
2015లో గుజరాత్‌లోని మాండ్వికి చెందిన మాజీ గూగుల్ ఉద్యోగి 'సన్మయ్ వేద్' గూగుల్ డొమైన్ (Google Domain) కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని గ్రహించి.. కేవలం 12 డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
2015 సెప్టెంబర్ 29 తెల్లవారుజామున 1:20 గంటలకు ఒక వింత జరిగింది. నేను Google Domains ఇంటర్‌ఫేస్ గురించి తెలుసుకుంటూ ఉన్న సమయంలో.. గూగుల్.కామ్ అని టైప్ చేసి, సెర్చ్ డొమైన్‌లపై క్లిక్ చేసాను. అప్పుడు గూగుల్.కామ్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నట్లు చూసి ఆశ్చర్యపోయాను.

నేను డొమైన్ పక్కన ఉన్న యాడ్ టు కార్ట్ ఐకాన్‌ను క్లిక్ చేసాను (డొమైన్ అమ్మకానికి అందుబాటులో లేకపోతే అది కనిపించకూడదు). ఆకుపచ్చ చెక్-బాక్స్ ద్వారా కనిపించే విధంగా డొమైన్ నా కార్ట్‌కు యాడ్ అయింది. బహుశా లావాదేవీల సమయంలో ఎర్రర్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఎలాంటి సమస్య లేకుండా నా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు కట్ అయ్యాయి. నేను గూగుల్.కామ్ డొమైన్ కొనుగోలు చేసినట్లు రెండు ఈ మెయిల్స్ కూడా వచ్చాయి.

గూగుల్ డొమైన్ కొనుగోలు విజయవంతంగా పూర్తయిన తరువాత.. గూగుల్ డొమైన్స్ నుంచి ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు ఈ మెయిల్ వచ్చింది. నేను ఉపయోగించిన రిజిస్ట్రేషన్ సర్వీస్ (aka Google Domains) గూగుల్‌కు చెందినది కావడంతో.. కంపెనీ దీనిని రద్దు చేయగలిగింది.
ఇదీ చదవండి: ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
డొమైన్ క్యాన్సిల్ అయిన తరువాత గూగుల్ కంపెనీ నాకు.. కొంత మొత్తంలో రివార్డును ప్రకటించింది. ఆ డబ్బును ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇండియా ఫౌండేషన్‌కు ఛారిటీకి విరాళంగా ఇవ్వమని చెప్పాను. నా అభ్యర్థన మేరకు వారు సరే అన్నారు. రివార్డు మొత్తాన్ని కూడా రెట్టింపు చేశారు.