంచ్ వేడుకలో తీసుకున్న ఫోటోనొకదాన్ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: Gold Demand Up: ఆభరణాలు తెగ కొనేశారుగా..!)
దేశంలోని ఉత్తమ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్‌టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తానం ఎందరో యువ పారిశ్రామిక వేత్తలకు, వ్యాపార వేత్తలకు పుస్తకం లాంటిది. భారత్‌లో పురాతన కాలం నాటి అతిపెద్ద వ్యాపార, పారిశ్రామిక సంస్థ టాటా సన్స్ సారధిగా సంస్థను ఎన్నో విజయ తీరాలకు చేర్చారు. అంతేకాదు వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, సామాజిక సేవలు, దాతృత్వంలోనూ తన ప్రత్యేకతను చాటు కున్నారు. కాగా రతన్ టాటా జీవిత చరిత్ర ‘ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ’ పేరుతో ఈ ఏడాది నవంబరులో రానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ టాటా జీవిత చరిత్ర పుస్తక ప్రచురణ హక్కులను భారత్‌కు చెందిన హార్పర్ కాలిన్స్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment