155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా ప్రపంచంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చాలామంది మాదిరిగానే రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన సారధ్యంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపార సంస్థగా ఎదిగింది. రతన్ టాటా తొలినాళ్లలో ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను ఎలా సిద్ధం చేశారు? ఉద్యోగం ఎలా దక్కించుకున్నారు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రతన్ టాటా మొదటి రెజ్యూమ్
అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. అయితే అతని గురువు, బంధువు అయిన జేఆర్‌డీ టాటాకు ఇది సంతృప్తి కలిగించలేదు. నాటి రోజులను రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు, ‘అతను(జేఆర్‌డీ టాటా) ఒక రోజు నాకు ఫోన్ చేశారు. మీరు భారతదేశంలో ఉంటూ, ఐబీఎంలోనే ఎందుకు ఉద్యోగం చేయడం?’ అని అడిగారు. దీంతో టాటా గ్రూప్‌లో ఉద్యోగం చేసేందుకు రతన్ టాటా తన రెజ్యూమ్‌ను జేఆర్‌డీ టాటాకు అందజేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అతని వద్ద రెజ్యూమ్ లేదు. వెంటనే రతన్ టాటా తాను పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ సాయంతో తన రెజ్యూమ్‌ను రూపొందించారు. తాను ఐబీఎం ఆఫీస్‌లో ఉన్నానని, తనను జేఆర్‌డీ టాటా రెజ్యూమ్ అడిగారనే విషయం తనకు గుర్తుందని ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పనిచేస్తున్న ఆఫీసులో ఎలక్ట్రిక్ టైప్ రైటర్లు ఉండటంతో ఒక రోజు సాయంత్రం ఆ టైప్ రైటర్ సాయంతో రెజ్యూమ్ టైప్ చేసి అతనికి ఇచ్చానని తెలిపారు.
1962లో మొదటి ఉద్యోగం
రెజ్యూమెను అందించిన తర్వాత రతన్ టాటాకు 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం తర్వాత, 1991లో జేఆర్‌డీ టాటా మరణానంతరం రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్లలో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. నాటిరోజుల్లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడాలని రతన్‌టాటా భావించారు. అయితే తమ అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment