భారత దేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ఇటీవలే కన్నుమూశారు. ఈయన మరణం ప్రతి ఒక్కరినీ బాధించింది. తాజాగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ లింక్డ్‌ఇన్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
రతన్ టాటాతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ భారతదేశం పట్ల అతని దయ, ఆప్యాయతను తప్పకుండా తెలుసుకుంటారు. ప్రారంభంలో వ్యాపార అంశాలను గురించి ప్రారంభమైన మా పరిచయం.. కొంతకాలానికి వ్యక్తిగత పరిచయంగా మారిపోయింది. కార్లు, హోటల్స్ గురించి చర్చ ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఇతర విషయాల గురించి చర్చించేవాళ్ళం. అయితే రతన్ టాటా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించేవారు.
2017లో టాటా మోటార్స్, దాని ఎంప్లాయీస్ యూనియన్ మధ్య చాలా కాలంగా ఉన్న వేతన వివాదం పరిష్కరించే సమయంలో చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించడంలో జరిగిన ఆలస్యానికి చింతిస్తూ.. దానిని వెంటనే పరిష్కరించనున్నట్లు రతన్ టాటా హామీ ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు గురించి కూడా ఆయన ఆలోచించేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బాంబే హౌస్ పునరుద్దరణ అంశం గురించి కూడా చంద్రశేఖరన్ ప్రస్తావించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇందులోని ప్రతి వస్తువును దగ్గరలో ఉండే కార్యాలయానికి తరలిస్తామని రతన్ టాటాతో చెప్పాము. అప్పుడు అక్కడున్న కుక్కల పరిస్థితిపై ఆరా తీశారు. వాటికోసం కెన్నెల్ తయారు చేస్తామని చెప్పాము. ఆ తరువాత రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది.
బాంబే హౌస్ రేనోవేషన్ పూర్తయిన తరువాత నేను మొదటి కెన్నెల్ చూస్తానని రతన్ టాటా చెప్పారు. ఆ తరువాత కుక్కల కోసం కెన్నెల్ తయారు చేశాము. రతన్ టాటా ఎంతగానో సంతోషించారు. ఇలా ఎప్పుడూ కుక్కల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా
రతన్ టాటాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ప్రదేశాన్ని సందర్శిస్తే.. ఏళ్ళు గడిచినా అక్కడున్న ప్రతిదాన్ని గుర్తుంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇప్పుడు లేరు అన్న విషయం జీర్ణించుకోలేని అంశం. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment